డెల్టా ప్లస్‌.. ఆందోళనకారకమే!

ABN , First Publish Date - 2021-06-23T09:44:32+05:30 IST

డెల్టా వేరియంట్‌లో ఉత్పరివర్తనాల వల్ల పుట్టిన డెల్టా ప్లస్‌ వేరియంట్‌ను కేంద్రం ప్రస్తుతానికి మనదేశంలో ‘వేరియంట్‌ ఆఫ్‌ కన్సర్న్‌ (ఆందోళనకారక వేరియంట్‌)గా ప్రకటించింది.

డెల్టా ప్లస్‌..   ఆందోళనకారకమే!

వేరియంట్‌ ఆఫ్‌ కన్సర్న్‌గా కేంద్రం ప్రకటన

నాలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న కేసులు

గత నెల బ్రిటన్‌లో 87ు ‘డెల్టా’ కేసులే

వేరియంట్‌ ఆఫ్‌ కన్సర్న్‌గా ప్రకటించిన కేంద్రం


న్యూఢిల్లీ, జూన్‌ 22: డెల్టా వేరియంట్‌లో ఉత్పరివర్తనాల వల్ల పుట్టిన డెల్టా ప్లస్‌ వేరియంట్‌ను కేంద్రం ప్రస్తుతానికి మనదేశంలో ‘వేరియంట్‌ ఆఫ్‌ కన్సర్న్‌ (ఆందోళనకారక వేరియంట్‌)గా ప్రకటించింది. జూన్‌ 15న.. నీతిఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ దీన్ని ‘వేరియంట్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌ (గమనించాల్సిన వేరియంట్‌)’గా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒక వేరియంట్‌ వల్ల మానవాళికి పెనుముప్పు అనుకుంటేనే దాన్ని ఆందోళనకారక వేరియంట్‌గా ప్రకటించాలని అప్పట్లో ఆయన పేర్కొన్నారు. కానీ.. వ్యాప్తివేగం ఎక్కువగా ఉండడం, ఊపిరితిత్తుల కణాలపై ఉండే గ్రాహకాలను బలంగా అతుక్కునే గుణం, మోనోక్లోనల్‌ యాంటీబాడీస్‌ చికిత్సకు స్పందన తక్కువగా ఉండడం వంటి లక్షణాలు ఈ వేరియంట్‌కు ఉన్నట్టు ఇన్సాకాగ్‌ (ఇండియన్‌ సార్స్‌-కొవ్‌-2 కన్సార్షియం ఆన్‌ జీనోమిక్స్‌) తెలిపిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.


ఈ వేరియంట్‌ ఏ మేరకు దేశంలో వ్యాపించిందో తెలుసుకోవడానికి వీలుగా.. కరోనా పాజిటివ్‌ నమూనాలను ఇన్సాకాగ్‌ ల్యాబ్‌లకు పంపాల్సిందిగా అన్ని రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది. దేశంలో ప్రస్తుతం నాలుగు రాష్ట్రాల్లో డెల్టా ప్లస్‌ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. అవి.. మద్యప్రదేశ్‌, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక. మధ్యప్రదేశ్‌లో తొలిసారి 64 ఏళ్ల మహిళలో ఈ వేరియంట్‌ను గుర్తించారు. ఆ తర్వాత  ఆ రాష్ట్రంలో మరో నాలుగు డెల్టా ప్లస్‌ కేసులు వచ్చాయి. మొత్తం ఐదుగురికి ఈ వేరియంట్‌ సోకగా.. నలుగురు తట్టుకుని నిలబడగలిగారు.


ఒకరు మాత్రం చనిపోయారని మధ్యప్రదేశ్‌ రాష్ట్ర ఆరోగ్య మంత్రి ప్రభురామ్‌ చౌదరి తెలిపారు. అలాగే.. డబుల్‌ మ్యుటెంట్‌, డెల్టా రకాలతో అలసిపోయిన మహారాష్ట్రలో ఇప్పటిదాకా 21 డెల్టా ప్లస్‌ కేసులు నమోదయ్యాయి. అలాగే.. కేరళలో మూడు (బాధితుల్లో ఒకరు నాలుగేళ్ల బాలుడు కావడం గమనార్హం), కర్ణాటకలో రెండు డెల్టా ప్లస్‌ కేసులు ఇప్పటిదాకా వెలుగుచూశాయి. వ్యాక్సిన్లు, గత ఇన్ఫెక్షన్ల వచ్చే రక్షణను డెల్టాప్లస్‌ అధిగమించగలదని ప్రముఖ వైరాలజిస్టు, ఇన్సాకాగ్‌ మాజీ సభ్యుడు ప్రొఫెసర్‌ షాహిద్‌ జమీల్‌ హెచ్చరిస్తున్నారు. కాగా, కరోనా వైరస్‌ డెల్టా వేరియంట్‌పై కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ టీకాలు ప్రభావవంతంగా పనిచేస్తాయని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ మంగళవారం వెల్లడించారు. 


ముంచుకొస్తున్న మూడోవేవ్‌: రాహుల్‌

కరోనా మూడో వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలంటూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ  కేంద్రాన్ని అప్రమత్తం చేశారు. ఈ మేరకు పార్టీ తరఫున మంగళవారం శ్వేతపత్రం విడుదల చేశారు. ‘కరోనాను ప్రధాని మోదీ ఎన్నడూ సీరియ్‌సగా తీసుకోలేదు. దీనికన్నా పశ్చిమబెంగాల్‌ ఎన్నికలపైనే దృష్టి సారించారు’ అని దుయ్యబట్టారు. శ్వేతపత్రంలో పేర్కొన్న 4 కీలక అంశాలు..

1) మొదటి, రెండో వేవ్‌లలో కేంద్రం ముందే మేల్కొని ఉంటే.. మరణాలను అడ్డుకొని ఉండేవారు.

2) ముంచుకొస్తున్న మూడోవేవ్‌ను ఎదుర్కొనేందుకు   మౌలిక వసతులు, ఆస్పత్రుల్లో బెడ్లు, మందులు, ఆక్సిజన్‌ సరఫరా. .అన్నింటినీ అందుబాటులో ఉంచాలి. 

3) రికార్డుస్థాయిలో 85 లక్షల టీకాల పంపినీ ప్రశంసనీయం. వైరస్‌ నుంచి విముక్తికి వందశాతం వ్యాక్సినేషన్‌  ఏకైక మార్గం. పజల్లో అపోహలను కూడా తొలగించాలి.  

4) పరిహారాన్ని ఉచితంగా భావించొద్దు. ప్రజల నుంచి పన్నుల కింద రూ.4 లక్షల కోట్లు సమకూరాయి. వీటితో కొవిడ్‌ పరిహార నిధిని ఏర్పాటు చేయొచ్చు. 


కరోనా కేసులు @3 కోట్లు!

దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3 కోట్లకు చేరింది.     ఫిబ్రవరి ఆఖరు నుంచి మొదలైన సెకండ్‌ వేవ్‌లోనే దాదాపు 2 కోట్ల మంది వైరస్‌ బారినపడ్డారు. మొత్తం 3.89 లక్షల మరణాల్లో రెండు లక్షల మందిపైగా ఈ వేవ్‌లోనే చనిపోయారు. సోమవారం 42,640 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. 91 రోజుల్లో ఇవే అత్యల్ప పాజిటివ్‌లు. అయితే, ఆదివారం 13.88 లక్షల పరీక్షలే నిర్వహించారు.  40వ రోజూ కేసులను మించి రికవరీలు ఉండటంతో యాక్టివ్‌ కేసులు 6.62 లక్షలకు పడిపోయాయి. గత 79 రోజుల్లో ఇవే కనిష్ఠం. సోమవారం 1,167 మంది మృతి చెందారు. 68 రోజుల్లో ఇవే తక్కువ మరణాలు. ప్రపంచంలో ఎక్కడా లేనంతగా ఒక్క రోజే 86.16 లక్షల మందికి టీకా పంపిణీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.   

ఇండోర్‌లో టీకాకు ఉచిత ఆఫర్లు

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ప్రజలు వ్యాక్సిన్‌కు ముందుకొచ్చేలా వ్యాపార వర్గాలు ఉచిత బస్‌ టిక్కెట్లు, లక్కీ డ్రా విజేతలకు ఫ్రిజ్‌ల బహుమతి ఆఫర్లు ఇచ్చాయి. ఈ జిల్లాలో సోమవారం రికార్డు స్థాయిలో 2 లక్షల టీకాలు వేశారు. 

Updated Date - 2021-06-23T09:44:32+05:30 IST