సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థిగా యూపీ మంత్రి స్వాతిసింగ్ ?

ABN , First Publish Date - 2022-02-02T17:51:10+05:30 IST

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మంత్రి స్వాతిసింగ్ సమాజ్ వాదీ పార్టీలో చేరబోతున్నారా? అంటే అవునంటున్నాయి ఆ పార్టీ వర్గాలు...

సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థిగా యూపీ మంత్రి స్వాతిసింగ్ ?

లక్నో : ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మంత్రి స్వాతిసింగ్ సమాజ్ వాదీ పార్టీలో చేరబోతున్నారా? అంటే అవునంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మంత్రి స్వాతిసింగ్ కు బీజేపీ టికెట్ నిరాకరించింది. సరోజినినగర్ సీటును ఈడీ మాజీ అధికారి రాజేశ్వర్ సింగ్ కు ఇచ్చింది. మంత్రి స్వాతిసింగ్ తోపాటు ఆమె భర్త దయాశంకర్ సింగ్ లకు బీజేపీ టికెట్టు కేటాయించక పోవడంతో వారు అసమ్మతిగా ఉన్నారు. సమాజ్ వాదీ పార్టీ లక్నోలోని అన్ని అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినా వ్యూహాత్మకంగా సరోజినీనగర్ సీటును ఖాళీగా ఉంచింది. దీంతో మంత్రి స్వాతిసింగ్ బీజేపీని వీడి సమాజ్ వాదీ పార్టీలో చేరి సరోజినినగర్ స్థానం నుంచి పోటీ చేయవచ్చని ఊహాగానాలు వెలువడ్డాయి.



సరోజినీ నగర్ నుంచి బీజేపీ సీటు ఇవ్వక పోవడంతో స్వాతి సింగ్ తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. కాగా బీజేపీ అభ్యర్థి రాజేశ్వర్‌సింగ్‌ తరఫున ప్రచారం చేస్తానని స్వాతిసింగ్ భర్త దయాశంకర్‌ సింగ్‌ చెప్పారు.మొత్తంమీద మంత్రి స్వాతిసింగ్ ఏ పార్టీ నుంచి ఎన్నికల బరిలోకి దిగుతారన్నది చర్చనీయాంశంగా మారింది. ఈసారి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ, అఖిలేష్ యాదవ్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్, మాయావతికి చెందిన బహుజన్ సమాజ్ పార్టీల మధ్య చతుర్ముఖ పోరు జరిగే అవకాశం ఉంది.

Updated Date - 2022-02-02T17:51:10+05:30 IST