కూతురి కోసం ప్రజాస్వామ్యం ఖూనీ

ABN , First Publish Date - 2020-05-23T07:41:27+05:30 IST

నిజామాబాద్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన కూతురు కవితను గెలిపించుకునేందుకు సీఎం కేసీఆర్‌ ప్రజాస్వామ్యాన్నే ఖూనీ చేస్తున్నారని ఎంపీ

కూతురి కోసం ప్రజాస్వామ్యం ఖూనీ

  • కరోనా కేసుల్లాగే నిజామాబాద్‌లో ఫిరాయింపులూ పెరిగాయి: రేవంత్‌
  • కూలీలపై పట్టింపు కరువు: జీవన్‌రెడ్డి
  • వ్యవసాయంపై నిర్బంధమా: సీతక్క

ఆంధ్రజ్యోతి నెట్‌వర్క్‌: నిజామాబాద్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన కూతురు కవితను గెలిపించుకునేందుకు సీఎం కేసీఆర్‌ ప్రజాస్వామ్యాన్నే ఖూనీ చేస్తున్నారని ఎంపీ రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. కరోనా కేసుల మాదిరిగానే నిజామాబాద్‌లో పార్టీ ఫిరాయింపులూ పెరుగుతున్నాయని, భయపెట్టి, ప్రలోభపెట్టి టీఆర్‌ఎస్‌ కండువాలు కప్పుతున్నారని ఆరోపించారు. నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన జరుగుతోందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి శుక్రవారం ఆయన ఫిర్యాదు చేశారు. ఉల్లంఘనకు పాల్పడుతున్న మాజీ ఎంపీ కవిత, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్‌, విప్‌ గోవర్ధన్‌ తదితరులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం రేవంత్‌ మీడియాతో మాట్లాడుతూ కరోనాతో చనిపోయిన కానిస్టేబుల్‌ దయాకర్‌ కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. విధి నిర్వహణలో చనిపోయిన ఆయనకు అధికార లాంఛనాలతో దహన సంస్కారాలు నిర్వహించాల్సింది పోయి.. అనాథలా దహనం చేశారన్నారు. మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ మాట్లాడుతూ ప్రధాని మోదీకి కుర్చీ.. సీఎం కేసీఆర్‌కు కూతురి రాజకీయ భవిష్యత్తు తప్ప వేరే ధ్యాస లేదన్నారు. చేతిలో డబ్బులు లేక, సొంత ఊళ్లకు వెళ్లలేక వలస కూలీలు ఇబ్బందులు పడుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పట్టింపు లేకుండా పోయిందని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుపేదలను ఆదుకునేందుకు తీసుకున్న చర్యలు శూన్యమని చెప్పారు. సీఎం కేసీఆర్‌ పంటల సాగుపై ఆంక్షలు విధించడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ఎన్నడూలేని విధంగా వ్యవసాయంపై నిర్బంధమేంటని ప్రశ్నించారు. మహబూబాబాద్‌లో ఆమె మాట్లాడుతూ ఫలానా కంపెనీ ధాన్యం విత్తనాలే తీసుకోవాలని చెబుతున్నారంటే.. వారితో ఒప్పందాలేమైనా కుదుర్చుకున్నారా? అని ప్రశ్నించారు. రైతుల వద్ద నుంచి ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయకుండా తప్పించుకోవడానికి, రైతుబంధును నిలిపివేయడానికి సీఎం కేసీఆర్‌ కుట్ర చేస్తున్నారని కిసాన్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేశ్‌రెడ్డి ఆరోపించారు.


నేడు టీపీసీసీ కోర్‌ కమిటీ సమావేశం

 పోతిరెడ్డిపాడు అంశంపైన ఏం చేయాలన్నదానిపై శనివారం గాంధీభవన్‌లో టీపీసీసీ కోర్‌ కమిటీ సమావేశం జరగనుంది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ ఆర్‌సీ ఖుంటియా నేతృత్వంలో జరిగే ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క, రేవంత్‌రెడ్డి, కుసుమ్‌కుమార్‌, పొన్నం ప్రభాకర్‌, వీహెచ్‌, పొన్నాల లక్ష్మయ్య, జానారెడ్డి, షబ్బీర్‌ అలీ, చిన్నారెడ్డి, మధుయాష్కీ గౌడ్‌, సంపత్‌కుమార్‌, వంశీచంద్‌రెడ్డి తదితరులు పాల్గొంటారు. పార్టీ ఎమ్మెల్యేలనూ సమావేశానికి ఆహ్వానించారు.

Updated Date - 2020-05-23T07:41:27+05:30 IST