డెల్టాకు.. పులి‘చింత’ల

ABN , First Publish Date - 2021-08-08T05:30:00+05:30 IST

ఈ ఏడాది జూన్‌ నెలలో వర్షాలు కురవడం ఆలస్యమయ్యాయి. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం విద్యుత్‌ ఉత్పాదన కోసం శ్రీశైలం, నాగార్జునసాగర్‌, పులిచింతల ప్రాజెక్టుల జలాలను వినియోగించేసింది.

డెల్టాకు.. పులి‘చింత’ల
వేమూరు మండలంలో ఎండిపోతున్న వరి నారుమడి

ఖరీఫ్‌ సాగుకు నీటి కష్టాలు

40 టీఎంసీల నీరు సముద్రం పాలు

మళ్లీ వరద వస్తేనే పులిచింతల నిండేది

నిర్లక్షం, నిర్వహణ లోపంతో రైతన్నకు శాపం

ఇక డెల్టా రైతులకు పట్టిసీమే నీరే దిక్కు


కృష్ణానది ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో ప్రాజెక్టుల్లో నిండు కుండల్లా మారాయి. దీంతో ఖరీఫ్‌ సాగునీటికి దిగులు ఉండదని రైతులు భావించారు. అయితే పులిచింతల ప్రాజెక్టు 16వ నెంబరు గేటు కొట్టుకుపోవడంతో ప్రస్తుతం జలాయశం ఖాళీ అయింది. ప్రకృతి ప్రసాదించిన జీవజలం కడలి పాలైపోయింది. ఆ నీటి పైనే ఆశలు పెట్టుకుని వేసిన పంటల పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. ఒకవేళ ఈ ఏడాది మరో దఫా కృష్ణానదికి వరద రాని పక్షంలో ప్రస్తుత ఖరీఫ్‌తో పాటు రబీ సీజన్‌లో తీవ్ర సాగునీటి ఎద్దడిని డెల్టా రైతులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మళ్లీ ప్రకృతి దయతలిస్తే తప్ప పులిచింతలకు నీరు రాదు. అప్పటివరకు డెల్టా ప్రాంతానికి చెందిన అన్నదాతల ఆశలన్నీ పట్టిసీమ ప్రాజెక్టుపైనే.


గుంటూరు, తెనాలి, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది జూన్‌ నెలలో వర్షాలు కురవడం ఆలస్యమయ్యాయి. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం విద్యుత్‌ ఉత్పాదన కోసం శ్రీశైలం, నాగార్జునసాగర్‌, పులిచింతల ప్రాజెక్టుల జలాలను వినియోగించేసింది.  పులిచింతల నుంచి 25 టీఎంసీలకు పైగా నికర జలాలు వృథా అయ్యాయి. గత పది రోజుల నుంచి మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తోన్న వర్షాలు కారణంగా వరద పోటెత్తడంతో అన్ని జలాశయాలు పూర్తిస్థాయిలో నిండటమే కాకుండా మిగులు జలాలను సముద్రంలోకి వదలాల్సి వచ్చింది. దీంతో ఇక ఈ ఏడాది సాగు, తాగునీటి అవసరాలకు చింత లేదన్న భావనలో అంతా ఉన్న తరుణంలో పులిచింతల డ్యాం 16వ నెంబరు గేటు కొట్టుకుపోవడంతో 40 టీఎంసీలకు పైగా నీరు వృథాగా సముద్రంలోకి వదలాల్సి వచ్చింది. ఏటా పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా ఆగస్టు చివరి వారం/సెప్టెంబరులో నీటి పంపింగ్‌ నిలిచిపోతుంది. నాగార్జున సాగర్‌లో ఉన్న నీరు కుడి, ఎడమ కాలువల కింద ఆయకట్టుకే సరిపోతుంది. దాంతో అప్పటి నుంచి పూర్తిగా పులిచింతల డ్యాంలో నిల్వ ఉన్న వరదనీటి పైనే డెల్టా రైతులు ఆధారపడతారు. అలానే గుంటూరు, కృష్ణ, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాలకు తాగునీరు కూడా దీని పైనే ఆధారం. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఎలాంటి పరిస్థితులు ఎదురౌతాయోనన్న సందిగ్ధం నెలకొన్నది. పులిచింతలలో ఉన్న నీటిని గేటు మరమ్మతుల కోసం సముద్రంలోకి వదిలేస్తే, ఎగువ జలాశయాల నుంచి వస్తున్న నీరు కూడా అంతంతమాత్రంగా ఉంది. దీంతో భవిష్యత్‌పై రైతుల్లో భయం మొదలైంది. ఇప్పటికే ప్రకాశం బ్యారేజికి దగ్గర్లో ఉన్న తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని వరి చేలు నీరు లేక ఎండిపోతున్నాయి. ఒకప్పుడు శుద్ద దండుగ అన్న పట్టిసీమే ప్రస్తుతం దిక్కవుతోంది. దీని నుంచే 7,000 క్యూసెక్కుల నీటిని డెల్టాకు వదులుతున్నారు. అయితే చివరి భూముల రైతులకు మాత్రం సాగుకు దిగేందుకు ధైర్యం చాలని పరిస్థితి నెలకొంది.


ఇప్పటికే సాగు ప్రారంభం

కృష్ణా డెల్టాలో తూర్పు, పశ్చిమ డెల్టాల కింద సుమారు 18.5 లక్షలకుపైగా ఎకరాల్లో వరి సాగవుతుంది. ఈ ఖరీఫ్‌ సీజన్‌ జూన్‌ నుంచే మొదలవడంతో ప్రస్తుతం తూర్పు డెల్టాలో నాట్లు పడిపోతుంటే, పశ్చిమ డెల్టాలో మాత్రం వెద పద్ధతిలో భారీగా నాట్లు వేశారు. తూర్పు డెల్టాకు 90 టీఎంసీలు, పశ్చిమ డెల్టాకు 69 టీఎంసీల చొప్పున కావాలి. ప్రస్తుతం 2 నుంచి నాలుగు టీఎంసీలు మాత్రమే వాడుకున్నారు. అంటే ఇంకా 155 టీఎంసీల నీరు అవసరం అవుతుంది.  శ్రీశైలం, సాగర్‌ పూర్తి సామర్థ్యంతో నిండి ఉన్నా, ఎగువ నుంచి పెద్దగా వస్తున్న నీరేమీ లేదు. దీంతో పులిచింతల ఎప్పటికి నిండుతుందనేది ప్రశ్నగానే మిగిలింది. ఈ పరిస్థితుల్లో  పట్టిసీమ డెల్టాకు దిక్కవుతోంది. శనివారం నుంచి పట్టిసీమ ద్వారా నీటని డెల్టాకు మళ్లిస్తున్నారు. గోదావరి నది నుంచి మోటార్ల ద్వారా 7వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. అయితే సీపేజీ, ఇతర లీకేజీలు పోను ప్రకాశం బ్యారేజికి 5,500 నుంచి 6వేల క్యూసెక్కుల వరకు నీరు చేరుతుందని అంచనా వేస్తున్నారు. దీనిద్వారా ప్రకాశం బ్యారేజిలో నీటి మట్టాలను బేరీజు వేసుకుంటూ డెల్టా కాల్వలకు నీటిని విడుదల చెయ్యాల్సి ఉంది. దీనిలో భాగంగానే ఆదివారం నుంచి ప్రకాశం బ్యారేజి గేట్లన్నీ మూసివేసి నదిలోకి నీటి విడుదలను ఆపివేశారు. పట్టిసీమ నుంచి వచ్చిన నీటిని జాగ్రత్తగా తూర్పు, పశ్చిమ డెల్టాలకు అందిస్తామని కృష్ణా పశ్చిమ డెల్టా విభాగం ఈఈ వెంకటరత్నం వివరించారు. పులిచింతల నిండాక  ఎగువ నుంచి నీరు వస్తుందని ఆశిస్తున్నామని, అవి వస్తే, పులిచింతలతో పనిలేకుండా కృష్ణా జలాలనే సాగుకు అందించే ఏర్పాట్లు చేస్తామన్నారు.


కారణమేదైనా కర్షకులకే కష్టాలు

పులిచింతల గేటు కొట్టుకు పోవటానికి కారణం మీరంటే మీరంటూ ఒకరిపై ఒకరు చేసుకుంటున్న రాజకీయ విమర్శల్లో నిజమెంతో తెలియదు. నిర్లక్ష్యమా! నిజంగా నిర్వహణా లోపమా అని వేసుకునే ప్రశ్నలకు సమాధానమూ దొరకదు. నష్టం ఎవరి వల్లనైనా, కారణమెవరైనా... చివరకు బలవుతున్నది మాత్రం డెల్టా రైతు. ప్రస్తుత పరిస్థితుల్లో 2021-22 సంవత్సర ఖరీఫ్‌ గట్టెక్కుతుందా! లేదా అనేది పెద్ద ప్రశ్నగా మిగిలింది. డెల్టా కాల్వలకు నీటి విడుదల విషయంలో ముందుచూపులేమి, నీటిపారుదల శాఖలో అజమాయిషీ లోపం ఖరీఫ్‌ రైతన్నకు ఈ సంవత్సరం శాపంలా మారింది. సముద్రంలోకి నీటిని వృథాగా వదులుతూనే డెల్టా కాల్వలకు ఇవ్వాలన్న విషయాన్ని అధికారులు పట్టించుకోలేదు.   నీరు పుష్కలంగా ఉన్నా, ఆలస్యంగా డెల్టా కాల్వలకు వదిలితే, సరిగ్గా నీటి అవసరం పెరిగిన తరుణంలో నీరు లేకుండా పోయింది. 

Updated Date - 2021-08-08T05:30:00+05:30 IST