కుట్రతోనే ‘కూల్చారు’

ABN , First Publish Date - 2022-06-05T09:12:09+05:30 IST

కృష్ణపట్నంలోని జెన్కో థర్మల్‌ కేంద్రం షట్‌డౌన్‌ కావడం పథకం ప్రకారమే జరిగిందా..

కుట్రతోనే ‘కూల్చారు’

  • పథకం ప్రకారమే కృష్ణపట్నం షట్‌డౌన్‌
  • బూడిద తరలించకపోవడంతో కూలిన హాఫర్స్‌
  • ఉద్యోగులు బయటకు వచ్చేయడంతో తప్పిన భారీ ప్రాణనష్టం
  • 4 నెలల ముందే దెబ్బతిన్న సైలో మెకానిజం
  • అయినా పట్టించుకోని ప్రభుత్వం
  • ప్రైవేటీకరణ యోచనతోనే జనవరి నుంచీ విద్యుదుత్పత్తి తగ్గింపు
  • 1,600 మెగావాట్ల ఉత్పాదన బంద్‌
  • దాంతో రాష్ట్రంలో పెరిగిన కోతలు


(నెల్లూరు-ఆంధ్రజ్యోతి): కృష్ణపట్నంలోని జెన్కో థర్మల్‌ కేంద్రం షట్‌డౌన్‌ కావడం పథకం ప్రకారమే జరిగిందా.. ప్రమాదమని తెలిసినా బూడిదను తరలించకపోవడం వెనుక కుట్ర దాగి ఉందా..? ఈ ప్రశ్నలకు సంబంధిత వర్గాల నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది.  జెన్కో థర్మల్‌ కేంద్రంలోని యాష్‌ హ్యాండ్లింగ్‌ యూనిట్‌లో గత నెల 28వ తేదీన ఎలకో్ట్రస్టాటిక్‌ ప్రిస్పిరేటర్‌ హాఫర్స్‌(బొగ్గు తొట్టెలు) కూలిపోయాయి. రెండో యూనిట్‌ అంతా బూడిదతో నిండిపోయింది. దీంతో ఆ యూనిట్‌లో విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. ఈ హాఫర్స్‌ కూలిపోవడం వెనుక కుట్ర ఉందని కార్మికులు ఆరోపిస్తున్నారు. సాధారణంగా బూడిదను సైలో మెకానిజం(పైపులైన్‌ ద్వారా బూడిదను నేరుగా యాష్‌ పాండ్‌కు తరలించడం) ద్వారా తరలిస్తారు. అయితే నాలుగు నెలల క్రితం ఈ వ్యవస్థ దెబ్బతిన్నా పట్టించుకోలేదు. ప్రత్యామ్నాయంగా హాఫర్స్‌ను ఉపయోగించి బాయిలర్స్‌లో నుంచి వచ్చే బూడిదను చల్లబరిచి యార్డులకు.. అక్కడి నుంచి యాష్‌పాండ్‌కు తీసుకెళ్తున్నారు. ఇలా తరలించే కాంట్రాక్టును స్థానిక వైసీపీ నాయకుడు తీసుకున్నారు. థర్మల్‌ కేంద్రంలో దాదాపు 56వరకు హాఫర్స్‌ ఉన్నాయి. మొదట పది హాఫర్స్‌ నిండిపోగానే తర్వాతి పది హాపర్స్‌లో బూడిద నింపుతారు. ఈలోపు ఈ పది హాఫర్స్‌ నుంచి బూడిదను యాష్‌పాండ్‌కు తరలించడం కాంట్రాక్టర్‌ బాధ్యత. కొన్ని రోజుల నుంచి కాంట్రాక్టర్‌ బూడిదను తరలించడం లేదు. దీంతో హాఫర్స్‌ నిండిపోతూ వచ్చాయి. ఈ క్రమంలో వాటిపై ఎక్కువ భారం పడడంతో రెండు హాఫర్స్‌ కూలిపోయాయి. ఫలితంగా దాదాపు రూ.కోటి వరకు నష్టం వాటిల్లినట్లు ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు. 


పట్టించుకోని యాజమాన్యం

హాఫర్స్‌ ప్రమాదకరంగా మారుతున్నాయని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. అవి కూలిపోయే సమయంలో ఉద్యోగులంతా బయటకొచ్చేశారు. కాగా.. హాఫర్స్‌ కూలిపోయే ప్రమాదముందని అక్కడి ఇంజనీర్లు మరో కాంట్రాక్టర్‌ను తీసుకొచ్చి బొగ్గు తరలించేందుకు ప్రయత్నించారు. అయితే వచ్చిన ఎక్స్‌కవేటర్లు, ట్రాక్టర్లను ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లతో వెనక్కి పంపారు.


క్రమేణా తగ్గిన ఉత్పత్తి

కృష్ణపట్నం థర్మల్‌ కేంద్రాన్ని ప్రైవేటీకరణ చేయాలన్న ఆలోచన వచ్చినప్పటి నుంచే నిర్వహణలో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండు యూనిట్లు ఆపరేషన్‌లో ఉన్నాయి. గత డిసెంబరు వరకు ఒక్కో యూనిట్‌లో 600 మెగావాట్ల వరకు ఉత్పత్తి జరుగుతుండేది. తర్వాతి నుంచి క్రమేణా తగ్గిస్తూ 300 మెగావాట్ల వరకు తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే గత నెలలో మొదటి యూనిట్‌లో విద్యుదుత్పత్తిని పూర్తిగా నిలిపేశారు. ఇదిలా ఉండగానే ఇప్పుడు రెండో యూనిట్‌లో హాఫర్స్‌ కూలిపోవడంతో ఆ యూనిట్‌లోనూ ఉత్పత్తి నిలిచిపోయింది. ఈ సూపర్‌ క్రిటికల్‌ థర్మల్‌ కేంద్రంలో 1600 మెగావాట్లకు గాను ప్రస్తుతం ఒక్క మెగావాట్‌ ఉత్పత్తి కూడా జరగడం లేదు. ఫలితంగా రోజుకు రూ.కోట్లలో ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతోంది. అసలే రాష్ట్రంలో విద్యుత్‌ కోతలతో ప్రజలు అల్లాడుతున్నారు. ఇప్పుడీ థర్మల్‌ కేంద్రం కూడా షట్‌డౌన్‌ కావడంతో కోతలు రెట్టింపయ్యాయి. కాగా ఇక్కడి మూడో యూనిట్‌ నిర్మాణం కూడా పూర్తయి నెలలు గడుస్తున్నా ఆపరేషన్‌లోకి తీసుకురాలేదు. ఇదంతా ప్రైవేటీకరణలో భాగంగా ప్రభుత్వం చేస్తున్న కుట్రని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి.

Updated Date - 2022-06-05T09:12:09+05:30 IST