అక్రమ నిర్మాణాల కూల్చివేత

ABN , First Publish Date - 2022-01-19T04:57:01+05:30 IST

అక్రమ నిర్మాణాల కూల్చివేత

అక్రమ నిర్మాణాల కూల్చివేత
పోచారంలో ఎక్స్‌కవేటర్‌తో అక్రమ నిర్మాణం కూల్చివేత

ఘట్‌కేసర్‌: పోచారం మున్సిపాలిటీలో మంగళవారం హెచ్‌ఎండీఏ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు నాలుగు అనుమతి లేని నిర్మాణాలను కూల్చివేశారు. హెచ్‌ఎండీఏ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు, పోలీసు బలగాలు సమక్షంలో ఎక్స్‌కవేటర్‌తో పోచారం బొడ్రాయి వద్ద అనుమతి తీసుకోకుండా కట్టిన అకిటి రాజేందర్‌రెడ్డి ఇంటిని కూల్చివేశారు. దీంతో అతడు గేటు ఎదటే సొమ్ముసిల్లి పడిపోయాడు. అనంతరం ఇంటిని పిల్లర్లతో సహాకూల్చేశారు. అనంతరం సర్వేనెంబర్‌ 35లోని ప్రభుత్వ భూమిలో నిర్మించిన మూడు ఇళ్లను పాక్షికంగా కూల్చారు. నిర్మాణాలు చేస్తున్నపుడు చూస్తూ ఊరుకున్న అధికారులు తీరారూ.లక్షలు వెచ్చించి నిర్మాణాలు పూర్తయిన తర్వాత కూల్చడం ఏమిటని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.  మున్సిపాలిటీలో వందలాది అక్రమ నిర్మాణాలుండగా కేవలం మూడునాలుగు కట్టడాలను కూల్చి చేతులు దులుపుకుంటున్నారని, అందరికీ ఒకే న్యాయం ఉండాలన్నారు. అధికారులు కొందరినే టార్గెట్‌ చేస్తున్నారని వాపోయారు. కూల్చివేతల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు, కమిషనర్‌ సురేష్‌, కౌన్సిలర్‌ అకిటి బాల్‌రెడ్డి, గొంగళ్ల మహేశ్‌, బద్దం జగన్మోహన్‌రెడ్డి, ఎ.బాల్‌రెడ్డి, అనంతరెడ్డి పాల్గొన్నారు.


  • హైకోర్టు ఆదేశాలతో ప్రహరీలు, గేట్ల కూల్చివేత

సంస్కృతి టౌన్‌షిప్‌ నుంచి బయటకు వెళ్లకుండా నిర్మించిన నాలుగు గేట్లను మంగళవారం మున్సిపల్‌ అధికారులు కూల్చివేశారు. టౌన్‌షిప్‌ ప్లాట్స్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ గతంలో చుట్టూ ప్రహరీ నిర్మించింది. టౌన్‌షిప్‌ పక్కనే ఓ ప్రైవేట్‌ సంస్థ అపార్ట్‌మెంట్లు నిర్మించింది. ఆ సమయంలో టౌన్‌షిప్‌ రోడ్డును అపార్ట్‌మెంట్ల వాసులు సైతం వాడుకునేలా హెచ్‌ఎండీఏ అనుమతులిచ్చింది. కానీ తమటౌన్‌షిప్‌ నుంచి బయటికి రోడ్డు పోనివ్వం అని టౌన్‌షిప్‌ వాసులు గోడలు నిర్మించారు. దీంతో అపార్ట్‌మెంట్లు నిర్మించిన సంస్థ కోర్టును అశ్రయించింది. మూడేళ్లుగావివాదం కొనసాగగా అపార్ట్‌మెంట్లకు రోడ్డు సౌకర్యం కల్పించాలని సోమవారం హైకోర్టు తీర్చు ఇచ్చింది. మంగళవారం సాయంత్రం కమిషనర్‌ సురేష్‌ తన సిబ్బందితో కలిసి టౌన్‌షిప్‌ నుంచి బయటకు వెళ్లకుండా నిర్మించిన గోడలు, గేట్లను కూల్చివేశారు. టౌన్‌షి్‌పలోని మెయిన్‌ గేట్‌ వద్ద సెక్యూరిటీ కార్యాలయాన్ని సైతం కూల్చివేశారు. దీంతో పోచారం వాసులు, అపార్ట్‌మెంట్ల నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు.

Updated Date - 2022-01-19T04:57:01+05:30 IST