అడ్డగోలుగా డిప్యుటేషన్లు

ABN , First Publish Date - 2021-04-19T06:24:41+05:30 IST

ఓ వైపు కరోనా మహమ్మారి రెండో విడత విలయతాండవం చేస్తున్న వేళ వైద్య ఆరోగ్యశాఖలో అడ్డగోలుగా డిప్యూటేషన్ల పర్వ నడుస్తోంది.

అడ్డగోలుగా డిప్యుటేషన్లు

కరోనా వేళ కానరాని వైద్యాధికారులు

కందుకూరు, ఏప్రిల్‌ 18: ఓ వైపు కరోనా మహమ్మారి రెండో విడత విలయతాండవం చేస్తున్న వేళ వైద్య ఆరోగ్యశాఖలో అడ్డగోలుగా డిప్యూటేషన్ల పర్వ నడుస్తోంది. ఆ శాఖ ఉన్నతాధికారులు అవినీతిలో మునిగితేలుతూ ఈ డిప్యూటేషన్లను ప్రోత్సహిస్తున్నారన్న విమర్శలు న్నాయి. ఇక కొంత మంది వైద్యాధికారులు పీహెచ్‌సీల వైపు కూడా చూడడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. డిప్యూటేషన్లకు అడ్డుకట్ట వేయకపోతే నేరుగా కలెక్టరేట్‌ వద్ద ఆందోళనకు దిగుతానని ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి సైతం ఆగ్రహం వ్యక్తం చేయడం పరిస్థితి తీవ్రతకు దర్పణం పడుతోంది.

కందుకూరు నియోజకవర్గంలో ఇటీవల ఉలవపాడు మండలం కరేడులో ఓ వైద్యాధికారికి డిప్యుటేషన్‌ వేసినట్లు తెలిసింది. అదే మండలంలో చాకిచర్ల పీహెచ్‌సీలో కూడా ఓ వైద్యాధికారి డిప్యూటేషన్‌ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. అతని ప్రయత్నాలకు అనుకూలంగా రంగం సిద్ధమైనట్లు తెలిసింది. లింగసముద్రం పీహెచ్‌సీలో ఓ వైద్యాధికారి కూడా డిప్యుటేషన్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు...! ఆయన అసలు పీహెచ్‌సీ వైపు కన్నెత్తి చూడడం లేదనే విమర్శలున్నాయి. అలాగే కందుకూరు మండలం మాచవరం పీహెచ్‌సీలో ఇటీవల బాధ్యతలు చేపట్టిన రెండవ వైద్యాధికారి కూడా ఒంగోలుకి డిప్యుటేషన్‌ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయన ప్రయత్నాలు ఫలించే దశలో ఉన్నట్లు చెబుతున్నారు. వైద్యులనే కాకుండా పలువురు వైద్య సిబ్బందికి కూడా డిప్యూటేషన్లు వేస్తుండడం విశేషం. 

మాచవరం పీహెచ్‌సీలో సూపర్‌వైజరుగా పనిచేస్తున్న ఓ వ్యక్తి కొన్ని ఏళ్లుగా డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో ఆఫీసులో బాధ్యతల పేరుతో ఎక్కడా పనిచేయకుండా తిరుగుతున్నట్లు సమాచారం. గత డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో అవినీతి, అసాంఘిక వ్యవహారాలపై సస్పెండ్‌ అయిన క్రమంలోనూ, ఈ సూపర్‌వైజర్‌పై పలు ఆరోపణలు వచ్చాయి. అయినప్పటికీ, అతను అదే బాధ్యతల్లో  ఉన్నతాధికారులకు ఎంత చేదోడు వాదోడు నేటికి కొనసాగుతున్నాడు. లింగసముద్రం, చాకిచర్ల పీహెచ్‌సీ వైద్యులు అసలు పీహెచ్‌సీలకే రాకుండా క్యాంపుల పేరుతో కాలం గడిపేస్తున్నా అడిగే నాథుడు కరువయ్యారనే ఆరోపణలున్నాయి. ఇక కొంత మంది సిబ్బంది పూర్తిగా విధులకు దూరంగా ఉంటూ, ఉన్నతాధికారులకు నజరానాలు ముట్టజెబుతున్నారన్న విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. 

తనిఖీల ఊసే కరువు

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తరచూ ఆ శాఖ ఉన్నతాధికారులు జిల్లా అధికారులు తనిఖీ చేస్తారు. డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌లు విధి నిర్వహణలో భాగంగా పీహెచ్‌సీలను పర్యవేక్షించాలి. ఇక్కడ వైద్యాధికారులు, సిబ్బంది ఇష్టారీతిన వ్యవహరిస్తున్నా జిల్లా అధికారులు కన్నేత్తి కూడా చూడడం లేదు. ఒంగోలు నగరానికే పరిమితమైన అధికారులు ఈ వైపు కన్నేత్తి చూడడం లేదు. ఇక ఇష్టానుసారం  డిప్యూటేషన్లు వేయడంపై  డీఎంఅండ్‌హెచ్‌వోకు భారీగానే ముడుపులు అప్పజెబుతున్నారని పలువురు వైద్య సిబ్బందే చెవులు గొనుక్కొవడం గమనార్హం.

కరోనా వేళైన దృష్టి సారించేనా..

కరోనా మొదటి దశలోనూ కందుకూరులో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభించింది.  ప్రస్తుతం రెండవ దశలోనూ నిత్యం పదుల సంఖ్యలో కొత్తగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇక ఇటీవల కాలంలో మరణాలు కూడా పెద్దసంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ప్రజా ప్రతినిధులను సమన్వయ పరుచుకొని తగు నివారణ ఏర్పాట్లు, వైద్య పరీక్షలు, చికిత్సలు అందించాల్సి ఉంది. అయితే ఆ దశగా వైద్యాధికారులు చొరవ చూపడం లేదు. ఇక చుట్టపు చూపుగా ఈ వైపు చూసే జిల్లా కలెక్టర్‌ అయినా ఇక్కడి డిప్యూటేషన్ల వ్యవహారంపై దృష్టి సారించాలని, అదే విధంగా వైద్యసేవలను మెరుగు పరచాలని ప్రజలుకోరుతున్నారు.

Updated Date - 2021-04-19T06:24:41+05:30 IST