అమ్మో..జ్వరం

ABN , First Publish Date - 2021-10-17T05:46:44+05:30 IST

ప్రస్తుతం డెంగ్యూ, టైఫాయిడ్‌, మలేరియా జ్వరా లు విజృంభిస్తున్నాయి.

అమ్మో..జ్వరం
ఎస్‌.కోట కోనేరులో వ్యర్థాలు, చెత్త

 విజృంభిస్తున్న డెంగ్యూ

 మలేరియా, టైఫాయిడ్‌తో విలవిల

 పారిశుధ్యం క్షీణించడమే కారణం

 ఆందోళనలో ప్రజలు

(శృంగవరపుకోట)

శృంగవరపుకోట పట్టణానికి చెందిన బాలిక రెండు రోజుల కిందట  విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో జ్వరంతో మృత్యువాత పడింది. అక్కడి వైద్యులు డెంగ్యూగా నిర్థారించారు. ప్లేట్‌లెట్లు డౌన్‌ కావడంతో మృతి చెందినట్టు చెప్పారు. 

-నిన్నటి వరకూ కరోనాతో భయపడిన జనం ఇప్పుడు ఎలాంటి జ్వరం వచ్చినా వణికిపోతున్నారు. ప్రస్తుతం డెంగ్యూ, టైఫాయిడ్‌, మలేరియా జ్వరా లు విజృంభిస్తున్నాయి. జ్వరం బారినపడిన ఒకటి రెండు రోజులకే రక్తంలో కణాలు తగ్గిపోతుండడంతో అపస్మారక స్థితికి వెళ్లిపోతున్నారు. తొలుత స్థానిక ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. తరువాత విశాఖ తరలిస్తు న్నారు. అప్పటికే పరిస్థితి విషమించి మృత్యువాత పడుతున్నారు. ముఖ్యం గా పేద, మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా కుదేలవుతున్నారు. గతంలో కరోనా బారిన పడినవారికి సైతం జ్వరాలు వస్తుండడంతో బెంబేలెత్తిపో తున్నారు. వారి అవసరాలన్ని, భయాన్ని కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు సొమ్ము చేసుకుంటున్నాయి. 

ఏడాదిగా కరోనా విధుల్లో

గత ఏడాదిగా వైద్య ఆరోగ్య శాఖ నిర్థారణ పరీక్షలు, వ్యాక్సినేషన్‌పైనే దృష్టిసా రించింది. యాప్‌ల్లో వివరాల నమోదుతో సిబ్బంది బిజీగా ఉన్నారు. ఉన్నతాధికారుల లక్ష్యాలు, ఆదేశాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో వర్షాకాలంలో చేయాల్సిన ఫీవర్‌ సర్వేలను మొక్కుబడి తంతుగా ముగిస్తున్నారు. ఆ ప్రభావం జ్వరాల గుర్తింపుపై పడుతోంది. దీనికితోడు గ్రామాల్లో పారిశుధ్యం అస్తవ్యస్తంగా ఉంది. చెత్త, వ్యర్థాలను ఇష్టారాజ్యంగా పారబోస్తున్నారు. ఖాళీ ప్లాస్టిక్‌ సీసాలు, కొబ్బరిబొండాలు ఎక్కడపడితే అక్కడే వేయడంతో అవి దోమలకు ఆవాసంగా మారుతున్నాయి. పంచాయతీల్లో పారిశుధ్య పనులు కూడా అంతంతమాత్రంగా జరుగుతున్నాయి. యంత్రాలు, పరికరాలు మూలకు చేరాయి. మేజర్‌ పంచాయతీల్లో సైతం ఫాగింగ్‌ చేస్తున్న దాఖలాలు లేవు. ఎస్‌.కోటలో విశాఖ-అరకు రోడ్డుకు ఆనుకొని ఉన్న కోనేరు దారుణంగా తయారైంది. చెత్త, వ్యర్థాలు పేరుకుపోయి దుర్వాసన వస్తోంది. ఇటీవల పరిశీలించిన సర్పంచ్‌ సంతోషికుమారి చెరువు ప్రక్షాళన చేయనున్నట్టు తెలిపారు. కానీ స్థానిక కారణాల దృష్ట్యా పనులకు మోక్షం కలగలేదు. ఇప్పటికైనా దృష్టిపెట్టాలని మేజర్‌ పంచాయతీ ప్రజలు కోరుతున్నారు. 

పారిశుధ్యంపై దృష్టి

ఎస్‌.కోట మేజర్‌ పంచాయతీలో పారిశుధ్యంపై ప్రత్యేకం గా దృష్టిసారించాం. కోనేరు, కళింగెడ్డ శుద్ధి విషయమై ప్రభు త్వం దృష్టికి తీసుకెళ్లాం. ఫాగింగ్‌ యంత్రం పాడైంది. అయి నా ఉన్నంతలో పనులు చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. 

-ఎంవీఏ శ్రీనివాసరావు (ఎంపీడీవో), ఈవో 

 

Updated Date - 2021-10-17T05:46:44+05:30 IST