అక్రమ నిర్మాణాల కూల్చివేత

ABN , First Publish Date - 2022-01-22T05:01:12+05:30 IST

అక్రమ నిర్మాణాల కూల్చివేత

అక్రమ నిర్మాణాల కూల్చివేత
ఈశ్వర్‌ కాలనీలో అక్రమ నిర్మాణాన్ని కూల్చివేస్తున్న సిబ్బంది

షాద్‌నగర్‌, జనవరి 21: మున్సిపల్‌ పరిధిలోని అక్రమ నిర్మాణాలను హెచ్‌ఎండీఏ అధికారులు కూల్చివేశారు. మూడు వారాల క్రితం హెచ్‌ఎండీఏ అధికారులు పట్టణంలో అనుమతిలేని భవనాలను గుర్తించారు. అందులో భాగంగా శుక్రవారం హెచ్‌ఎండీఏ అసిస్టెంట్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌ దామోదర్‌, పట్టణ టౌన్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌ శ్రీనివాస్‌, పోలీస్‌ సిబ్బంది నేతృత్వంలో పట్టణంలోని ఈశ్వర్‌ కాలనీ, మల్లికార్జున కాలనీ, సాయి బాలాజీ వెంచర్‌లో గల మూడు బిల్డింగ్‌లను కూల్చివేశారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా పట్టణంలో జీప్ల్‌స2కు మించి నిర్మించిన కమర్షియల్‌, రెసిడెన్షియల్‌ భవనాలను కూల్చివేయాలని హెచ్‌ఎండీఏలో పైస్థాయి నుంచి ఆదేశాలు వచ్చాయని, అందుకే అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నామని దామోదర్‌ తెలిపారు. ముందుగా హెవీ స్ట్రక్చర్‌ రూపంలో ఉన్నవాటిని కూలుస్తున్నామని, ఆతర్వాత మిగతా వాటిని కూల్చివేస్తామని చెప్పారు.

మున్సిపల్‌ అధికారుల తప్పిదమే ..

మున్సిపల్‌ అధికారుల తప్పిదాల వల్లనే తమ భవనాలను అక్రమ కట్టడాల జాబితాలో చేర్చారని ఒక ఇంటి యజమాని ఆవేదన వ్యక్తం చేశాడు. తమ పిల్లల చదువుల కోసం గ్రామాల్లో ఉన్న భూములను అమ్ముకుని ఇళ్లు కట్టుకుంటే ఎలా కూల్చివేస్తారని ఆందోళన వ్యక్తం చేశాడు. తన ఇంటికి అనుమతిపత్రాలు ఉన్నాయంటూ వాటిని హెచ్‌ఎండీఏ అధికారులకు చూపాడు. అదేవిధంగా ఈశ్వర్‌కాలనీలోని మరో బిల్డింగ్‌కు ఇంటినెంబర్‌తో పాటు ప్రాపర్టీ ట్యాక్స్‌ కూడా పట్టణ మున్సిపల్‌ అధికారులు కట్టించుకున్నారని, ఇప్పుడు వాటిని అక్రమ నిర్మాణాలంటూ కూల్చివేయడం తగదని గృహ యజమాని ఆవేదన వ్యక్తంచేశారు. బిల్డింగ్‌లు నిర్మించేటప్పుడు మున్సిపల్‌ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదని, ఇప్పుడు కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి నిర్మాణాలు పూర్తిచేసిన తర్వాత కూల్చివేయడం తగదని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2022-01-22T05:01:12+05:30 IST