Abn logo
Jul 31 2021 @ 01:33AM

చైనా వెన్నులో డెల్టా వణుకు

  • 16 ప్రావిన్సులు.. 26 నగరాలకు విస్తరణ.. 
  • 200కు పైగా కేసులు.. బీజింగ్‌లో రెండు!
  • కేసులతో అప్రమత్తమైన జిన్‌ పింగ్‌ సర్కారు
  • లాక్‌డౌన్‌ ఆంక్షల కట్టడిలో కోట్లాది మంది
  • అమెరికాలో 90 వేలు దాటిన రోజువారీ కేసులు
  • అందరూ టీకా వేయించుకోవాలని బైడెన్‌ విజ్ఞప్తి
  • ఇజ్రాయెల్‌లో 60 ఏళ్లు దాటినవారికి 3వ డోసు
  • టోక్యోలో నమోదవుతున్న కేసుల్లో సగం డెల్టావే
  • ఫిలిప్పీన్స్‌లో వచ్చేవారం నుంచి లాక్‌డౌన్‌! 


బీజింగ్‌, జూలై 30: కరోనా వైర్‌సను సమర్థంగా ఎదుర్కొన్నామని.. ఎక్కువ ప్రాణ నష్టం లేకుండా మళ్లీ సాధారణ స్థితికి చేరుకున్నామని ఘనంగా ప్రకటించుకున్న చైనా ఇప్పుడు డెల్టా దెబ్బకు మళ్లీ కఠిన లాక్‌డౌన్లు పెడుతోంది. రెండు డోసుల టీకా తీసుకున్నవారికి కూడా డెల్టా వేరియంట్‌ సోకుతుండడంతో మళ్లీ కిందటి సంవత్సరం లాగా నగరాలకు నగరాలనే కట్టడిప్రాంతాలుగా ప్రకటించి జనాన్ని ఇళ్లకు పరిమితం చేస్తోంది. ఈ లాక్‌డౌన్ల దెబ్బకు కోట్లాదిమంది చైనీయులు ఇళ్లల్లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి. రష్యా నుంచి చైనాలోని నాన్జింగ్‌ నగరానికి వెళ్లిన ఒక విమానం ద్వారా డెల్టా వేరియంట్‌ డ్రాగన్‌ దేశంలోకి అడుగుపెట్టింది. ఆ విమానాన్ని నాన్జింగ్‌ ఎయిర్‌పోర్టులో శుభ్రం చేసిన తొమ్మిది మంది పారిశుధ్య కార్మికులకు ఆ వేరియంట్‌ సోకింది. వారిలో కొందరికి లక్షణాలు కనపడడంతో పరీక్షలు చేయించారు. వారికి డెల్టా వేరియంట్‌ సోకినట్టు జూలై 20న తేలింది. వారి నుంచి వారి కుటుంబసభ్యులు, సన్నిహితులకు.. అలా అలా వేగంగా వ్యాప్తి చెందుతూ ఈ పదిరోజుల్లోనే చైనాలోని 16 ప్రావిన్సులకు, వాటిలోని కనీసం 26 నగరాలకు విస్తరించింది. ముఖ్యంగా.. డాలియన్‌ నగరానికి చెందిన నలుగురు వ్యక్తులు రష్యా నుంచి నాన్జింగ్‌కు విమానం వచ్చిన రోజు ఆ విమానాశ్రయంలో ఉన్నారు. 

అగ్రరాజ్యంలోనూ..

దేశ జనాభాలో 50 శాతం మందికి పైగా ప్రజలకు రెండు డోసుల టీకా వేసిన అమెరికా కూడా డెల్టా ఉధృతితో విలవిలలాడుతోంది. జూన్‌ 21న అమెరికాలో రోజువారీ కేసుల సంఖ్య దాదాపు 9 వేల దాకా ఉండగా.. గురువారం ఒక్కరోజే అక్కడ ఏకంగా 92 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో బైడెన్‌ సర్కారు వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని వేగవంతం చేయడంపై దృష్టిసారించింది. ప్రభుత్వ ఉద్యోగులంతా తాము రెండు డోసుల టీకా వేయించుకున్నట్టు ప్రకటించాలని, లేదా మాస్కులు ధరించి, పరీక్షలు చేయించుకోవాలని అధ్యక్షుడు బైడెన్‌ సూచించారు. ‘‘ప్రజలు చనిపోతున్నారు. ఇంకా చనిపోతారు కూడా. కానీ, మనం అలా ప్రాణాలు కోల్పోకూడదు. మీరు టీకా వేసుకోకపోతే.. మీకు మీరు సమస్యగా మారుతారు. మీకే కాదు.. మీ కుటుంబానికి, మీతోటి ఉద్యోగులకూ సమస్యగా మారుతారు.’’ అని బైడెన్‌ హెచ్చరించారు. అమెరికా సైనికులకు కూడా టీకా తప్పనిసరి చేయాల్సిందిగా పెంటగాన్‌ను కోరుతానన్నారు. అలాగే.. టీకా వేసుకోవడానికి నిరాకరించేవారికి 100 డాలర్ల ప్రోత్సాహకం ఇచ్చి, వారు టీకా వేయించుకునేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతానన్నారు. 


ఆయన ఈ ప్రకటన చేసిన అనంతరం.. అమెరికా సైన్యంతోపాటు, పెంటగాన్‌ సిబ్బంది కూడా మాస్కులు ధరించేలా అధికార వర్గాలు ఆదేశాలు జారీ చేశాయి. ఇక.. రెండు డోసుల టీకా తీసుకున్నవారు మాస్కులు ధరించనక్కర్లేదని గతంలో ప్రకటించిన అమెరికా సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ తాజాగా కొత్త మార్గదర్శకాలు ప్రకటించింది. రెండు డోసుల టీకా తీసుకున్నా మాస్కులు ధరించాల్సిందేనని అందులో స్పష్టం చేసింది. అటు.. దేశ జనాభాలో 55 శాతానికి పైగా ప్రజలకు ఇప్పటికే రెండు డోసుల టీకాలు వేసిన ఇజ్రాయెల్‌ కూడా డెల్టా దెబ్బకు ఆదివారం నుంచి బూస్టర్‌ డోసులు వేసేందుకు సిద్ధమైంది. కాకపోతే ప్రస్తుతానికి 60 ఏళ్లు దాటినవారికి మాత్రమే మూడో డోసు ఇస్తారు. మరోవైపు.. ఫిలిప్పీన్స్‌ కూడా డెల్టా వ్యాప్తి నేపథ్యంలో వచ్చేవారం నుంచి లాక్‌డౌన్‌ ఆంక్షలు విధించడానికి సిద్ధమైంది. ఈ మేరకు ఫిలిప్పీన్స్‌ సర్కారు శుక్రవారం ఒక ప్రకటన చేసింది. ఒలింపిక్స్‌ జరుగుతున్న టోక్యోలో నమోదవుతున్న కేసుల్లో సగానికి పైగా డెల్టా వేరియంట్‌వేనని తేలింది.