Advertisement
Advertisement
Abn logo
Advertisement

వణికిస్తున్న డెంగీ

కె.పెంటపాడు వెలంపేట ఏరియాలో 30 మందికి పైగా బాధితులు 

వేలాది రూపాయలు ఖర్చు చేసి ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స

కానరాని  వైద్య శిబిరాలు 

 గ్రామాలను  జ్వరాలు వణికిస్తున్నాయి.  కొన్ని రోజులుగా సమస్య తీవ్రంగా ఉన్నా అత్యవసర వైద్య శిబిరాలను ఏర్పాటు చేయలేదు. మండలంలోని కే.పెంటపాడు  వెలంపేట ఏరియాలో  సుమారు 30 మందికి పైగా డెంగీ జ్వర పీడితులు ప్రైవేటు ఆస్పత్రుల్లో వేలకు వేలు సొమ్ము చెల్లించి చికిత్స పొందుతున్నారు.

పెంటపాడు, డిసెంబరు 5:  గ్రామంలో కలుషిత తాగునీరు, పారిశుధ్య లోపం వల్లే  జ్వరాలు వస్తున్నాయని వెలంపేట వాసులు ఆరోపిస్తున్నారు. పంచాయతీ నుంచి వచ్చే నీరు  వాడుకోవడానికి కూడా ఉపయోగపడటం లేదని, తాగునీటిని శుద్ధి చేసే ఫిల్టర్‌ బెడ్స్‌ బాగోని కారణంగానే ఈ సమస్య నెలకొంది. వెలంపేట రామాలయం వీధి శివారు ఖాళీ ప్రదేశంలో మురుగు నీరు పేరుకుని దోమలు విపరీతంగా పెరిగిపోవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెలంపేట ఏరియాలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని,  జ్వరాలు మరింత ప్రబలకుండా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

వైద్యానికి రూ. 40 వేలు ఖర్చయింది

నాకు జ్వరం వచ్చి తగ్గకపోవడంతో పరీక్షలు చేయించుకోగా డెంగీ అని నిర్ధారణ అయ్యింది. తాడేపల్లిగూడెంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని ఈ రోజే డిశ్చార్జి అయి ఇంటికి వచ్చా. వైద్యానికి రూ. 40 వేలు ఖర్చు అయ్యింది.

 –గంపా వెంకట నర్సమ్మ, బాధితురాలు, కే.పెంటపాడు 

Advertisement
Advertisement