Bengaluru: విషాద ఘటన.. కొడుకు పుట్టినరోజు సెలబ్రేట్ చేయాలనుకున్న ఆ తల్లి జీవితం చివరికిలా..

ABN , First Publish Date - 2022-05-09T23:21:43+05:30 IST

ఆర్థిక ఇబ్బందులు ఆ అమ్మను నైరాశ్యంలోకి నెట్టేశాయి. కొడుకు పుట్టినరోజును జరిపేందుకు కూడా డబ్బు లేకపోవడంతో మానసికంగా కుంగిపోయింది. చివరకు రెండేళ్ల కొడుకును..

Bengaluru: విషాద ఘటన.. కొడుకు పుట్టినరోజు సెలబ్రేట్ చేయాలనుకున్న ఆ తల్లి జీవితం చివరికిలా..

బెంగళూరు: ఆర్థిక ఇబ్బందులు ఆ అమ్మను నైరాశ్యంలోకి నెట్టేశాయి. కొడుకు పుట్టినరోజును జరిపేందుకు కూడా డబ్బు లేకపోవడంతో మానసికంగా కుంగిపోయింది. చివరకు రెండేళ్ల కొడుకును, మూడేళ్ల కూతురిని ఆ పేదరికంలోనే వదిలేసి ఆ అమ్మ ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఈ విషాద ఘటన కర్ణాటకలోని బెంగళూరు పట్టణంలో వెలుగుచూసింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకలోని రామనగర జిల్లా కనకపుర తాలూకాలోని గిరిగౌడనదొడ్డి గ్రామానికి చెందిన తేజస్విని అనే మహిళ శుక్రవారం ఇంట్లో ఉన్న ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.



ఆమె తమ్ముడు అజయ్ కుమార్ ఈ ఘటనపై స్పందిస్తూ.. తన సోదరి తేజస్వినికి, శ్రీకాంత్ అనే వ్యక్తికి కొన్నేళ్ల క్రితం వివాహం జరిగిందని చెప్పాడు. వీరికి దీక్షా, ధనుష్ అనే ఇద్దరు పిల్లలు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవారు. వ్యవసాయంలో ఆశించిన స్థాయిలో ఆదాయం రాకపోవడంతో శ్రీకాంత్ లోన్ తీసుకుని ఫౌల్ట్రీ ఫామ్ పెట్టాడు. అయితే.. ఫౌల్ట్రీ ఫామ్‌ వ్యాపారం శ్రీకాంత్‌కు భారీ నష్టాలను మిగిల్చింది. అతని కుటుంబాన్ని తీవ్ర ఆర్థిక సమస్యల్లోకి నెట్టేసింది. ఈ పరిణామాలతో శ్రీకాంత్ భార్య తేజస్విని తీవ్ర మనస్తాపానికి లోనైంది. అయితే.. ఈ సమస్యలు ఎప్పుడూ ఉండేవేనని గుండె దిటవు చేసుకుని గడుపుతున్న ఆమె కొడుకు రెండో పుట్టినరోజు చేయాలని భావించింది. ఈ విషయాన్ని భర్తతో చెప్పింది.



కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో ఈ పరిస్థితుల్లో పుట్టినరోజు సెలబ్రేషన్స్ లాంటివి వద్దని, తాను మైసూరు నుంచి వచ్చే వరకూ వేచి ఉండమని భార్య తేజస్వినికి శ్రీకాంత్ చెప్పాడు. ఈ పరిణామంతో తీవ్ర మనస్తాపానికి లోనైన తేజస్విని కొడుకు పుట్టినరోజు చేసేందుకు కూడా ఆలోచించాల్సిన దుస్థితి వచ్చిందని మానసికంగా కుంగిపోయింది. ఇంట్లోని ఫ్యానుకు చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. శుక్రవారం సాయంత్రం 5.30 గంటల సమయంలో గ్రామస్తులకు ఈ విషయం తెలిసింది. ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.

Read more