చితికిపోయారు

ABN , First Publish Date - 2020-10-01T09:14:03+05:30 IST

ఒకరు ఆరేళ్ల బాలుడు, మరొకరు మూడేళ్ల చిన్నారి. ఇద్దరూ బుధవారం వేర్వేరుగా జరిగిన ప్రమాదాల్లో మృత్యువాత పడ్డారు.

చితికిపోయారు

పోలీస్‌ వాహనం ఢీకొని బాలుడు..

టిప్పర్‌ కింద పడి మూడేళ్ల చిన్నారి దుర్మరణం

వేర్వేరు ప్రాంతాల్లో ఘటనలు  


మంగళ్‌హాట్‌/మదీన, సెప్టెంబర్‌ 30 (ఆంధ్రజ్యోతి): ఒకరు ఆరేళ్ల బాలుడు, మరొకరు మూడేళ్ల చిన్నారి. ఇద్దరూ బుధవారం వేర్వేరుగా జరిగిన ప్రమాదాల్లో మృత్యువాత పడ్డారు. ఒకరిని పోలీసుల రక్షక్‌ వాహనం బలి తీసుకుంది. ఇంకొక ఘటనలో వేగంగా వచ్చిన టిప్పర్‌ మూడేళ్ల చిన్నారిని ఢీ కొట్టింది. 

మంగళ్‌హాట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని గుఫామందిర్‌లో నివాసం ఉండే శ్రీనివాస్‌, రేణుకలకు ముగ్గురు కుమారులు ప్రేమ్‌, హర్షవర్ధన్‌, సుమిత్‌లు. శ్రీనివాస్‌ సీతారాంబాగ్‌లోని ఓ మెకానిక్‌ షెడ్‌లో ఆటో మెకానిక్‌. రేణుక ఇళ్లలో పనిచేస్తోంది. ముగ్గురు పిల్లల్లో ఒకడైన హర్షవర్ధన్‌(6) రెండో తరగతి చదువుతున్నాడు. బుధవారం ఆన్‌లైన్‌ క్లాసులు లేకపోవడంతో తండ్రితో కలిసి మెకానిక్‌ షెడ్‌కు వెళ్లాడు.


మధ్యాహ్నం మూడు గంటల సమయంలో తండ్రీకొడుకులు కలిసి భోజనం చేశారు. అదే సమయంలో మంగళ్‌హాట్‌ పోలీ్‌సస్టేషన్‌కు చెందిన రక్షక్‌ వాహనం సీతారాంబాగ్‌ నుంచి బోయిగూడ కమాన్‌ వైపు వెళ్తుండగా, వాహన డ్రైవర్‌ భగవాన్‌రెడ్డి కారు టైర్లలో గాలి తక్కువగా ఉందని మెకానిక్‌ షెడ్‌ వద్ద వాహనం ఆపాడు. టైర్లలో గాలి నింపుకున్న తర్వాత వాహనం ఎక్కాడు. ఇదే సమయంలో హర్షవర్ధన్‌ భోజనం పూర్తి చేసి, రక్షక్‌ వాహనం ముందు చేయి కడుగుతున్నాడు. డ్రైవర్‌ వాహనం ఎక్కే సమయంలో ముందు ఎవరూ లేకపోవడంతో వాహనం స్టార్ట్‌చేసి ముందుకు కదిలించాడు. దీంతో వాహ నం హర్షవర్ధన్‌ కడుపుపైకి ఎక్కింది.


తేరుకున్న డ్రైవర్‌ వాహనాన్ని వెనక్కి తీసి, రక్తపుమడుగులో ఉన్న బాలుడిని ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఉదయం నుంచి తనతో పాటే ఉండి సందడి చేసిన హర్షవర్ధన్‌ కళ్లముందే కడతేరి పోవడంతో తండ్రి శ్రీనివాస్‌ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు. రక్షక్‌వాహనం డ్రైవర్‌ భగవాన్‌ రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్‌ రణవీర్‌రెడ్డి పేర్కొన్నారు.


విషయం తెలిసి ఎమ్మెల్యే రాజాసింగ్‌ వచ్చి కుటుంబాన్ని ఓదార్చారు. ఉస్మానియా ఆస్పత్రి వద్ద బీజేపీ నాయకులు కృష్ణ, కాంగ్రెస్‌ యువ నాయకులు విక్రంగౌడ్‌, ఫిరోజ్‌ఖాన్‌, ఎమ్మార్పీఎస్‌ నేతలు అధికారులతో మాట్లాడారు.








ఆడుకుంటూ వచ్చి..  


చాంద్రాయణగుట్ట మిల్లత్‌నగర్‌ ప్రాంతానికి చెందిన మహ్మద్‌ నూర్‌, జకియా బేగంల కుమార్తె మరియం ఫాతిమా (3) బుధవారం సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటూ, గేటు తీసుకుని బయటకు వచ్చింది. అదే సమయంలో భవన నిర్మాణ సామగ్రి తీసుకెళ్తున్న టిప్పర్‌ ఏపీ 03 యూ 2045 అటువైపుగా వచ్చింది. రోడ్డు చిన్నగా ఉన్న విషయాన్ని కూడా గమనించకుండా టిప్పర్‌ డ్రైవర్‌ వేగంగా ముందుకు పోనిచ్చాడు.


అదే సమయంలో ఇంటి గేటు తీసుకుని బయటకు వచ్చిన చిన్నారి టిప్పర్‌ టైర్ల కింద పడి అక్కడికక్కడే చనిపోయింది. టిప్పర్‌ను మైనర్‌ నడిపిస్తుండగా, మరో బాలుడు కూర్చుని ఉన్నాడని, డ్రైవర్‌ నిర్లక్ష్యంగా నడిపి చిన్నారి మృతికి కారణమయ్యాడని చిన్నారి తల్లిదండ్రులు చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు.  


Updated Date - 2020-10-01T09:14:03+05:30 IST