Abn logo
Sep 22 2021 @ 23:40PM

బహిష్కరణలు..వాయిదాలు!

మెళియాపుట్టిలో నిరసన తెలుపుతున్న విద్యార్థుల తల్లిదండ్రులుబహిష్కరణలు..వాయిదాలు!

ఇదీ తల్లిదండ్రుల కమిటీల ఎన్నికల తీరు

అధికార పార్టీలో వర్గాలున్న చోట పోటాపోటీ

అంతా నేతల కనుసన్నల్లోనే..

కొన్నిచోట్ల ముఖం చాటేసిన తల్లిదండ్రులు

(మెళియాపుట్టి/రేగిడి/పాలకొండ/పొందూరు)

అనుకున్నట్టే జరిగింది. పాఠశాలల్లో పీఏంసీల ఎన్నిక ఏకపక్షంగా జరిగింది. పేరుకే తల్లిదండ్రులు ఎంపిక చేసిన కమిటీలు కానీ...అంతటా అధికార పార్టీ నేతల సిఫారసుల మేరకే ఎంపిక ప్రక్రియ పూర్తిచేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 3,875 పాఠశాలల్లో బుధవారం ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇందుకు సంబంధించి ఈ నెల 16న నోటిఫికేషన్‌ వెలువడింది. నాటి నుంచే పీఎంసీలు దక్కించుకునేందుకు అధికార పార్టీ నేతలు పావులు కదిపారు. విద్యార్థుల జాబితాలను పట్టుకొని తల్లిదండ్రులను కలిశారు. కొందరిపై పథకాల పేరిట ఒత్తిడి చేసినట్టు కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పీఎంసీ ఎన్నిక సన్నాహక సమావేశాలు కొన్నిచోట్ల రసాభాసగా మారాయి. మెళియాపుట్టిలో అధికార పార్టీలో వర్గ విభేదాల పుణ్యమా అని రోడ్డెక్కిన సంగతి తెలిసిందే. జిల్లాలో చాలా చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. పాఠశాలల్లో రాజకీయ జోక్యం ఏమిటంటూ కొందరు తల్లిదండ్రులు నేతలను నిలదీసిన సందర్భాలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం జరిగిన ఎన్నికలకు చాలా మండలాల్లో తల్లిదండ్రులు ముఖం చాటేశారు. దీంతో కోరం లేక ఎన్నికలు వాయిదా పడ్డాయి. కొన్నిచోట్ల ఉపాధ్యాయుల తీరుపై విమర్శలు వ్యక్తమయ్యాయి. 


చాపర పాఠశాలలో రసాభాస!

 మెళియాపుట్టి మండలం చాపర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం పీఎంసీ ఎన్నిక రసాభాసగా మారింది. పాఠశాలలో 570 మంది విద్యార్థులు చదువుతున్నారు. తొలుత ఆరో తరగతికి సంబంధించి సభ్యులను ఎన్నుకోవడానికి ఉపాధ్యాయులు సన్నద్ధమయ్యారు. ఇందులో కొందరు తల్లిదండ్రులు రహస్య ఓటింగ్‌  చేపట్టాలని హెచ్‌ఎం గణపతిరావును కోరారు. ఆయన ఒప్పుకోకపోవడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఇష్టముంటే ఉండండి..లేకుంటే వెళ్లిపోండి అంటూ హెచ్‌ఎం అనడంతో కొంతమంది ఎన్నికలు బహిష్కరిస్తూ బయటకు వచ్చారు. విషయం తెలుసుకున్న వైసీపీ మండల కన్వీనర్‌ పాడి అప్పారావు తన వర్గీయులతో వచ్చి ఎన్నికలు జరిపించాలని కోరారు. దీంతో ఉపాధ్యాయులు ఎన్నికలు జరిపించారు. కోరం లేకున్నా ఏకపక్షంగా జరిపారంటూ జనసేన నాయకుడు దుక్క బాలరాజు ఆధ్వర్యంలో కొందరు తల్లిదండ్రులు తహసీల్దారుకు ఫిర్యాదుచేశారు. అధికార పార్టీకి అనుకూలంగా వ్యహరించిన హెచ్‌ఎంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఏకలవ్య పాఠశాలలో ఎన్నికలను తల్లిదండ్రులు బహిష్కరించారు. ఉపాధ్యాయులను భర్తీ చేయకపోవడాన్ని నిరసనగా బహిష్కరణ నిర్ణయం ప్రకటించారు. 

నేతలకు తల్లిదండ్రుల ఝలక్‌!

 ‘నేతల కోసం మా విలువైన సమయం వృథా చేస్తారా? ఉదయం నుంచి వేచి చూస్తున్నాం.. ఇదేం రాజకీయం? ఇక మావల్ల కాద’ంటూ రేగిడి మండలం సంకిలి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో తల్లిదండ్రులు వెనుదిరిగారు. దీంతో అక్కడ ఎన్నిక వాయిదా పడింది.  పీఎంసీ ఎన్నికలకు బుధవారం ఉపాధ్యాయులు ఏర్పాట్లు చేశారు. గ్రామంలో ప్రధాన రాజకీయ పక్షాల మధ్య పదవుల పంపకంపై చర్చలు ప్రారంభమయ్యాయి. అయితే ఇవి గంటల తరబడి కొలిక్కి రాకపోవడంతో విసిగిపోయిన తల్లిదండ్రులు ఇంకా ఎంతసేపు వేచి చూడాలంటూ హెచ్‌ఎం లక్ష్మీనారాయణను ప్రశ్నించారు. తాము ఇంటికి వెళ్తామని చెప్పడంతో హెచ్‌ఎం వారించారు. కానీ వినలేదు. ఇంతలో సమయం దాటిపోవడంతో ఎన్నిక వాయిదాపడింది. ఈ ఘటనతో విస్తుపోవడం నేతల వంతైంది.

అంపిలిలో వైసీపీ, టీడీపీ వర్గీయుల బాహాబాహీ

 ‘టీడీపీ వర్గం వారు రహస్య ఓటింగ్‌కు పట్టుబట్టడం... వైసీపీ వర్గీయులు చేతులు ఎత్తే విధానం ద్వారా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేయడం... ఇరువర్గాల మధ్య మాటామాటా పెరగడంతో పాలకొండ మండలం అంపిలి ప్రాథమికోన్నత పాఠశాలలో ఎన్నిక వాయిదా పడింది. ఒకానొక దశలో ఇరువర్గాలు బాహాబాహీకి దిగడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. సీఐ శంకరరావు, ఎస్‌ఐ ప్రసాద్‌లు సిబ్బందితో అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. చివరకు ఎన్నికలు నిర్వహించడానికి ఎంఈవో ప్రసాదరావు, హెచ్‌ఎం నాగశివాజీలు ప్రయత్నించారు. కానీ అప్పటికే కోరం లేకపోవడంతో వాయిదా వేశారు. 

హెచ్‌ఎం తీరుపై పొందూరు సర్పంచ్‌ నిరసన

 కోరం ఉన్నా ఎన్నికలు వాయిదా వేశారని పొందూరు మేజర్‌ పంచాయతీ సర్పంచ్‌ రేగిడి లక్ష్మి నిరసనకు దిగారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హెచ్‌ఎం రామరాజు ఆధ్వర్యంలో బుధవారం ఎన్నికలు నిర్వహించారు. 6,7 తరగతులకు సంబంధించి కోరం లేకపోవడంతో వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. దీనిపై సర్పంచ్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగానే వాయిదా వేశారని ఆరోపించారు.  కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా గాంధీజీ విగ్రహానికి వినతిపత్రం అందించారు. ఆమెతో పాటు బీజేపీ నాయకులు బి. ప్రతాప్‌, పట్టణ వైసీపీ నాయకులు గాడు నాగరాజు, ఎ.అక్కలనాయుడు, జె.వెంకటరావు, రాజగోపాల్‌ ఉన్నారు.