వైసీపీ పాలనలో ప్రజాస్వామ్య హింస

ABN , First Publish Date - 2021-04-12T04:51:32+05:30 IST

వైసీపీ పాలనలో ప్రజాస్వామ్య హింస జరుగుతోందని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు, మాజీమంత్రి కిమిడి కళావెంకటరావు ఆరోపించారు. ఆదివారం జిల్లాకేంద్రంలో టీడీపీ శ్రీకాకుళం పార్లమెంట్‌ అధ్యక్షుడు కూన రవికుమార్‌ కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యేలు గుండ లక్ష్మీదేవి, బగ్గు రమణమూర్తితో కలసి ఆయన పరామర్శించారు.

వైసీపీ పాలనలో ప్రజాస్వామ్య హింస
విలేకరులతో మాట్లాడుతున్న మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నాయకులు కళావెంకటరావు

పోలీసు వ్యవస్థను ప్రభుత్వం గుప్పిట్లో పెట్టుకుంది

రవికుమార్‌ కుటుంబానికి అండగా ఉంటాం 

టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కళా వెంకటరావు

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, ఏప్రిల్‌ 11: వైసీపీ పాలనలో ప్రజాస్వామ్య హింస జరుగుతోందని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు, మాజీమంత్రి కిమిడి కళావెంకటరావు ఆరోపించారు. ఆదివారం జిల్లాకేంద్రంలో టీడీపీ శ్రీకాకుళం పార్లమెంట్‌ అధ్యక్షుడు కూన రవికుమార్‌ కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యేలు గుండ లక్ష్మీదేవి, బగ్గు రమణమూర్తితో కలసి ఆయన పరామర్శించారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ, జగన్మోహన్‌రెడ్డి పరిపాలన అంధకారం, అరాచకంగా మారిందని దుయ్యబట్టారు. ‘స్థానిక సంస్థల ఎన్నికలు ఒక ప్రహసనంలా మారాయి. ఇలా అయితే ప్రజాస్వామ్యానికి అర్థమేంటి. ఆరుగురు సీఐలు, ఇద్దరు డీఎస్పీలు, ఎనిమిది వాహనాలతో పోలీసు బలగాలున్నా రవికుమార్‌ స్వగ్రామంలో గొడవలు జరిగాయి. దీన్ని రవికుమార్‌ ప్రశ్నిస్తే తప్పేంటి?. పోలీసు వ్యవస్థను ప్రభుత్వం గుప్పిట్లో పెట్టుకుంది. ప్రజలను ప్రజలే రక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నా 39 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎంతోమంది సీఎంలను చూశా. ఇలాంటి పాలన ఎప్పుడూ లేదు. ప్రభుత్వం మొత్తం వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసింది. చెప్పిందే వేదం, చేసిందే చట్టంలా అరాచకపాలన సాగుతోంది. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ఎవరికైనా ఉంటుంది. దీనికి జవాబు చెప్పాల్సిన బాధ్యత అఽధికారంలో ఉన్నవారిపై ఉంది. అలా చేయకుండా కేసులు పెడుతున్నారు. ప్రతిపక్ష నేతగా రవికుమార్‌ పోలీసులను ప్రశ్నిస్తే తప్పేంటి. దీనిపై సమాధానం చెప్పకుండా కేసులు పెట్టడం సరికాదు.  ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా, హింసించినా ప్రజలకోసం టీడీపీ పోరాడుతూనే ఉంటుంది. చంద్రబాబునాయుడు నాయకత్వంలో మేమంతా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటాం.  రవికుమార్‌కు పార్టీ అండగా ఉంటుంది’ అని కళాకవెంకటరావు తెలిపారు. బగ్గు రమణమూర్తి మాట్లాడుతూ,  ఎక్కడ అన్యాయం జరిగినా రవికుమార్‌ ప్రశ్నిస్తారన్నారు.  గుండ లక్ష్మీదేవి మాట్లాడుతూ, ఇంటిలో రవికుమార్‌ భార్య, కుమార్తె ఉన్నప్పుడు పోలీసులు బలగాలు దౌర్జన్యం సృష్టించడం సమంజసం కాదన్నారు.   సమావేశంలో జిల్లాకు చెందిన పార్టీనాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-04-12T04:51:32+05:30 IST