Abn logo
Sep 21 2021 @ 23:33PM

డెంగీ పంజా

కడప నగరం ఓంశాంతినగర్‌లో నిల్వ ఉన్న మురికి నీరు

జిల్లాలో పెరుగుతున్న డెంగీ కేసులు

పది మందికి టెస్టు చేస్తే ఐదుగురికి అనుమానిత రిపోర్ట్‌

కరోనా... డెంగీ ఒకటే లక్షణాలు 

జ్వరం వస్తే అలసత్వం వద్దు....డాక్టర్‌ను సంప్రదించండి


కరోనా మహమ్మారి నుంచి జిల్లా వాసులు కోలుకోకముందే... డెంగీ దండయాత్ర మొదలుపెట్టింది. 20 రోజులుగా అనారోగ్యానికి గురై ఆస్పత్రుల పాలయ్యే వారి సంఖ్య ఎక్కువవుతోంది. జ్వరం, దగ్గు, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, అలసటతో బాధపడుతూ ఆస్పత్రులకు వెళుతున్నారు. జ్వర పీడితులకు రక్తపరీక్ష నిర్వహిస్తే డెంగీగా నిర్ధారణ అవుతోంది. మూడేళ్ల క్రితం జిల్లాను వణికించిన డెంగీ మళ్లీ ఇప్పుడు వ్యాప్తి చెందుతోంది. ల్యాబ్‌ల్లో పది మందికి రక్తపరీక్షలు నిర్వహిస్తే ఐదుగురికి డెంగీ అనుమానిత లక్షణాలు ఉన్నట్లు రిపోర్టుల్లో వస్తోంది. 


కడప (ఆంధ్రజ్యోతి), సెప్టెంబరు 21 : జిల్లాలో ఇటీవల జ్వర పీడితుల సంఖ్య పెరుగుతోంది. రెండు మూడు రోజుల పాటు జ్వరం తగ్గకపోతే డాక్టర్ల సిఫారసు మేరకు రక్తపరీక్షలు చేయించుకుంటున్నారు. దీంతో ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గినట్లు కనిపిస్తోంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో డెంగీ నిర్థారణ కోసం ర్యాపిడ్‌ టెస్ట్‌లను చేస్తున్నారు. పది టెస్టులు చేస్తే ఐదుగురిలో డెంగీ అనుమానిత లక్షణాలు కనిపిస్తున్నాయి. దీంతో డెంగీ నిర్థారణ కోసం ఎలిశా పరీక్ష చేస్తున్నారు. ఈ టెస్టులో డెంగీ నిర్థారణ అవుతుంది. కడప రిమ్స్‌, ప్రొద్దుటూరు, పులివెందులలో ప్రభుత్వ ఆస్పత్రులలో ఎలిశా టెస్టులు చేస్తున్నారు. జిల్లాలో వైద్యాధికారుల లెక్క ప్రకారం ఈ ఏడాది ఇప్పటి వరకు 15 డెంగీ, 13 మలేరియా కేసులు నమోదయ్యాయి. 


పెరుగుతున్న కేసులు

జిల్లాలో డెంగీ అనుమానిత లక్షణాలున్న కేసుల సంఖ్య క్రమేపీ పెరుగుతున్నట్లు చెబుతున్నారు. జ్వరం బారినపడిన వారు స్థానికంగా ఉన్న వైద్యుల వద్ద ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నారు. తగ్గకపోవడంతో కడపకు వస్తున్నారు. పోరుమామిళ్ల, ప్రొద్దుటూరు, బద్వేలు, మైదుకూరు తదితర ప్రాంతాల నుంచి ట్రీట్‌మెంట్‌ కోసం కడపకు వస్తున్నారు. ఇక్కడ ల్యాబ్‌ల్లో పదిమందికి రక్తపరీక్ష నిర్వహిస్తే ఐదుగురికి అనుమానిత లక్షణాలు కనిపిస్తున్నాయి. కడపలోని ప్రభుత్వ ఆస్పత్రులు జ్వరపీడితులతో  కిటకిటలాడుతున్నాయి. 100 మంది ఓపీ ఉంటే వాటిలో 20 నుంచి 25 వరకు డెంగీ అనుమానిత  కేసులే ఉన్నట్లు చెబుతున్నారు. 


రెండింటికీ ఒకటే లక్షణాలు.. ట్రీట్‌మెంట్‌ వేరు

డెంగీ, కరోనా లక్షణాలు దాదాపు ఒకటిగానే ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. రెండేళ్లుగా కరోనా విజృంభిస్తుండడంతో ఏదైనా లక్షణాలు కనిపిస్తే జనం అది కరోనా అని భావిస్తున్నారు. కొందరు సొంతంగా వైద్యం చేసుకుంటున్నారు. ఇది చాలా ప్రమాదకరం. డెంగీకి రక్తకణాలు తగ్గిపోతాయి. చికిత్సతో రక్తకణాలు పెరగకపోతే రక్తం ద్వారా కణాలను విభజించి రోగికి ఎక్కించాల్సి ఉంటుంది. అనుమానిత లక్షణాలు ఉంటే సొంత వైద్యం చేయించుకోకుండా వైద్యుడిని సంప్రదించాలి. డెంగీకి, కరోనాకు సెపరేట్‌ ట్రీట్‌మెంట్‌ చేయాల్సి ఉంటుంది. రెండింటికీ ఒకే ట్రీట్‌మెంట్‌ చేస్తే ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు. 


పట్టణ ప్రాంతాల్లోనే...

డెంగీ పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువగా వ్యాప్తి చెందుతుంటుంది. వర్షం నీరు, మురుగునీరు నిల్వ ఉండడం దోమల ఉత్పత్తికి కారణమవుతుంది. అలాగే పూల కుండీలు, కూలర్లు, చెత్తకుండీలు , తాగేసి పడేసిన కొబ్బరిబోండాల్లో నీరు నిల్వ ఉంటే అక్కడ డెంగీ వ్యాప్తికి కారణమైన దోమ ఉత్పత్తి చెందుతుంది. మూడేళ్ళ క్రితం కడప, ప్రొద్దుటూరు, మైదుకూరు, జమ్మలమడుగు ప్రాంతాలు డెంగీతో వణికాయి. ఇక్కడ సరైన పారిశుధ్యం లేకపోవడం వ్యాధి వ్యాప్తికి కారణమని చెబుతుంటారు. 


పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి

మరో రెండు నెలల పాటు సీజనల్‌ వ్యాధులు పొంచి ఉంటాయి. వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత, ఇంటితో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. నిల్వ ఉన్న చోట అయిల్‌బాల్స్‌, కిరోసిన్‌ను వేయాలి. దోమలు రాకుండా చర్యలు తీసుకోవాలి. దోమల నుంచి కాపాడుకునేందుకు రాత్రిపూట దోమతెరలను విధిగా వాడాలి, కిటికీలకు మెష్‌లను అమర్చుకోవాలి.


వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తంగా ఉంది 

- నాగరాజు, జిల్లా వైద్యాధికారి

సీజనల్‌ వ్యాధులను ఎదుర్కొనేందుకు వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తంగా ఉంది. ప్రతి శుక్రవారం డ్రైడేగా పాటిస్తున్నాం. వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళుతున్నారు. ఎక్కడ జ్వర పీడితులు ఉన్నారో ఆరా తీస్తున్నారు. వారికి మలేరియా, రక్తపూతలు తీస్తున్నారు. పీహెచ్‌సీలో ర్యాపిడ్‌ టెస్ట్‌ నిర్వహిస్తున్నాం. అక్కడ ఎన్‌ఎ్‌స-1 పాజిటివ్‌ వస్తే డె ంగీ నిర్థారణ కోసం ఎలిశా పరీక్ష చేస్తున్నాం. మురుగునీటి ప్రాంతాల్లో ఆయిల్‌బాల్స్‌, ఇతర పారిశుధ్య పనులు చేస్తున్నాం. 9100 మందికి దోమతెరలను అందించాం. జ్వరం వస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. డెంగీ, కరోనాకు సపరేట్‌ ట్రీట్‌మెంట్‌. డెంగీ వచ్చిన వారికి కరోనా ట్రీట్‌మెంట్‌ చేస్తే చాలా ప్రమాదకరం. డెంగీకి ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్యం అందుతుంది.

కడపలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో జ్వర పీడితులు