ఉద్యమ పథం

ABN , First Publish Date - 2020-07-08T11:48:48+05:30 IST

పార్వతీపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలనే డిమాండ్‌ రోజురోజుకూ పెరుగుతోంది.

ఉద్యమ పథం

పార్వతీపురం జిల్లా కేంద్రంగా చేయాలని డిమాండ్‌

ఇప్పటికే ర్యాలీలు, ఆందోళనలు చేపట్టిన ప్రజలు

 అధికారులకు, ప్రజాప్రతినిధులకు వినతులు


 (పార్వతీపురం): పార్వతీపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలనే డిమాండ్‌ రోజురోజుకూ పెరుగుతోంది. పార్లమెంట్‌ నియోజకవర్గ పరిథిని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలిసిన నాటి నుంచి ఇక్కడ ఉద్యమం మొదలైంది. ఇటీవల ముఖ్యమంత్రి కూడా అదే మాట చెప్పడంతో పట్టణ వాసులతో పాటు గిరిజన సంఘాలు పార్వతీపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని కోరుతున్నాయి. వాస్తవానికి ఈ డిమాండ్‌ సుమారు 30 ఏళ్లుగా ఉంది. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ తెరపైకి రాకపోవడంతో జిల్లా కేంద్రం భావన కూడా ప్రజల్లో అంతర్గతంగా ఉండిపోయింది. మళ్లీ ఏడాది కిందట నుంచి కొత్త జిల్లాల ప్రతిపాదన అంశం నేతల నోట వినిపిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం అవుతోంది. కొత్త జిల్లా ఏర్పాటు చేస్తే అరకును జిల్లా కేంద్రంగా చేస్తారని, ఏజెన్సీ ప్రాంతం అంతా అందులోనే కలిపేస్తారని చెబుతున్నారు. దీనిని పార్వతీపురం వాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.


అరకు పార్లమెంటు కేంద్రంగా జిల్లా ఏర్పాటైతే ఈ ప్రాంత ప్రజలు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందంటున్నారు. ఏ సమస్య చెప్పుకుందామన్నా జిల్లా కేంద్రానికి వెళ్లడానికి రెండు రోజులు ప్రయాణించాలని అభిప్రాయపడుతున్నారు. పార్వతీపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ ఈ ప్రాంత ప్రజలు, ఉపాధ్యాయ సంఘాలు, సాహితీవేత్తలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, గిరిజన సంఘాలు, పోరాట సంఘాలతో పాటు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులు జిల్లా సాధనకు రోడ్డెక్కుతున్నారు. శాంతియుత వాతావరణంలో, కరోనా వైరస్‌కు సంబంధించి నిబంధనలు పాటిస్తూ పార్వతీపురంలో ఎప్పటికప్పుడు ఏదో ఒక రూపంలో ఉద్యమిస్తున్నారు. జిల్లా కేంద్రంగా పార్వతీపురాన్ని ప్రకటిస్తే పార్వతీపురం, పాలకొండ, సాలూరు, కురుపాం నియోజకవర్గాల ప్రజలకు ఎంతో ఉపయోగం ఉంటుందని చాటుతున్నారు.


ఇదే సమయంలో ఆర్థిక పరమైన భారం ప్రభుత్వంపై పడదంటున్నారు. ఐటీడీఏ, ఏఎస్పీ, రెవెన్యూ డివిజన్‌ కేంద్రాలతో పాటు 150 పడకల ఏరియా ఆసుపత్రి భవనాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని, పరిపాలన కోసం అవసరమైన భవనాలు, అధికార యంత్రాంగం ఉందని ఉదహరిస్తున్నారు. 

Updated Date - 2020-07-08T11:48:48+05:30 IST