కరోనా కాటుపై మాంద్యం పోటు

ABN , First Publish Date - 2020-08-28T06:06:00+05:30 IST

కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచం ఇప్పట్లో కోలుకునేలా లేదు. అంతటి పెద్ద ఆర్థికమాంద్యం ఈ శతాబ్దంలో ఎప్పుడూ చూడలేదు. ఇదే విషయాన్ని ఇటీవల ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్...

కరోనా కాటుపై మాంద్యం పోటు

కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచం ఇప్పట్లో కోలుకునేలా లేదు. అంతటి పెద్ద ఆర్థికమాంద్యం ఈ శతాబ్దంలో ఎప్పుడూ చూడలేదు. ఇదే విషయాన్ని ఇటీవల ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్‌ డెవలప్‌మెంట్ (ఓఈసీడీ) సైతం తన నివేదికలో ధ్రువీకరించింది. కరోనా మహమ్మారితో వ్యాపారాలన్నీ కుదేలైపోయాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థలు పాక్షికంగా, శాశ్వతం‌గా మూతబడ్డాయి. ఫలితంగా కోట్లాది ఉద్యోగాలు హుష్‌కాకి అయిపోయాయి. ఈ మహమ్మారి ఓ భీకర అంతర్జాతీయ మాంద్యానికి దారితీసింది. ఈ దెబ్బతో ప్రపంచం మొత్తం విలవిలలాడుతోంది. అర్థంకాని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఈ విపత్కర పరిస్థితి ఇప్పట్లో సద్దుమణిగేలా కూడా కనిపించడం లేదు. ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకూ కరోనా వైరస్ తీవ్రత ప్రమాదకరస్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో నియంత్రణ తప్ప ఇప్పటికీ నివారణే లేని ఈ మహమ్మారిని అదుపు చేయడానికి దాదాపు అన్ని దేశాలు లాక్‌డౌన్‌ పాటించక తప్పలేదు.


భారత్‌లోనూ రెండు నెలలకు పైగా లాక్‌డౌన్‌ పూర్తి స్థాయిలోనూ, ఆ తరువాత సడలింపులతోనూ అమలవుతోంది. దీని ప్రభావంగా చిన్నా పెద్ద సంస్థలు అన్నీ మూతపడ్డాయి. ఫలితంగా ఒక్క భారత్‌లోనే కాకుండా దాదాపు అన్ని దేశాల్లోనూ కోట్లాది ఉద్యోగాలు కోల్పోవలసి వచ్చింది. ఇది యువత, పేద ప్రజలపై తీవ్ర ప్రభావం చూపింది. ఇప్పటికిప్పుడు వైరస్ తీవ్రత తగ్గిపోయి కేసుల సంఖ్య తగ్గితే ప్రపంచ జీడీపీ వృద్ధిరేటు ఈ ఏడాది 6 శాతంగా ఉండొచ్చని ఒక అంచనా. కరోనా రోగాల తీవ్రతను తగ్గించే మందులు ఇప్పుడిప్పుడే కొన్ని దేశాల్లో అందుబాటులోకి వస్తున్నాయి. రోగమే రాకుండా రక్షించే వాక్సిన్ కూడా వచ్చే ఐదారు నెలల్లో వస్తుందనే అంచనాల నేపథ్యంలో రాబోయే ఏడాది మాత్రం 28 శాతం వృద్ధి కనపడవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది భారత్ వృద్ధి మైనస్ 5 శాతానికి పడిపోనున్నదని తెలిపిన ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ‘ఫిచ్’ వచ్చే ఏడాది మాత్రం దేశ వృద్ధిరేటు తిరిగి కోలుకునే అవకాశాలున్నాయని అంచనా వేస్తోంది. కరోనా మళ్లీ ప్రమాదకర స్థాయికి చేరినా, చేరకపోయినా పరిణామాలు మాత్రం చాలా తీవ్రంగానే ఉండే అవకాశం ఉంది. వైరస్‌ను అదుపు చేయకపోతే వృద్ధి రేటు అంచనాలన్నీ మళ్ళీ తారుమారవుతాయి. కరోనాను ఇప్పటికిప్పుడు కట్టడి చేయగలిగినా ఈ ప్రభావం వచ్చే రెండు మూడేళ్లవరకూ కొనసాగే అవకాశమే ఉంటుంది.

శ్రీనివాస్ గౌడ్ ముద్దం

Updated Date - 2020-08-28T06:06:00+05:30 IST