రెండు వారాల్లో ఆ జంట టవర్లను కూల్చేయండి: సుప్రీంకోర్టు ఆదేశాలు

ABN , First Publish Date - 2022-02-07T23:37:52+05:30 IST

నోయిడాలోని సూపర్‌టెక్ ఎమరాల్డ్ కోర్టు ప్రాజెక్టులో భాగంగా నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా నిర్మించిన జంట

రెండు వారాల్లో ఆ జంట టవర్లను కూల్చేయండి: సుప్రీంకోర్టు ఆదేశాలు

న్యూఢిల్లీ: నోయిడాలోని సూపర్‌టెక్ ఎమరాల్డ్ కోర్టు ప్రాజెక్టులో భాగంగా నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా నిర్మించిన జంట టవర్ల కూల్చివేత పనులను రెండు వారాల్లో మొదలుపెట్టాలని భారత అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. నోయిడాలోని సెక్టార్ 93లో ఉన్న ఎమరాల్డ్ కోర్టు‌లోని 40 అంతస్తుల ఈ టవర్లలో ఫ్లాట్లు బుక్ చేసుకున్న వారికి సొమ్ము వెనక్కి ఇవ్వాలని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్య కాంత్‌లతో కూడిన ధర్మాసనం ఇది వరకే సూపర్ టెక్ లిమిటెడ్‌ను ఆదేశించింది.  


72 గంటల్లోపు అన్ని ఏజెన్సీలతో సమావేశమై టవర్ల కూల్చివేతకు సంబంధించి షెడ్యూల్‌ను ఖరారు చేయాలని నోయిడా అథారిటీ ఎగ్జిక్యూటివ్ అధికారిని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని నోయిడా అథారిటీ మూడు రోజుల్లో కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది.  ఈ టవర్లలో ఫ్లాట్లు బుక్ చేసుకున్న 38 మంది తాము చెల్లించిన సొమ్మును వెనక్కి ఇచ్చేలా డెవలపర్‌ను ఆదేశించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్లను ఇది వరకే విచారించిన కోర్టు వారికి ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని ఆదేశించింది.


ఈ ట్విన్ టవర్లను అక్రమంగా నిర్మించినట్టు గుర్తించిన సుప్రీంకోర్టు గతేడాది ఆగస్టు 31నే వీటిని కూల్చివేయాలని ఆదేశించింది. ఈ ఆదేశాల నేపథ్యంలో కూల్చివేత ఏజెన్సీతో ఒప్పందం కుదుర్చుకోవాలంటూ జనవరి 17న మరోమారు సూపర్ టెక్ లిమిటెడ్‌ను కోర్టు ఆదేశించింది.


అయితే, వాటిని సురక్షితంగా కూల్చివేసేందుకు తమకు మూడు నెలల సమయం కావాలని సూపర్ టెక్ కోర్టును కోరింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు.. న్యాయస్థానంతో పరాచికాలాడితే జైలుకు పంపాల్సి వస్తుందని ఆ సంస్థ డైరెక్టర్లను ఆదేశించింది. అలాగే, ట్విన్ టవర్లలో ఫ్లాట్‌లను బుక్ చేసుకున్న గృహ కొనుగోలుదారులందరికీ ఫిబ్రవరి 28వ తేదీ లోపు వడ్డీతో సహా డబ్బును తిరిగి చెల్లించాలని సూపర్ టెక్‌ను కోర్టు ఆదేశించింది.

Updated Date - 2022-02-07T23:37:52+05:30 IST