కొనుగోలు కేంద్రాల్లో తరుగు దందా

ABN , First Publish Date - 2021-04-22T07:17:23+05:30 IST

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో దళారీ వ్యవస్థ కొనసాగుతోంది. పుట్టెడు ధాన్యానికి రైతుల వద్ద నుంచి 5 కేజీల డబ్బా ధాన్యాన్ని తీసుకుంటున్నా పట్టించుకునే నాథుడు లేడు.

కొనుగోలు కేంద్రాల్లో తరుగు దందా
వల్లభాపురంలో కొనుగోలు చేయని ధాన్యం ఇవే

రైతుల నుంచి బలవంతంగా వసూలు

రైతులకు కనీస వసతులు కరువు


చివ్వెంల, ఏప్రిల్‌ 21 : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో దళారీ వ్యవస్థ కొనసాగుతోంది. పుట్టెడు ధాన్యానికి రైతుల వద్ద నుంచి 5 కేజీల డబ్బా ధాన్యాన్ని తీసుకుంటున్నా పట్టించుకునే నాథుడు లేడు. దీనికి తోడు బస్తా తో కలిపి 41 కేజీలు తూకం వేయాల్సి ఉండగా అదనంగా 200 గ్రాముల నుంచి 2 కేజీల వరకు రైతు పలుకుబడిని బట్టి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు తీసుకుంటున్నారు.  ఇదిలా ఉండగా కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లేవు. ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు టెంట్‌ సౌకర్యం కల్పించలేదు. కనీసం మంచినీటిని కూడా అందుబాటులో ఏర్పాటు చేయడం లేదు. కమీషన్ల కోసం కక్కుర్తి పడుతూ ఇష్టానుసారం గా కేంద్రాల నిర్వాహకులు వ్యవహరిస్తుండటంతో రైతులు తీవ్ర ఇబ్బందు లు పడుతున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ను పరిశీలించకపోవడం వల్లే నిర్వాహకులు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. 

జిల్లాలో డీఆర్‌డీఏ 214, పీఏసీఎస్‌ 128...

జిల్లా వ్యాప్తంగా 4 లక్షల 50 వేలకు పైగా ఎకరాల్లో రైతులు వరి పంట ను సాగుచేశారు. దీని ద్వారా దిగుబడి 11 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి అవుతుందని అంచనా వేసిన అధికారులు 7 లక్షల మెట్రిక్‌ టన్నులకు పైగా దిగుబడిని కొనుగోలు చేయాలనే లక్ష్యంతో కొనుగోలు కేంద్రాల ను ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల్లో రైతుల సౌకర్యార్థం కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పనకు, నిర్వాహకుల కష్టానికి ఒక క్వింటాకు రూ.32.50 చొప్పున టన్నుకు రూ.325 ప్రభుత్వం కమీషన్‌ రూపంలో అందజేస్తోంది. సుమారు రూ.25 కోట్లకు పైగా కమీషన్‌ రూపం లో అందజేస్తున్నారు. ఇలా వచ్చే ఆదాయాన్ని ఒక వైపు తీసుకుంటూనే మరోవైపు ఎటువంటి సదుపాయాలు కల్పించడంలేదు. 

కొనుగోలు కేంద్రాల్లో రాజకీయం

కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మడానికి వచ్చిన అమాయక రైతులకు చుక్కెదురవుతోంది. అదే గ్రామాల్లో బడా రాజకీయనాయకులకు, పెద్ద రైతులకు కనీసం ధాన్యం తేమశాతాన్ని చూడకుండా ధాన్యం తీరును పరిశీలించకుండా తూకం వేసి ఏ-గ్రేడ్‌ ధర చెల్లిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నా యి. అదే పేద రైతు అయితే ఇక అంతే సంగతులు. ఇదే తీరులో చివ్వెంల మండలంలో వల్లభాపురం ఐకేపీలో జరిగిన అన్యాయంపై ఓ రైతు తన గోడును మీడియాతో వెల్లగక్కారు. ఈ ఒక్క కేంద్రమే కాక అన్ని కేంద్రాల్లో ఈ తీరుగానే వ్యవహారం నడుస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సూర్యాపేట మండలం రామచంద్రాపురంలో ఓ రైతు అక్కడ జరుగుతున్న మోసాన్ని వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. 


తేమ తక్కువగా ఉన్నా కొనుగోలు చేయలేదు : సైదిపాష, వల్లభాపురం గ్రామం, చివ్వెంల మండలం.

నేను తీసుకొచ్చిన ధాన్యంలో తేమ శాతం తక్కువగా ఉంది. అయినా కొనుగోలు చేయడంలేదు. నాకంటే వెనుక వచ్చిన కొందరి రైతుల ధాన్యాన్ని మాత్రం   వెంటనే కొనుగోలు చేశారు. ఇదేంటని అడిగితే మాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేస్తే వారితో మాట్లాడతాం అంటున్నారు ; కానీ ఎలాంటి న్యాయం జరగడంలేదు. 


ఎలాంటి అవినీతి జరగకుండా పర్యవేక్షణ : సుందరి కిరణ్‌కుమార్‌, పీడీ, డీఆర్‌డీఏ

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి అవినీతి అక్రమాలు చోటు చేసుకోకుండా నిత్యం పర్యవేక్షణ చేస్తున్నాం. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. రైతులకు ఎలాం టి ఇబ్బంది కలిగినా మా దృష్టికి తీసుకురావాలి.


Updated Date - 2021-04-22T07:17:23+05:30 IST