Abn logo
Apr 8 2021 @ 00:24AM

ప్రజాస్వామ్యమొక్కటే హింసలకు జవాబు

దట్టమైన దండకారణ్యంలో మొన్న ఒక ఎన్‌కౌంటర్ జరిగింది. 22 మంది పోలీసులు, నలుగురు మావోయిస్టులు చనిపోయారు. చాలా పెద్ద సంఘటన. ప్రభుత్వానికి చాలా కోపం వచ్చింది. మావోయిస్టులు సృష్టిస్తున్న అశాంతికి తార్కిక ముగింపు ఇస్తామని హోంమంత్రి అమిత్ షా ఉద్ఘాటించారు. ప్రతిపక్షాల వారు కూడా ఖండనమండనలు చేశారు. పోలీసు మృతుల కుటుంబాల వారి ఆవేదనలు మీడియాలో వచ్చాయి. మృతదేహాలు, ఆయుధాలు, తూటాలు, వీటితో పాటు క్షతగాత్రుల ఫోటోలు కూడా ప్రచురితమయ్యాయి. ఒక పోలీసు ఇంకా మావోయిస్టుల వద్ద బందీగా ఉన్నాడు. మధ్యవర్తిని ఎంపిక చేసి పంపిస్తే, బందీని అతనికి అప్పగిస్తామని మావోయిస్టుల ప్రకటన చెబుతోంది. తమ వైపు చనిపోయిన నలుగురిలో ముగ్గురి అంత్యక్రియలు చేశామని, ఒకరి మృతదేహం స్వాధీనం చేసుకోలేకపోయామని కూడా వాళ్లు చెప్పారు. పోలీసులతో తమకు శత్రుత్వం లేదని, పోలీసుల కుటుంబాలకు సంతాపం చెబుతున్నామని కూడా ఆ ప్రకటనలో ఉంది. బందీకి మావోయిస్టుల నుంచి ఏ హానీ ఉండదని నమ్ముతున్నామని అధికారులు అంటున్నారు. ప్రభుత్వానికి, మావోయిస్టులకు మధ్య చర్చల అవకాశాల గురించి, సమస్యను సమగ్ర దృక్పథం నుంచి పరిశీలించడం గురించి మేధావులు మాట్లాడడం మొదలుపెట్టారు. 


గత శనివారం నాడు ఛత్తీస్‌గఢ్‌లో బిజాపూర్, సుక్మా జిల్లాల సరిహద్దులో జరిగిన సంఘటనకు సాధ్యమైనంత మేరకు ఎటువంటి ఉద్వేగాలు, ఆవేశాలు లేకుండా చేయగలిగే కథనం అది. సంఘటన నుంచి, సన్నివేశం నుంచి భౌతికంగానూ, మానసికంగానూ ఎడంగా ఉండేవారికి అది ఒక సంచలన వార్తో, దుర్ఘటనో అవుతుంది కానీ, ఏరకంగా అందులోని మనుషులతో సంబంధం ఉన్నవారికైనా అది జీవితాలను అతలాకుతలం చేసే వార్త. ఆగ్రహమో, ఆవేశమో, దుఃఖమో పొంగిపొర్లే వార్త. పోయిన ప్రాణాలు, అవి ఎవరివైనా తిరిగిరావు. ఈ ప్రపంచంలో అత్యంత పెద్ద కష్టం ప్రాణనష్టమే, అతి పెద్ద త్యాగం ప్రాణత్యాగమే. అంతకుమించి, లోతులకు వెళ్లి సందర్భాన్ని అర్థం చేసుకోవాలంటే, తక్షణ ఉద్వేగాలకు అతీతంగా చూడాలి. ఎందుకు జరిగిందో మాత్రమే కాదు, ఇట్లా జరగకూడదంటే ఏమి చేయాలో తెలియడానికి కూడా ఒక సమ్యక్ దృష్టి కావాలి. 


ప్రతి సంఘటనకు ఒక నేపథ్యం ఉంటుంది. కార్యకారణ సంబంధం ఉంటుంది. పర్యవసానాలుంటాయి. ఏదీ ఆకాశాన్నుంచి ఊడిపడినట్టు జరిగిపోదు. దేనికో అది కొనసాగింపు అవుతుంది, మరి దేనినో అది కొనసాగిస్తుంది. గొలుసు లంకెలు కలిగిన సంఘటనలనుంచి విడిగా ఒక దానిని పరిశీలించి ఎట్లా అర్థం చేసుకోగలం? మునుపూ ఇటువంటి సంఘటనలు జరిగాయి. ఇప్పుడు 22 మందే, గతంలో ఒకసారి 75మంది పోలీసులు ఒకే ఘటనలో మరణించారు. నక్సలైట్లు ఒకే సంఘటనలో నలభై మంది, ఇరవై మంది, పది మంది చనిపోయిన ఘటనలు గత పది పదిహేనేళ్లలో జరిగాయి. పోయిన నవంబర్ నుంచి ఇప్పటిదాకా, ఈ ఆర్నెల్ల కాలంలో 150 మంది పోలీసు చర్యల్లో చనిపోయారని మావోయిస్టులు లేఖలో రాశారు. ఈ గొలుసుకట్టు సంఘటనలను, దాని చుట్టూ ఉన్న అనేక నేపథ్యాలను పరిశీలించి, మౌలిక పరిష్కారం దిశగా ప్రయత్నాలు చేయకపోతే, ఇటువంటి సంఘటనలు అటూ ఇటూ జరుగుతూనే ఉంటాయి. జరిగినప్పుడల్లా, అది మావోయిస్టులపై భద్రతాబలగాల మాటు అయితే ఒకరకంగా, సాయుధపోలీసులపై మావోయిస్టుల మాటు అయితే ఇంకొక రకంగా స్పందనలను వింటుంటాము. ఆ రెండు పక్షాలకు మాత్రం ఆ సంఘటనలు ఎదుటివారిపై సాధించిన విజయం, లేదా ప్రతీకారం, ప్రతిఘటన. ఈ ప్రాణనష్టాలను ఒకదానికి ఒకటి పోటీ పెట్టి, చెల్లుకు చెల్లు అనగలమా? హత్యలను సమర్థించగలమా? ప్రతీకారాలను ఆమోదించగలమా? ఇన్ని రకాల మరణాలు, ఎంతటి మానవ నష్టం? ఎంతటి సృజనాత్మకత నష్టం? ఇవి సాధించగలిగే ప్రయోజనాలెంత మాత్రం? 


పోలీసులు, మావోయిస్టులు వైరివర్గాలుగా చాలామంది భావిస్తుంటారు. వారిలో కూడా కొందరు తాము పరస్పరం అసలైన ప్రత్యర్థులుగా భావిస్తూ ఉండవచ్చు. మావోయిస్టులు తమది రాజకీయ పోరాటమని, రాజకీయ లక్ష్యాల సాధన కోసమే సైనికచర్యలని చెబుతారు. పోలీసులది ఉద్యోగం, విధినిర్వహణ. తాము నిర్వహిస్తున్న కర్తవ్యం మంచిదా చెడ్డదా అన్న విచక్షణ ఆధారంగా వారి నిబద్ధత ఉండదు. ప్రభుత్వంతో, వ్యవస్థతో పోరాడుతున్నామని చెప్పే మావోయిస్టులతో వ్యవహరించవలసింది నిజానికి రాజకీయ నాయకులు, పాలకులు. పాలక రాజకీయాల వైఫల్యం వల్లనే మావోయిస్టు అశాంతి వంటివి ఉత్పన్నమవుతాయి అనుకుంటే, దానిని రాజకీయంగా పరిష్కరించాలి తప్ప, తమది కాని కర్తవ్యాన్ని, బాధ్యతను, మోయలేని బరువును పోలీసులపై, అర్ధ సైనిక బలగాలపై మోపడం ఎందుకు? ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి, మంచిదో చెడ్డదో ఒక సిద్ధాంతమార్గాన్ని నమ్మి ప్రమాదాల దారిలోకి నడిచే ఒక పోరాటవాదికి ఉన్నంత తెగింపు, నిబద్ధత, ఎంతటి కర్తవ్యబద్ధుడైనప్పటికీ ఉద్యోగికి ఉండాలని ఎట్లా ఆశిస్తారు? అన్ని రాజకీయ ఉద్యమాల విషయంలోనూ పాలకపక్షాలు, తాము సత్పరిపాలన ద్వారా పరిష్కరించవలసిన సమస్యల భారాన్ని పోలీసుల మీదకే నెట్టివేస్తున్నారు. 


మావోయిస్టుల లక్ష్యాలు మంచివే కానీ, వారి మార్గం మంచిది కాదని అనేవాళ్లుంటారు. అటువంటి అభిప్రాయానికి మంచి గౌరవమే లభిస్తుంది ప్రస్తుత సమాజంలో. మరి, అశాంతి నిర్మూలన అనే మంచి లక్ష్యాన్ని సాధించడానికి ప్రభుత్వం అనుసరించే మార్గం కూడా మంచిదే అయి ఉండాలి కదా? ఇద్దరి మార్గాలూ అనైతికమే అయినప్పుడు, వాటి వల్ల సమకూరే ఫలితాలు సందేహాస్పదమే అవుతాయి. కేవలం అరణ్యాలలో ఆయుధాలు పట్టుకుని చేసే చర్యల వల్ల మావోయిస్టుల ఆశయాలు నెరవేరబోవని తెలుస్తూనే ఉన్నది. సమాధాన్, ప్రహార్.. ఇంకే పేరు పెట్టుకున్నా ప్రభుత్వ అణచివేతల వల్ల సాయుధ రాజకీయాలు కూడా అణగారిపోవు. యాభై ఏళ్లయింది నక్సలైట్ ఉద్యమం పుట్టి. అంతకుముందు ఇరవయ్యేళ్ల కిందట దేశంలో తొలి కమ్యూనిస్టు పోరాటాలు, అంతకు ముందు స్వాతంత్ర్యం కోసమో ఆత్మగౌరవం కోసమో అనేక తిరుగుబాటు జాతీయవాద బృందాలు.. ఉంటూనే ఉన్నాయి. మావోయిస్టులనే వారిని శ్రీలంకలో ఎల్‌టీటీఈ ని చేసినట్టు చుట్టుముట్టి మట్టుపెట్టినా, మరో చోట మరో రకంగా అటువంటి తిరుగుబాటుదారులు తలెత్తుతారు. 


మావోయిస్టులు కానీ, అటువంటి విప్లవ వాదులో, మిలిటెంట్ ఉద్యమకారులో వారు వారి చర్యల పర్యవసానంగా అణగారిపోతే, అమిత్ షా ఆశించినట్టు తార్కిక ముగింపు జరిగినట్టు భావించవచ్చు. కానీ వాళ్లు ఒకసారి అణగారినా మరోచోట మరోసారి మొలకెత్తుతూనే ఉన్నారు. భారత రాజకీయాలలో ఎప్పుడూ ఒక తీవ్ర పరిష్కారమార్గం ఉనికిలో ఉంటూనే వచ్చింది. రాజీలేని పోరాటం- అన్న భావన ఇచ్చే ఆకర్షణ సామాన్యమైనది కాదు. దాని నుంచి అమిత్ షా గారి పార్టీ కూడా తప్పించుకోలేదు. తెలంగాణలో రైతాంగ పోరాటయోధుల చరిత్రను కలిపేసుకోవడం దగ్గర నుంచి, నక్సలైట్ నేపథ్యమున్న నేతలను పార్టీలోకి తీసుకోవడం దాకా వ్యూహం. వీరసావర్కార్ దగ్గర నుంచి గాడ్సే దాకా, బోస్ నుంచి పటేల్ దాకా.. మిలిటెంట్ పరిష్కారాలను వరించిన నేతలే ఆ పార్టీకి ఇష్టులు. ఇక రాజకీయ నాయకులలో ఎన్‌టి రామారావు, వైఎస్ రాజశేఖరరెడ్డి, కె. చంద్రశేఖరరావు తరువాత తరువాత ఏమి చేసినప్పటికీ, మొదట మొదట నక్సలైట్లను దేశభక్తులన్నవారే, ఎన్‌కౌంటర్లను బూటకమన్నవారే. హింసావాద రాజకీయాలు అనుసరించినవారు అనేకులు తమ పద్ధతులు సవరించుకుని ఎన్నికల రాజకీయాలలోకి వచ్చినవారే. అనేకమంది గాంధేయులు, మధ్యేవాద రాజకీయవాదులు మిలిటెంట్ రాజకీయవాదులను గౌరవించినవారే, కలసి నడచినవారే. 


మావోయిస్టు అశాంతి- అని పిలుస్తున్న పరిస్థితి తొలగిపోవాలంటే, అందుకు ప్రజాస్వామ్యం ఒక్కటే మార్గం. ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలు ఉండడం మాత్రమే కాదు. ప్రజాస్వామ్య పద్ధతుల ద్వారా సమస్యలను పాలకులు ఆలకిస్తారని, పరిష్కరిస్తారని, ప్రజల భాగస్వామ్యం పాలనలో ఉంటుందని నమ్మకం కలగాలి. పౌరులు తమ ప్రతిపత్తి ద్వారానే సమాజాన్ని మెరుగుపరిచే క్రియలో పాలుపంచుకోగలిగితే, ఇక తీవ్ర మార్గాల అవసరం ఏమిటి? దురదృష్టవశాత్తూ, మన ప్రభుత్వాలు శాంతియుత మార్గాల ద్వారా ప్రజాసమస్యలు పరిష్కారం అవుతాయన్న నమ్మకాన్ని కలిగించలేకుండా ఉన్నారు. ఆ వైఫల్యం ఎందుకో ఆత్మవిమర్శ చేసుకోవాలి. ప్రజాస్వామ్యం ప్రజలను సాధికారుల్ని చేసి, తద్వారా తనను తాను కాపాడుకోగలదు. అటువంటి ఉత్తమ రాజకీయవిధానంలో హింసకు ఆస్కారముండదు. 


లేలేత ప్రాయపు యువకుల అకాలమరణాలు, హింసాయుత సంఘటనలు -వీటన్నిటికి కారణం– ప్రశ్నలకు సరైన సమాధానాలను ఇవ్వలేని వైఫల్యమే, ప్రజాస్వామ్యాన్ని హైజాక్ చేసి కొందరికి ధారదత్తం చేసిన వారి దుర్మార్గమే. తప్పెక్కడ జరుగుతోందో తెలుసుకుంటే రేపటి మరణాలను ఆపగలుగుతాము. ఫుల్‌స్టాప్‌ను సాధించేముందు, ఒక చిన్న ‘కామా’ కోసం ప్రయత్నించాలి. లేకపోతే, తప్పుల్లో పాపం అందరిదీ అవుతుంది.

కె. శ్రీనివాస్

ప్రత్యేకంమరిన్ని...