ఓటరు చేతిలో ప్రజాస్వామ్యం

ABN , First Publish Date - 2022-01-25T06:22:13+05:30 IST

ప్రజాస్వామ్య పరిపాలనావ్యవస్థలో ఓటరుదే కీలక పాత్ర. యథాప్రజా.. తథా రాజా అన్నది ఇక్కడ వర్తిస్తుంది. ప్రతి ఐదేళ్ళకోసారి దేశంలోని ప్రతీ ఓటరుకు తన పాలకుల్ని ఎన్నుకునే అవకాశం వస్తోంది...

ఓటరు చేతిలో ప్రజాస్వామ్యం

ప్రజాస్వామ్య పరిపాలనావ్యవస్థలో ఓటరుదే కీలక పాత్ర. యథాప్రజా.. తథా రాజా అన్నది ఇక్కడ వర్తిస్తుంది. ప్రతి ఐదేళ్ళకోసారి దేశంలోని ప్రతీ ఓటరుకు తన పాలకుల్ని ఎన్నుకునే అవకాశం వస్తోంది. ఒక్కోసారి ఈ లోపే రావచ్చు. కాని నేటి ఓటర్లలో అత్యధికం... అంటే 95శాతం దాకా ప్రలోభాలకు లొంగి ఓటు వేసేవారో, అసలు ఓటు వేయడానికి వెళ్లనివారో ఉన్నారు. వీరంతా రాష్ట్రం నాశనం అయిందనీ, దేశం నాశనం అయిందనీ ఆవేదన చెందుతుంటారు. మంచి పాలకుల్ని ఎన్నుకొని మంచి పరిపాలన సాధించాల్సిన ఓటరు... కులానికి, మతానికి, పార్టీకి, ధనానికి, మద్యానికి ప్రలోభపడి ఓటు వేస్తున్నాడు. కొం దరు అసలు ఓటే వేయరు. గ్రామీణ ప్రాంతాలలో వీరి సంఖ్య తక్కువే అయినా, పట్టణాలలో, నగరాలలో వీరి సంఖ్య ఎక్కువే. ప్రలోభాలకు లోబడి ఓట్లు వేసినందువల్ల, ఓట్లు వేయని వారి వల్ల, మంచి వారెవ్వరూ గెలవలేక పోతున్నారు. ఎన్నికలంటే డబ్బు, మద్యం, పంచే పండుగలు అయిపోయినాయి. ఒకప్పు డు మనదేశంలో చాలామంది స్వతంత్ర అభ్యర్థులు గెలిచేవారు. అప్పటి ఓటర్లు ప్రలోభాలకు లొంగకుండా ఓటేసేవారు. కానీ నేటి ఓటరులో స్వార్ధం పెరిగిపోయింది. నీకు ఓటేస్తే నాకేంటి అనే స్థాయికి వచ్చాడు. తన బిడ్డల అభివృద్ధిని, రాష్ర్ట, దేశ అభివృద్ధిని తాకట్టు పెట్టే స్థాయికి దిగజారిపోయాడు. అందువల్లనే మంచివారు పోటీ చేసినా గెలిచే పరిస్థితి లేకుండా పోయింది. మంచి వారికి ఓటేయండి అని కొన్ని సంస్థలు ప్రచారం చేస్తున్నా గెలవని వారికి ఓటేసి మా ఓటు వేస్టు చేసుకోమంటారా అని ఎదురు దాడికి దిగటం అలవాటైపోయింది. నిజానికి ప్రస్తుతం శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలోను కనీసం పాతిక–ముప్పైమంది కొన్ని చోట్ల ఇంకా ఎక్కువ మందే పోటీ చేస్తున్నారు. పోటీ చేస్తున్న వీరందరి గురించి ఎంత మంది ఆలోచిస్తున్నారు? రెండు, మూడు పార్టీల అభ్యర్థులను తప్ప మిగతా వారివైపు కన్నెత్తి చూసే పరిస్థితి లేదు. ఐదు సంవత్సరాలు తన నియోజకవర్గాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని ఒకరి చేతిలో పెట్టేప్పుడు, ఆ అభ్యర్థి గురించి ఆలోచించాల్సిన అవసరం ఓటరుకు లేదా? పోలింగ్ రోజు బయటకు వచ్చి ఓటేయని వారు, ప్రలోభాలకు లొంగి ఓటేసినవారు, రాష్ట్ర, దేశ పరిస్థితులు, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటానికి అనర్హులు. మనం ఓట్లు వేసి గెలిపించిన వారే సింహాసనంపై కూర్చున్నారని, మనలను పాలిస్తున్నారని మరువకూడదు. కనుక నేటి యువతరం ఆలోచించాలి. దేశ దిశ, దశ మార్చే ఆలోచనాయుతమైన యువత అధికంగా రాజకీయాలలోకి రావాలి. మనకెందుకులే అని కూర్చోకుండా భ్రష్టుపట్టిన రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన బాధ్యత స్వీకరించాలి. ప్రతి ఒక్కరు ఓటు విలువ తెలుసుకోవాలి. ప్రజాస్వామ్య, అభ్యుదయవాదులు ఓటు విలువను ప్రజలకు తెలియజెప్పడంలో కీలకపాత్ర పోషించాలి, ప్రతి ఒక్కరు ఓటు వేసేలా చూడాలి. మంచి సేవాతత్పరులైన అభ్యర్థులను ఎన్నికల్లో నిలబెట్టి వారినే గెలిపించుకోవాలి. అప్పుడే ప్రజాస్వామ్య పరిరక్షణ.

తాతా సేవకుమార్

(నేడు జాతీయ ఓటరు దినోత్సవం)


Updated Date - 2022-01-25T06:22:13+05:30 IST