Abn logo
Sep 25 2021 @ 01:34AM

ఆరోగ్యశ్రీలో డెంగీ వైద్యం

జీజీహెచ్‌లో వైద్యులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ నివాస్‌

సీజనల్‌ వ్యాధుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు 

జీజీహెచ్‌ ఓపీ విభాగంలో 10 అదనపు కౌంటర్లు 

డెంగీ, మలేరియా రోగుల కోసం మరో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ 

ప్రభుత్వాసుపత్రిలో కలెక్టర్‌ నివాస్‌ ఆకస్మిక తనిఖీలు.. పలు ఆదేశాలు 

ఆయా విభాగాల్లో రోగులకు అందుతున్న వైద్యసేవలపై ఆరా 


విజయవాడ, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా డెంగీ బాధితులకు ఆరోగ్యశ్రీ కింద వైద్యసేవలు అందించాలని కలెక్టర్‌ నివాస్‌ వైద్యాధికారులను ఆదేశించారు. ప్రైవేటు ఆసుపత్రులు ఏవైనా ఇందుకు నిరాకరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శుక్రవారం ఉదయం విజయవాడ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆసుపత్రిలోని ఆయా విభాగాలను సందర్శించి రోగులకు అందుతున్న వైద్యసేవల తీరును పరిశీలించారు. పలువురు రోగులతో మాట్లాడారు. ఆసుపత్రిలో వైద్య సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. ఓపీ విభాగం వద్ద రోగుల రద్దీని, చీటీల జారీ ప్రక్రియ ప్రహసనంగా సాగుతున్న విషయాన్ని గమనించారు. ‘ఈ సమస్య పరిష్కారానికి వెంటనే మరిన్ని అదనపు ఓపీ కౌంటర్లను ఏర్పాటు చేయాలనే ఆలోచన మీకెందుకు రాలేదు?’ అంటూ జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జగన్‌మోహన్‌రావును ప్రశ్నించారు. వెంటనే ఓపీ విభాగంలో పురుషులకు, మహిళలకు వేర్వేరుగా అదనపు కౌంటర్లను ఏర్పాటు చేయాలని ఆసుపత్రి వైద్యాధికారులను ఆదేశించారు. రేపట్నుంచే మొత్తం పది ఓపీ కౌంటర్లు పనిచేయాలని, వాటిలోకి అవసరమైన కంప్యూటర్లు, సిబ్బందిని ఏర్పాటు చేయాలన్నారు. డెంగీ, మలేరియా జ్వరాలకు సబంధించిన కేసులు రోజుకు ఎన్ని వస్తున్నాయని  అడిగి తెలుసుకున్నారు. ఈ రోగులను చూసేందుకు అదనంగా మరో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ను నియమించాలని ఆదేశించారు. అనంతరం ఆసుపత్రిలోని ల్యాబ్‌ను పరిశీలించి బయోమెడికల్‌ ల్యాబ్స్‌, టెక్నీషియన్‌ పోస్టులను పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఎక్స్‌-రే నిర్వహణకు అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అనంతరం ఎలీసా ల్యాబ్‌ను పరిశీలించారు. ఇక్కడ మరో కొత్త యంత్రం ఏర్పాటు చేయాలని సబ్‌ కలెక్టర్‌ ప్రవీణ్‌చంద్‌ను ఆదేశించారు. మరో ల్యాబ్‌ అసిస్టెంట్‌ నియామకానికి చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. రిపోర్టులను వెంటనే పేషెంట్ల మొబైల్‌ నెంబర్లకు పంపించాలని ఆదేశించారు. దీనిపై ల్యాబ్‌ టెక్నీషియన్లు స్పందిస్తూ.. విజయవాడ నగరానికి చెందిన రిపోర్టులను వీఎంసీ అధికారులకు, గ్రామీణ ప్రాంతాలకు చెందినవైతే డీఎంహెచ్‌వో, డీసీహెచ్‌ఎస్‌లకు పంపిస్తున్నామని తెలిపారు. 


ప్రతి శుక్రవారం డ్రైడే 

జిల్లాలో సీజనల్‌ వ్యాధుల నియంత్రణకు గానూ ప్రతి శుక్రవారం డ్రైడేగా పాటిస్తున్నామని కలెక్టర్‌ చెప్పారు. జీజీహెచ్‌లో తనిఖీలు నిర్వహించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ, జిల్లావ్యాప్తంగా ప్రతి గ్రామ పంచాయతీలోను యాంటీ లార్వా, ఫాగింగ్‌, నీటి నిల్వలు లేకుండా చూసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి సబ్‌ డివిజన్‌ పరిధిలో ఎక్కువ సంఖ్యలో పరీక్షలు నిర్వహించాలనిఆదేశాలు జారీ చేశామన్నారు. సబ్‌కలెక్టర్‌ ప్రవీణ్‌ చంద్‌, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ ఆర్‌ఎంవో డాక్టర్‌ శోభ, డిప్యూటీ ఆర్‌ఎంవో డాక్టర్‌ మంగాదేవి తదితరులు కలెక్టరు వెంట ఉన్నారు.