ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు

ABN , First Publish Date - 2022-08-13T06:10:23+05:30 IST

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు
లిస్టు చూసి, ఓటు ఉందో లేదో పరిశీలిస్తున్న ఉమా

 వలంటీర్‌ వ్యవస్థను అడ్డుపెట్టుకుని పెద్ద సంఖ్యలో ఓట్లు తొలగించారు..

ఎవరి ఓటు వారే కాపాడుకోండి:  దేవినేని ఉమా 

గొల్లపూడి, ఆగస్టు 12: వలంటీర్‌ వ్యవస్థను అడ్డుపెట్టుకొని ఎలాగైనా రానున్న ఎన్నికల్లో గెలవాలనే దురుద్దేశంతో పెద్ద సంఖ్యలో ఓట్లు తొలగించిన జగన్‌ సర్కార్‌ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గొల్లపూడిలో శుక్రవారం తన పోలింగ్‌ బూత్‌లో పర్యటించి ఓటర్లను చైతన్య పరిచారు. సామాన్యుడు తన ఓటు హక్కును వినియోగించుకోనే పరిస్థితి లేకుండా వైసీపీ సర్కార్‌ చేసిందని ఆయన దుయ్యబట్టారు. విజయవాడ - హైదరాబాద్‌ జాతీయ రహదారి పక్కన అభినందన అపార్ట్‌మెంట్‌లో ఒక కుటుంబంలో ఒకే డోర్‌ నంబరులో 4 ఓట్లు ఉంటే వారు మూడు పోలింగ్‌బూత్‌లకు వెళ్లి ఓటేసే పరి స్థితులు కల్పించారన్నారు. ఓటర్‌ లిస్టులో మార్పులు, చేర్పులు, తొలగింపులపై ఓటర్లను చైతన్య పరిచేందుకు ఈకార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఓటు ఉందో తొలగించారో ఒక్కసారి పరిశీలన చేసుకోవాలని సూచించారు. ఎన్నికల కమిషన్‌ ఆఫ్‌ ఇండియా, ఎన్నికల కమిషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ ఇప్పటికైనా కళ్లు తెరిచి ఓటర్‌ లిస్టును ప్రక్షాళన చేయా లని ఉమా డిమాండ్‌ చేశారు. 

వైసీపీ నుంచి టీడీపీలోకి ..

జూపూడి(ఇబ్రహీంపట్నం): రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ పాలనకు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. జూపూడిలో వైసీపీకి చెందిన 20 కుటుంబాలు టీడీపీలో చేరాయి. ఉమా వారిని పసుపు కండువాలు వేసి ఆహ్వానించారు. వైసీపీ ప్రభుత్వం అరాచక పాలనతో ప్రజలకు విసుగు పుట్టించిందన్నారు. వైసీపీ ఎంపీ, మంత్రులు వికృత చేష్టలతో తెలుగు వారి ప్రతిష్టను మంటగలిపారని విమర్శించారు. ఎన్నికలు ఎపుడు వస్తాయా వైసీపీకి ఎపుడు బుద్ధి చెబుతామా అని ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. రామినేని రాజశేఖర్‌, అవుటి రాజేశ్వరరావు, ములుగు చారీ, సైకం సాంబశివరావు, రెంటపల్లి లక్ష్మణ, జంగా అర్జునరావు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-13T06:10:23+05:30 IST