నెలలు నిండక ముందే ప్రసవం

ABN , First Publish Date - 2022-03-03T04:38:04+05:30 IST

డాక్టర్‌! నాకు ఎనిమిదో నెల. ఈ మధ్య స్కాన్‌ చేసినపుడు నెలలు నిండకముందే డెలివరీ అయ్యే అవకాశం ఉందని వైద్యులు చెప్పారు.

నెలలు నిండక ముందే ప్రసవం

డాక్టర్‌! నాకు ఎనిమిదో నెల. ఈ మధ్య స్కాన్‌ చేసినపుడు నెలలు నిండకముందే డెలివరీ అయ్యే అవకాశం ఉందని వైద్యులు చెప్పారు. ఎనిమిదో నెలలో బిడ్డ పుడితే సమస్య ఉంటుందా? బిడ్డ ప్రాణాలకు ప్రమాదమా? భవిష్యత్‌లో ఎలాంటి ఆరోగ్యసమస్యలు రావొచ్చు?

ఎనిమిదో నెలలో డెలివరీ అయ్యే అవకాశం ఉన్నా, అందుకు కారణాలు తెలుసుకోవడం చాలా అవసరం. కొందరికి ప్రెగ్నెన్సీ సమయంలో బీపీ సమస్య వస్తుంది. రక్తపోటు పెరగడం వల్ల కొన్ని రకాల మందులు వాడినపుడు కూడా కాంప్లికేషన్స్‌ వచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల త్వరగా డెలివరీ చేయాల్సిన అవసరం రావచ్చు. మరికొంతమందికి ప్రెగ్నెన్సీలో షుగర్‌ సమస్యలు రావొచ్చు. లేదంటే ప్రెగ్నెన్సీకి ముందు ఉండే టైప్‌-2 డయాబెటిస్‌ కావొచ్చు. ఏ కారణం వల్లనైనా చక్కెర మోతాదు అదుపు తప్పితే, సమస్యలు తలెత్తవచ్చు. దీనివల్ల త్వరగా డెలివరీ చేయాల్సిన అవసరం రావొచ్చు. స్కాన్‌లో బిడ్డ పెరుగుదల ఎలా ఉందనేది చాలా ముఖ్యం. సాధారణంగా ఎనిమిదో నెల అంటే 32 వారాల నుంచి 35 వారాల వరకు అనుకుంటాం. ఒక ఫుల్‌ టైమ్‌ ప్రెగ్నెన్సీ అంటే 40 వారాలు. 32 నుంచి 35 వారాల మధ్య బిడ్డ బరువు రెండున్నర కేజీల వరకూ ఉండే వీలుంది. ఒకవేళ బిడ్డ అంత బరువు లేకపోయినా, బిడ్డకు రక్తం అందకపోయినా, ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయడం కంటే ప్రసవం చేయడం ఉత్తమం అని వైద్యులు నిర్థారించుకుంటారు.


తొందరగా డెలివరీ చేయడం వల్ల..

సాధారణంగా 32 వారాల నుంచి 35 వారాల వరకు బిడ్డలో అన్ని అవయవాలు అభివృద్ధి అవుతాయి. కానీ ఊపిరితిత్తులు చివరగా వృద్ధి చెందుతాయి. అంటే ప్రసవ సమయానికి పూర్తిగా సిద్ధం కావు. ఊపిరితిత్తులను ప్రసవానికి సిద్ధం చేయడం కోసం వైద్యులు తల్లికి రెండు స్టెరాయిడ్స్‌ ఇన్‌జక్షన్లు ఇస్తారు. వీటిని 12 నుంచి 24 గంటల వ్యవధిలో ఇస్తే, బిడ్డ ఊపిరితిత్తులు డెలివరీకి త్వరగా వృద్ధి చెందుతాయి. ఇలా చేయడం వల్ల బిడ్డకు బ్రీతింగ్‌ సమస్య రిస్క్‌ తగ్గుతుంది. ఒకవేళ సమస్య తగ్గకపోయినా, వైద్యులు సహాయపడతారు. అరుదుగా ఇంక్యుబేషన్‌ కూడా అవసరం రావొచ్చు. పుట్టినప్పటి నుంచి కొన్ని వారాల వరకు ఇంక్యుబేషన్‌లో ఉంచవలసిరావచ్చు. నెలలు నిండకుండా పుట్టిన పిల్లలు పాలు తాగలేరు. వారి పెదవుల కండరాలు సహకరించవు. ఈ పిల్లలకు తల్లి నుంచి పాలు సేకరించి కొన్ని వారాల పాటు తాగించవలసి ఉంటుంది. బిడ్డ బలం పుంజుకున్న తర్వాత నేరుగా తల్లి దగ్గరే పాలు తాగించవచ్చు. 


ప్రసవం తర్వాత...

ప్రీటర్మ్‌ బేబీస్‌కి ఇన్‌ఫెక్షన్లు మరో రిస్క్‌. అందుకే కొన్ని వారాలపాటు ఎన్‌ఐసియులో ఉంచుతారు. ఆ సమయంలో బిడ్డకు ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూసుకుంటూ, ఇతర పరీక్షలన్నీ చేస్తారు. అంటే వాళ్ల మెదడు ఎదుగుదలతో పాటు బిడ్డ ఎదుగుదల, మిగిలిన అవయవాల ఎదుగుదలలను పరిశీలిస్తారు. బ్రీతింగ్‌ చెక్‌ చేస్తారు. అంతా బాగా ఉంటే బిడ్డను డిశ్‌చార్జ్‌ చేస్తారు. సాధారణంగా ఇలాంటి బిడ్డలకు ఇతర సమస్యలేమీ ఉండవు. కొన్ని నెలలు చిన్న చిన్న సమస్యలు తలెత్తవచ్చు.

                                                                                                 డాక్టర్‌ హిమబిందు

                                                                                    కన్సల్టెంట్‌ అబ్‌స్టెట్రీషియన్‌,

                                                                       గైనకాలజిస్ట్‌ అండ్‌ ల్యాప్రోస్కోపిక్‌ సర్జన్‌,

                                                        ఎమ్‌బిబిఎస్‌, ఎమ్‌ఆర్‌సీఓజీ(యుకె), సిసిటీ(యుకె),

                                                               బర్త్‌ రైట్‌ బై రైన్‌బో, కొండాపూర్‌, హైదరాబాద్‌. 

Read more