జేమిసన్‌ కూల్చేశాడు..

ABN , First Publish Date - 2021-06-21T10:53:48+05:30 IST

ప్రపంచ టెస్టు చాంపియన్‌షి్‌ప ఫైనల్లో కివీస్‌ పేసర్లు సమష్టి ప్రదర్శనతో చెలరేగారు. ముఖ్యంగా జేమిసన్‌ (5/31) కీలక వికెట్లతో భారత జట్టును కూల్చాడు.

జేమిసన్‌ కూల్చేశాడు..

  • భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 217 ఆలౌట్‌ 
  • కివీస్‌ మొదటి ఇన్నింగ్స్‌ 101/2


 రెండో రోజు ఆటలో కోహ్లీ, రహానె క్రీజులో కుదురుకున్న తీరుకు భారత్‌ దీటుగానే బదులిస్తుందనిపించింది. కానీ ఆదివారం కివీస్‌ పేసర్లు కలిసికట్టుగా కదం తొక్కారు.ప్రధానంగా కైల్‌ జేమిసన్‌ (5/31) ప్రధాన ఆటగాళ్లను కట్టడి చేయడంతో పాటు మొత్తంఐదు వికెట్లతో భారత్‌ జోరును అడ్డుకున్నాడు. బ్యాటింగ్‌కు సవాల్‌ విసిరే ఈ పిచ్‌పై కోహ్లీ సేన 200కు పైగా  పరుగులు సాధించడం కాస్త ఊరటనిచ్చే విషయం. అటు బౌలింగ్‌లోనే కాకుండా న్యూజిలాండ్‌ జట్టు బ్యాటింగ్‌లోనూ స్థిరత్వం ప్రదర్శిస్తోంది.


సౌతాంప్టన్‌: ప్రపంచ టెస్టు చాంపియన్‌షి్‌ప ఫైనల్లో కివీస్‌ పేసర్లు సమష్టి ప్రదర్శనతో చెలరేగారు. ముఖ్యంగా జేమిసన్‌ (5/31) కీలక వికెట్లతో భారత జట్టును కూల్చాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 92.1 ఓవర్లలో 217 పరుగులకు ఆలౌటైంది. రహానె (117 బంతుల్లో 5 ఫోర్లతో 49), కోహ్లీ (132 బంతుల్లో 1 ఫోర్‌తో 44) ఫర్వాలేదనిపించారు. బౌల్ట్‌, వాగ్నర్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత కివీస్‌ ఆదివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి 49 ఓవర్లలో 2 వికెట్లకు 101 పరుగులు చేసింది. కాన్వే (153 బంతు ల్లో 6 ఫోర్లతో 54) హాఫ్‌ సెంచరీ సాధించాడు. క్రీజులో విలియమ్సన్‌ (12 బ్యాటింగ్‌), టేలర్‌ (0 బ్యాటింగ్‌) ఉన్నారు. అశ్విన్‌, ఇషాంత్‌ చెరో వికెట్‌ తీశారు.


తొలి సెషన్‌లో 4 వికెట్లు: మైదానం తడిగా ఉండడంతో మూడో రోజు తొలి సెషన్‌ ఆట అర్ధ గం ట ఆలస్యంగా ఆరంభమైంది. క్రీజులో కోహ్లీ, రహానె ఉండడంతో భారత్‌ ఆటపై అంచనాలు నెలకొన్నాయి. కానీ కివీస్‌ బౌలర్లు స్వింగ్‌, షార్ట్‌ పిచ్‌ బంతులతో బెంబేలెత్తిస్తూ 65 పరుగులకే కీలక నాలుగు వికెట్లను పడగొట్టారు. ముఖ్యంగా జేమిసన్‌ను ఎదుర్కోవడం కష్టమైంది. దీంతో తొలి 40 నిమిషాల ఆటలో  నాలుగు పరుగులు మాత్రమే వచ్చాయి. కోహ్లీకి ఆరంభంలోనే కివీస్‌ షాక్‌ ఇచ్చింది. తన ఓవర్‌నైట్‌ స్కోరుకు ఒక్క పరుగు కూడా జత చేయకుండానే అతడు జేమిసన్‌ ఓవర్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. దీనిపై రివ్యూకు వెళ్లినా ఫలితం లేకపోయింది. ఇక తొలి 19 బంతుల్లో ఖాతా తెరవలేకపోయిన పంత్‌ను కూడా జేమిసన్‌ అవుట్‌ చేశాడు. మరోవైపు రహానె అర్ధసెంచరీకి ముందే పేలవ షాట్‌తో వాగ్నర్‌కు చిక్కాడు. ఈ సమయంలో అశ్విన్‌ (22) మూడు ఫోర్లతో చకచకా స్కోరును పెంచే ప్రయత్నం చేసి లంచ్‌ బ్రేక్‌కు ముందు సౌథీకి చిక్కాడు. 


25 నిమిషాల్లోనే..: రెం డో సెషన్‌లో భారత్‌ టెయిలెండర్లను కివీస్‌ త్వరగానే చుట్టేసింది. ఇషాంత్‌ (4), బుమ్రా (0)లను వరుస బం తుల్లో జేమిసన్‌ పెవిలియన్‌కు చేర్చగా.. జడేజా (15)ను బౌల్ట్‌ అవుట్‌ చేశాడు. దీంతో భారత్‌ తమ స్కోరుకు ఆరు పరుగులను మాత్రమే జత చేయగలిగింది. అయితే బ్యాటింగ్‌కు ఇబ్బందిగా మారిన ఈ పిచ్‌పై భారత్‌ 200కుపైగా పరుగుల స్కోరు సాధించడం కాస్త ఊరటనిచ్చింది.


ఆచితూచి: ఓపెనర్లు లాథమ్‌, కాన్వే రెం డో సెషన్‌లో 21 ఓవర్లపాటు జాగ్రత్తను కనబరిచారు. దీంతో టీ బ్రేక్‌ సమయానికి జట్టు 36 పరుగులు చేసింది. ఇక చివరి సెషన్‌లో ఈ ఇద్దరూ చెత్త బంతులను బౌండరీలుగా మలుస్తూ క్రమంగా ఒత్తిడి పెంచారు. అయితే 35వ ఓవర్‌లో భారత్‌ ఎదురుచూపులకు అశ్విన్‌ ముగింపు పలికాడు. షార్ట్‌ ఎక్స్‌ట్రా కవర్‌లో లాథమ్‌ క్యాచ్‌ను కోహ్లీ పట్టేశాడు. దీంతో తొలి వికెట్‌కు 70 పరుగుల భారీ భాగస్వామ్యం ముగిసింది. అటు అద్భుత ఫామ్‌లో ఉన్న కాన్వే మరోసారి క్లాస్‌ ఇన్నింగ్స్‌ను చాటుకుంటూ అర్ధసెంచరీ సాధించాడు. 49వ ఓవర్‌లో అతడిని ఇషాంత్‌ పెవిలియన్‌కు చేర్చాడు. ఈ ఓవర్‌ అయ్యాక వెలుతురులేమితో అర్ధగంట ముందే ఆటను ముగించారు.


 వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షి్‌పలో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లను ఐదు సార్లు సాధించిన ఏకైక బౌలర్‌గా కైల్‌ జేమిసన్‌. ఇందులో భారత్‌పైనే రెండుసార్లు తీశాడు. అలాగే కివీస్‌ తరఫున తొలి 8 టెస్టుల్లోనే 44 వికెట్లతో రికార్డు నెలకొల్పాడు. జాక్‌ కోవీ (1937-49 మధ్య 41 వికెట్లు)ని అధిగమించాడు.


 ఆడిన తొలి మూడు టెస్టుల్లోనూ 50+ స్కోరు సాధించిన రెండో కివీస్‌ బ్యాట్స్‌మన్‌గా కాన్వే. డీన్‌ బ్రౌన్లీ గతంలో ఈ ఫీట్‌ సాధించాడు.


2013 తర్వాత ఇంగ్లండ్‌లో జరిగిన టెస్టుల్లో ఇరు జట్ల ఓపెనర్లు తమ తొలి ఇన్నింగ్స్‌లో మొదటి 20 ఓవర్లను వికెట్‌ పడకుండా పూర్తి చేయగలిగారు.


 విదేశాల్లో 200 వికెట్లు పూర్తి చేసిన భారత నాలుగో బౌలర్‌గా ఇషాంత్‌ శర్మ.



భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి) సౌథీ (బి) జేమిసన్‌ 34; గిల్‌ (సి) వాట్లింగ్‌ (బి) వాగ్నర్‌ 28; పుజార (ఎల్బీ) బౌల్ట్‌ 8; కోహ్లీ (ఎల్బీ) జేమిసన్‌ 44; రహానె (సి) లాథమ్‌ (బి) వాగ్నర్‌ 49; పంత్‌ (సి) లాథమ్‌ (బి) జేమిసన్‌ 4; జడేజా (సి) వాట్లింగ్‌ (బి) బౌల్ట్‌ 15; అశ్విన్‌ (సి) లాథమ్‌ (బి) సౌథీ 22; ఇషాంత్‌ (సి) టేలర్‌ (బి) జేమిసన్‌ 4; బుమ్రా (ఎల్బీ) జేమిసన్‌ 0; షమి (నాటౌట్‌) 4; ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 92.1 ఓవర్లలో 217 ఆలౌట్‌. వికెట్ల పతనం: 1-62, 2-63, 3-88, 4-149, 5-156, 6-182, 7-205, 8-213, 9-213, 10-217. బౌలింగ్‌: సౌథీ 22-6-64-1; బౌల్ట్‌ 21.1-4-47-2; జేమిసన్‌ 22-12-31-5; గ్రాండ్‌హోమ్‌ 12-6-32-0; వాగ్నర్‌ 15-5-40-2.

కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌: లాథమ్‌ (సి) కోహ్లీ (బి) అశ్విన్‌ 30; కాన్వే (సి) షమి (బి) ఇషాంత్‌ 54; విలియమ్సన్‌ (బ్యాటింగ్‌) 12; టేలర్‌ (బ్యాటింగ్‌) 0; ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 49 ఓవర్లలో 101/2. వికెట్ల పతనం: 1-70, 2-101. బౌలింగ్‌: ఇషాంత్‌ 12-4-19-1; బుమ్రా 11-3-34-0; షమి 11-4-19-0; అశ్విన్‌ 12-5-20-1; జడేజా 3-1-6-0.

Updated Date - 2021-06-21T10:53:48+05:30 IST