Abn logo
Jun 5 2020 @ 05:06AM

కరోనా వేళ.. ఆశల క్యూ

 కడప(చిన్నచౌకు), జూన్‌ 4 : వీరంతా భవన నిర్మాణ కార్మికులు. మద్యం దుకాణం వద్ద మందుకోసమో.. దాతల ఇచ్చే సాయం కోసమో ఇలా క్యూ కట్టలేదు. కేంద్ర ప్రభుత్వం తమను ఆదుకుంటుందనే ఆశతో కార్మికులంతా కడపలోని కార్మిక సంక్షేమ శాఖ కార్యాలయం వద్ద బారులు తీరారు. లాక్‌డౌన్‌ కారణంగా దేశవ్యాప్తంగా మూడు నెలలుగా భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో 65,626 మంది గుర్తింపు కార్డులు పొందిన భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. వీరిలో చాలామంది గురువారం ఆధార్‌ కార్డులు, బ్యాంకు అకౌంట్ల పత్రాలతో కడప కార్మిక సంక్షేమ శాఖ కార్యాలయం వద్ద బారులు తీరారు. రాష్ట్రవ్యాప్తంగా గురువారం కార్మిక సంక్షేమ కార్యాలయాల్లో గుర్తింపు కార్డులకు లింకు చేసుకునేందుకు భవన నిర్మాణ కార్మికులు అధిక సంఖ్యలో వచ్చారని తెలిసింది. ప్రభుత్వం కార్మికుల ఖాతాల్లోకి నేరుగా డబ్బు వేస్తుందని ప్రచారం జరగడంతో వీరంతా గుర్తింపు కార్డులకు ఆధార్‌, బ్యాంకు అకౌంటును లింకు చేసుకునేందుకు ఇక్కడకు వచ్చారు. కార్మికులంతా ఆశతో వస్తే వచ్చారు.. వీరి మధ్య కనీస భౌతికదూరం లేదు.


కరోనా విజృంభిస్తున్న వేళ ఇలా బారులు తీరితే ఎలా.. అసలుకే మోసం రాదా..? కాగా.. కార్మికులకు అందే ప్రభుత్వ సాయం గురించి కార్మిక శాఖ జాయింట్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌ను వివరణ కోరగా.. భవన నిర్మాణ కార్మికులకు అందించే సంక్షేమ పథకాలకోసం ఆధార్‌ లింక్‌ చేయమన్నారేకానీ కేంద్రప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కరోనా సాయం చేస్తామని ప్రకటించలేదని తెలిపారు. గుర్తింపు కార్డు, ఆధార్‌, బ్యాంక్‌ అకౌంట్‌ లింక్‌ అయితే.. సంక్షేమ పథకాలేవైనా ఉంటే ఆ మొత్తం వారి ఖాతాల్లోకి నేరుగా వస్తుందన్నారు.

Advertisement
Advertisement
Advertisement