రైతుబంధు రెడీ

ABN , First Publish Date - 2022-06-28T06:45:57+05:30 IST

వానాకాలం సీజన్‌ రైతు బంధు డబ్బుల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే తొలకరి జల్లులు కురవడంతో అన్నదాతలు సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. దుక్కులు దున్ని నారుమడ్లు సిద్ధం చేసుకున్న రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారు.

రైతుబంధు రెడీ

 - నేటి నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో జమ 

- ప్రతీ సీజన్‌లో పెరుగుతున్న లబ్ధిదారులు 

-  ఇప్పటి వరకు 21,344 మంది పెరుగుదల 

- వానాకాలం సీజన్‌లో 4066 మంది 

- జూన్‌ 5లోగా రిజిస్ర్టేషన్‌ చేసుకున్నవారికి అవకాశం 

- జిల్లాలో వానాకాలం సాగు 2.44 లక్షల ఎకరాలు 

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

వానాకాలం సీజన్‌ రైతు బంధు డబ్బుల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే తొలకరి జల్లులు కురవడంతో అన్నదాతలు సాగు పనుల్లో నిమగ్నమయ్యారు.  దుక్కులు దున్ని నారుమడ్లు సిద్ధం చేసుకున్న రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారు.  మంగళవారం నుంచి ఖాతా ల్లో రైతుబంధు డబ్బులు జమ చేయనున్నట్లు ప్రభు త్వం ప్రకటించడంతో  హర్షం వ్యక్తం చేస్తున్నారు.  రైతుబంధు పంపిణీకి  సంబంధించి ప్రభుత్వం  పోర్టల్‌లో వివరాలు కూడా పొందుపరిచింది.  మరోవైపు కొత్తగా పట్టాదారు పుస్తకాలు పొందిన వారు సైతం రైతుబంధు కోసం వివరాలు నమోదు చేసుకోవడానికి   ఆదివారం లాగిన్‌ ఓపెన్‌ అయ్యింది. ఏడాది తరువాత కొత్తవారికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. 2022 జూన్‌ 5వ తేదీ వరకు జరిగిన రిజిస్ట్రేషన్లలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన వివరాలను వ్యవసాయ శాఖకు సీసీఎల్‌ఏ అందజేసింది. ఆ వివరాల ప్రకారం ఏఈవోలు ఎంట్రీలు చేస్తారు. రైతు బంధు పెట్టుబడి సాయం లబ్ధిదారుల సంఖ్య కూడా ప్రతీ సీజన్‌లో పెరుగుతూ వస్తోంది. రైతుబంధు పథకం ప్రవేశపెట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 21,344 మంది లబ్ధిదారులు పెరగడం గమనార్హం. 

జిల్లాలో రూ.130.41 కోట్ల సాయం

రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతుబంధు పథకం ప్రారంభం నుంచి లబ్ధిదారుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. 2021-22 యాసంగిలో 1,21,914 మంది రైతులు రూ.130.41 కోట్లు పొందారు. ప్రస్తుత వానాకాలం సీజన్‌లో 4,066 మంది లబ్ఢిదారులు పెరిగారు. దీని ప్రకారం 1,25,980 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.130.95 కోట్లు జమకానున్నాయి. రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసుకోవడానికి తిరిగి చెల్లించే అవసరం లేకుండా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా 2018 యాసంగి సీజన్‌లో రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. పథకం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 21,344 మంది లబ్ధిదారులు పెరిగారు. మొదటి సంవత్సరం సీజన్‌లో ఎకరానికి రూ.4 వేల చొప్పున ప్రభుత్వం అందించింది. ఆ తరువాత సాయాన్ని రూ.5 వేలకు పెంచింది. ఏటా రెండు సీజన్‌లకు కలిపి ఎకరానికి రూ.10 వేల పెట్టుబడి సాయాన్ని సీజన్‌ ప్రారంభానికి ముందే రైతులకు అందిస్తూ వస్తోంది. 2018 వానాకాలం సీజన్‌లో 1,04,636 మంది రైతులకు రూ.97.43 కోట్లు, 2018-19 యాసంగి సీజన్‌లో 1,01,951 మంది రైతులకు రూ.97.01 కోట్లు, 2019-20 యాసంగిలో 96,793 మంది రైతులకు రూ. 112.44కోట్లు, 2020-21 వానాకాలం సీజన్‌లో 1,12,784 మంది రైతులకు రూ.128.05 కోట్లు, 2020-21 యాసంగిలో 1,21,914 మంది రైతులకు రూ.130.41 కోట్లు, 2021-22 వానాకాలం సీజన్‌లో 1,17,577 మంది రైతులకు రూ.129.25 కోట్లు, 2021-22 యాసంగిలో 1,21,914 మంది రైతులకు రూ.130.41 కోట్లు జమకాగా ప్రస్తుతం 2022-23  వానాకాలం సీజన్‌లో 1,25,980 మంది రైతులకు రూ.130.95 కోట్లు జమ కానున్నాయి. 

జిల్లాలో 2.44 లక్షల ఎకరాల్లో సాగు 

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రస్తుత వానాకాలం సీజన్‌లో 2.44 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయడానికి రైతులు సిద్ధమయ్యారు. జిల్లాలో ఇప్పటికే విత్తనాలు విత్తుకోవడంతో వరి నాట్లు వేస్తున్నారు. వరి 1.50 లక్షల ఎకరాలు, పత్తి 80,900, పెసర 845 , కందులు 5,020, ఇతర పంటలు 1,650 ఎకరాలు సాగు చేయనున్నారు. ఇల్లంతకుంటలో 38,200 ఎకరాలు, తంగళ్లపల్లి 21,080, సిరిసిల్ల 6,440, బోయినపల్లి 21,780, చందుర్తి 21,960, రుద్రంగి 9,650, కోనరావుపేట 25,000, వేములవాడ 11,325, వేములవాడ రూరల్‌ 15,180, గంభీరావుపేట 19,130, ముస్తాబాద్‌ 23,635, వీర్నపల్లి 7,825, ఎల్లారెడ్డిపేటలో 23,150 ఎకరాల్లో సాగు చేయనున్నట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. ప్రత్యామ్నాయ పంటల్లో భాగంగా ఈ ఏడాది 1600 ఎకరాల్లో ఆయిల్‌ పాం సాగు చేయడానికి రైతులు ముందుకొచ్చారు. వర్షాకాలం సీజన్‌లో 800 ఎకరాల్లో సాగు చేయనున్నారు. 

కొత్త పట్టాదారులు వివరాలు ఇవ్వాలి 

- రణధీర్‌  జిల్లా వ్యవసాయ శాఖ అధికారి 

కొత్త పట్టాదారులు రైతు బంధు సాయం కోసం బ్యాంక్‌ వివరాలను సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారికి అందించాలి. రైతుల ఖాతాల్లో రైతు బంధు కింద పెట్టుబడి ఆర్థిక సాయాన్ని 28వ తేదీ నుంచి ప్రభుత్వం జమ చేయనుంది.


Updated Date - 2022-06-28T06:45:57+05:30 IST