ఎమ్మెల్యే రోజా తమ్ముడికి విషయాలన్నీ చెప్పా : డిప్యూటీ సీఎం

ABN , First Publish Date - 2020-05-27T13:23:09+05:30 IST

పుత్తూరు దళితవాడలో కల్యాణమండపం నిర్మించేందుకు మంగళవారం స్థల పరిశీలన జరిగింది.

ఎమ్మెల్యే రోజా తమ్ముడికి విషయాలన్నీ చెప్పా : డిప్యూటీ సీఎం

  • పుత్తూరు దళితవాడలో కల్యాణమండపం 
  • స్థల పరిశీలన చేసిన డిప్యూటీ సీఎం, కలెక్టర్‌ 


చిత్తూరు/పుత్తూరు : పుత్తూరు దళితవాడలో కల్యాణమండపం నిర్మించేందుకు మంగళవారం స్థల పరిశీలన జరిగింది. పుత్తూరు ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద ఉన్న తట్రవానిగుంటలో  కల్యాణ మండపం నిర్మించేందుకు మంగళవారం ఉదయం కలెక్టర్‌  భరత్‌గుప్తాతో పాటు డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎమ్మెల్యే ఆదిమూలం, జేసీ వీరబ్రహ్మం, విశ్రాంత జడ్జి దొరస్వామి స్థల పరిశీలన చేశారు. దళితులకు 1977లో ఇళ్ల పట్టాలను ఇచ్చినా.. నేడు ఆ స్థలాన్ని కల్యాణ మండపానికి అప్పగించనున్నారని అంబేడ్కర్‌ ట్రస్ట్‌ భవన్‌ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆదిమూలం గత బుధవారం తహసీల్దార్‌కు వినతి పత్రమిచ్చారు. ఈ నేపథ్యంలో తిరుపతికి వెళుతున్న కలెక్టర్‌ను స్థల పరిశీలన చేయాలని కోరడంతో నాయకులతో కలిసి పర్యటించారు. ఈ కల్యాణ మండపంతో పాటు అంబేడ్కర్‌ భవన్‌ పక్కనే ఉన్న రెయిన్‌ గేజ్‌ స్థలాన్ని మరో ప్రాంతానికి తరలించి భవనాన్ని విస్తరించేందుకు అప్పగించాలని కూడా కోరారు. ఇదిలావుండగా  పుత్తూరులో కలెక్టర్‌ పర్యటనకు తనను ఆహ్వానించక పోవడంపై ఎమ్మెల్యే రోజా వర్గం మండిపడింది.


అయితే ఈ విషయంపై సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం వివరణ ఇస్తూ ... తమ వర్గం వారికి ఇచ్చిన గుంటలో ఆక్రమణలు పెరిగిపోతున్నాయని, వెంటనే తమ సంఘం అభివృద్ధికి కేటాయించాలని కోరేందుకు కలెక్టర్‌తో స్థల పరిశీలన చేశామన్నారు. శంకుస్థాపన వంటి కార్యక్రమాలు చేపట్టడం లేదని తెలిపారు. కొన్నేళ్లుగా అంబేడ్కర్‌ ట్రస్ట్‌ భవన్‌ ద్వారా విగ్రహావిష్కరణ, అంబేడ్కర్‌ భవన నిర్మాణం వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు.


మా మధ్య ఎలాంటి బేధాభిప్రాయాల్లేవ్..

తమ మధ్య ఎలాంటి బేధాభిప్రాయాలు లేవని, కల్యాణ మండపం విషయాలన్నీ ఎమ్మెల్యే రోజా సోదరుడికి తెలిపానని వివరించారు. ఇలా ఉండగా మంగళవారం సాయంత్రం దళిత నాయకులు కొంతమంది రోజాను కలిసి సహకరించాలని కోరారు. రోజాను కలిసినవారిలో విశ్రాంత జిల్లా జడ్జి దొరస్వామి, సంఘం నాయకులు అపరంజి, కుప్పయ్య, మావూళ్ళయ్య ఉన్నారు.

Updated Date - 2020-05-27T13:23:09+05:30 IST