Abn logo
May 30 2020 @ 05:27AM

అగ్రిసెజ్‌ దిశగా అడుగులు

బాసర , కిర్గుల్‌ మధ్య ఎస్సారెస్పీ బ్యాక్‌ వాటర్‌ భూముల్లో ఏర్పాటుకు ప్రతిపాదనలు 

ప్రతిపాదనలను పరిశీలిస్తున్న రాష్ట్ర పరిశ్రమల శాఖ 

జిల్లాలో వ్యవసాయ ఆధారిత పంటలకు ఇక మహర్దశ 

సాంకేతిక సహకారం కోసం ట్రిపుల్‌ ఐటీతో అనుసంధానం 

మౌలిక సౌకర్యాలపై సర్కారు సంతృప్తి 

గ్రీన్‌సిగ్నల్‌కు సన్నాహాలు 


నిర్మల్‌, మే 29 (ఆంధ్రజ్యోతి) : ఇప్పటి వరకు పాడిపంటలతో జీవనదితో విరాజిల్లుతున్న నిర్మల్‌ జిల్లా సిగలో మరో కలుకితురాయి చేరబోతోంది. చదువుల తల్లి సరసరస్వతీ వెలసిల్లిన బాసర, అలాగే దాని సమీపంలోని కిర్గుల్‌ గ్రామాల మధ్య ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్‌) ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేగమవుతున్నాయి. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ బ్యాక్‌వాటర్‌ అదనపు భూముల్లో ఈ సెజ్‌ను ఏర్పాటు చేయబోతున్నారు. దాదాపు 600 ఎకరాల్లో వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాటు కోసం ఈ ప్రత్యేక ఆర్థిక మండలి ప్రతిపాదనను అధికారులు రూపొందించారు.


ఇప్పటికే ఈ ప్రతిపాదనలు రాష్ట్ర పరిశ్రమల శాఖకు చేరుకోగా ఆ శాఖ ఈ ప్రాతిపాదనలను సీరియస్‌గా పరిశీలిస్తోంది. ఈ మేరకు పరిశ్రమల మంత్రి కేటీఆర్‌ను ఒప్పించేందుకు జిల్లా మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డితో పాటు కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌లు రంగంలోకి దిగనున్నారు. అయితే గోదావరి పరివాహక ప్రాంతంలో సంవృద్ధిగా ఉన్న సహజవనరులు, అన్ని రకాల మౌలిక సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేయబోతున్న సెజ్‌కు మరింత ఊతమివ్వబోనున్నాయంటున్నారు.


సెజ్‌ ఏర్పాటుకు ఎస్సారెస్పీ బ్యాక్‌వాటర్‌ భూముల ఆక్రమణ వ్యవహారం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. ప్రాజెక్ట్‌ భూములను దాదాపు 2వేల ఎకరాలకు పైగా పలువురు ఆక్రమించడం, ఈ ఆక్రమణలపై సీఎం కేసీఆర్‌ సీరియస్‌గా స్పందించడం, దీంతో జిల్లా అధికారులు ఆ భూముల స్వాధీనానికి రంగం సిద్ధం చేశారు. దీని కోసం గాను భూముల గుర్తింపు, వాటి స్వాధీనం కోసం సర్వే మొదలుపెట్టి ఇప్పటి వరకు దాదాపు 1500 ఎకరాల భూమిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అయితే మొదటగానే భూములు స్వాధీనం చేసుకునే అవకాశం ఉన్న విషయాన్ని జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ భాస్కర్‌రావుతో పాటు తదితర అధికారులు గుర్తించారు.


ఈ భూములను సద్వినియోగం చేసుకునేందు కోసం వారు పకడ్బందీ ప్రణాళిక రచించారు. ఇందులో భాగంగానే సెజ్‌ ఏర్పాటు ప్రతిపాదన తెరపైకి వచ్చింది. జిల్లాలో విస్తారంగా వరిధాన్యం, మొక్కజొన్న, పత్తి, సోయాబీన్‌, పసుపు, కందులు, మినుములు, పెసర్లు తదితర పంటలు పండుతున్న సంగతి తెలిసిందే. దిగుబడులు ఇబ్బడి ముబ్బడిగా వస్తుండడంతో దీనిని తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేశారు. ఎస్సారెస్పీ ఆక్రమిత భూముల్లో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేస్తే బహుళ ప్రయోజనం ఉంటుందని అధికారులు భావించారు. దాదాపు 600 ఎకరాల్లో దీని కోసం గాను సెజ్‌ ఏర్పాటు చేయాలని తలపెట్టారు. అనుకున్నదే తడువుగా ప్రతిపాదనలు రూపొందించి సర్కారుకు నివేదించారు. సర్కారు ఈ ప్రతిపాదనలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేయడంతో సెజ్‌ ఏర్పాటు దిశగా ఆశలు రెట్టింపవుతున్నాయి.


జిల్లాలో సాగైన పంటలే కాకుండా సరిహద్దున ఉన్న కరీంనగర్‌, నిజామాబాద్‌ జిల్లాలతో పాటు మహరాష్ట్రలోని ధర్మాబాద్‌, నాందే డ్‌, పర్బని, జల్నా, ఔరంగాబాద్‌, తదితర ప్రాంతాల్లో సాగయ్యే పంటలకు సైతం బాసరలో ఏర్పాటయ్యే సెజ్‌ ద్వారా ప్రయోజనం చేకూరుతుంది. ఈ ప్రాంతాలన్నింటినీ కలుపుతూ రోడ్డు, రవాణా, రైలు మార్గాలుండడం, గోదావరి పరివాహకం కావడంతో నీరు, భూగర్బ వనరులు పుష్కలంగా అందుబాటులోకి రానున్నాయి. మౌలిక సౌకర్యాలన్నీ కనుచూపు మేరలో ఉండడంతో సెజ్‌ ఏర్పాటుకు ఎలాంటి ఆటంకాలు ఉండవంటున్నారు. ఇదిలా ఉండగా ఇక్కడ ఏర్పాటు చేసే సెజ్‌లో పరిశ్రమలన్నింటికీ సాంకేతిక సహకారం పొందేందుకు గాను బాసర ట్రిపుల్‌ ఐటీని సెజ్‌కు అనుసంధానం చేయనున్నారు. దీంతో బాసర ట్రిపుల్‌ ఐటీలో చదివే ఇంజనీరింగ్‌ విద్యార్థుల ప్రతిభ, సామర్థ్యాలను సెజ్‌లో ఏర్పాటు చేసే పరిశ్రమలు సద్వినియోగం చేసుకునే అవకాశం ఏర్పడుతోంది. దీని కారణంగా ఉపాధి రంగం కూడా పెద్ద ఎత్తున విస్తరించేందుకు దోహదం అవుతుంది. 


బాసర ట్రిపుల్‌ ఐటీతో అనుసంధానం

గత కొన్ని సంవత్సరాల నుంచి బాసర ట్రిపుల్‌ ఐటీలో వివిధ రకాల ఇంజనీరింగ్‌ కోర్సులు చదువుతున్న విద్యార్థులు రాష్ట్ర , జాతీయ స్థాయి ఉద్యోగ నియామక పరీక్షల్లో రాణిస్తూ అటు ప్రభుత్వ ఇటు కార్పోరేట్‌ సంస్థల్లో కొలువులు సాధిస్తున్నారు. ఇక్కడ నాణ్యమైన విద్యాభోధన కొనసాగుతున్నందున విద్యార్థుల్లో అపారమైన ప్రతిభ, సృజనాత్మకథ పెరుగుతోంది. ఇలా సాంకేతిక పరంగా పురోగమిస్తున్న బాసర ట్రిపుల్‌ ఐటీని ఇక్కడ ఏర్పాటు చేయబోయే స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌కు అనుసంధానం చేయాలని నిర్ణయించారు. విద్యార్థులకు చివరి సంవత్సరం ప్రాక్టికల్‌ శిక్షణను ఇక్కడి సెజ్‌లో ఏర్పాటు చేసే పరిశ్రమల ద్వారా ఇప్పించాలని భావిస్తున్నారు. అప్రెంటిషిప్‌కు సెజ్‌ ఎంతో అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు. ప్రతిభ ఉన్న ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులకు ఇక్కడి పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు కూడా లభించే అవకాశం ఏర్పడుతుందంటున్నారు.


క్యాంపస్‌ సెలక్షన్‌ల పేరిటా సెజ్‌లోని పరిశ్రమలు మొదట బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులకు ప్రాధాన్యతనివ్వాలన్న నిబంధనలు కూడా విధించనున్నారు. సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌ పరిశ్రమలు కూడా ఇక్కడ నెలకొల్పే అవకాశాలు ఏర్పడతాయి. అలాగే భారీ, మధ్య తరహా, చిన్న తరహా పరిశ్రమలు కూడా ఏర్పాటుకు అనుకూలంగా ఈ ప్రదేశం ఉందంటున్నారు. ఇలాంటి సౌకర్యాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని అధికారులు సెజ్‌ ఏర్పాటు ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. 


విస్తారమైన వనరులు, మౌలిక సౌకర్యాలు

బాసర గుండా ప్రవహించే గోదావరి పరివాహాకమంతా విస్తారమైన సహజ వనరులతో విరాజిల్లుతోందంటున్నారు. ఇక్కడ సెజ్‌ ఏర్పాటైనట్లయితే సహజ వనరుల కోసం అన్వేషణ కూడా మొదలవుతోంది. అలాగే గోదావరి ప్రవాహంతో పాటు ఎస్సారెస్పీ రిజర్వాయర్‌లోని నీరు ఇక్కడ ఏర్పాటు చేసే పరిశ్రమలకు ఉపయోగపడుతోంది. కాలేశ్వరం నుంచి నిర్మిస్తున్న ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంతో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌లోకి అదనంగా 60 టీఎంసీల నీరు రివర్స్‌ పంపింగ్‌తో వచ్చి చేరుతోంది. దీంతో  నీటివనరులు పుష్కలంగా అందుబాటులోకి రానున్నాయి. పరిశ్రమలకు అవసరం అయ్యే నీటినంతా ఇక్కడి నుంచి వినియోగించుకునే అవకాశం ఏర్పడుతోంది. అలాగే బాసరలో రైల్వేస్టేషన్‌, అలాగే దీనికి సమీపంలో కల్యాణ్‌ నుంచి నిర్మల్‌ వరకు నేషనల్‌ హైవే, నిర్మల్‌ మీదుగా హైదరాబాధ్‌ నాగ్‌పూర్‌ హైవే సౌకర్యం ఉండడంతో రవాణా రంగానికి పూర్తిస్థాయి అనుకూలత ఏర్పడనుంది. కాగా సమీపంలోనే హైదరాబాద్‌, నాందేడ్‌, ఔరంగాబాద్‌ లాంటి నగరాలు ఉన్నందున ఎగుమతులు, దిగుమతులకు ఇబ్బందులు ఉండబోవంటున్నారు.  


గ్రీన్‌సిగ్నల్‌ దిశగా సర్కారు

కాగా జిల్లా అధికారులు బాసరలో ఏర్పాటు చేయతలపెట్టిన సెజ్‌ ప్రతిపాదనలపై ప్రభుత్వం సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపింది. దీనికి సంబందించి నివేదికలను రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో పాటు ఉన్నతాధికారులు క్షుణ్ణంగా పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారంటున్నారు. సెజ్‌కు సంబంధించిన ప్రాజెక్ట్‌ రిపోర్టును పరిశీలించిన అధికారులు పర్యావరణ పరంగా ఏర్పడే సమస్యలను పరిశీలించి అను మతులు ఇచ్చేందుకు సిద్ధం కానున్నట్లు సమాచారం. బాసరలో సెజ్‌ ఏర్పాటైనట్లయితే జిల్లాలోని సహజ వనరులన్నీ సద్వినియోగం అవ్వ డమే కాకుండా ఇక్కడి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మరింతగా పెరుగుతాయని భావిస్తున్నారు. దీని కారణంగా జిల్లా నుంచి వలసలు సైతం తగ్గిపోతాయని, అలాగే సెజ్‌ ఏర్పాటు కారణంగా జిల్లా అభివృద్ధి శరవేగంగా సాగబోతుందని భావిస్తున్నారు. 

Advertisement
Advertisement