నో పరేషాన్‌...

ABN , First Publish Date - 2020-03-29T10:49:42+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్‌ నెల కోటాను పాత కార్డుదారులందరికీ అందించాలని నిర్ణయించింది. కొత్తగా బియ్యం కార్డులు

నో పరేషాన్‌...

నేటి నుంచి రేషన్‌ దుకాణాల్లో ఉచితంగా బియ్యం, కందిపప్పు పంపిణీ 

పాతకార్డు దారులందరికీ రేషన్‌

పంచదారకు నగదు చెల్లించాల్సిందే

సిబ్బంది ద్వారా బయోమెట్రిక్‌

నేటి నుంచి ఏప్రిల్‌ 15 వరకు సరుకులు పంపిణీ

ఫిర్యాదుల స్వీకరణకు కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు

చౌక డిపోల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు

జిల్లాలో 12,59,925 రేషన్‌ కార్డులు


ఏలూరుసిటీ, మార్చి 28: రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్‌ నెల కోటాను పాత కార్డుదారులందరికీ అందించాలని నిర్ణయించింది. కొత్తగా బియ్యం కార్డులు పంపిణీ చేసినా అవి పూర్తి స్థాయిలో పంపిణీ జరగక పోవడం, కరోనా వైరస్‌ విజృంభణ, లాక్‌డౌన్‌ల నేపథ్యంలో ముందుగానే చౌకడిపోల ద్వారా రేషన్‌ సరుకులను అందించాలని నిర్ణయించింది. అందుకే జిల్లాలో గతంలో ఉన్న రేషన్‌ కార్డుదారులందరికీ బియ్యం, కందిపప్పు ఉచితంగాను, పంచదార మాత్రం నగదు తీసుకుని పంపిణీ చేయాలని  నిర్ణయించారు.


ఈ మేరకు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 29వ తేదీ నుంచి ఏప్రిల్‌ 15వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వ రేషన్‌ సరుకులు అందించి ఏప్రిల్‌ 15 తరువాత ప్రధాని మోదీ ప్రకటించిన ఉచిత నిత్యావసర సరుకులు అందిస్తారు. కరోనా వైరస్‌ కారణంగా జిల్లాలోని 2220 చౌకడిపోల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చౌడిపోల వద్ద గుంపులు, గుంపులుగా జనం ఉండకుండా కేవలం 5నుంచి 10 మంది మాత్రమే చౌకడిపోలకు వచ్చేలా వలంటీర్ల ద్వారా కార్డు దారులకు అవగాహన కల్పిస్తారు. అలాగే చౌడిపోల వద్ద వ్యక్తికి వ్యక్తికి మధ్య  రెండు మీటర్లు కనీస దూరం ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. వీఆర్‌వో, వీఆర్‌ఏ, గ్రామ సచివాలయ సిబ్బందిలో ఎవరో ఒకరి బయోమెట్రిక్‌ ద్వారా కార్డుదారులకు ఈ రేషన్‌ సరుకులు అందించటానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 


యథాతథంగా పంపిణీ

జిల్లాలో మొత్తం 12లక్షల 59వేల 925 రేషన్‌ కార్డులున్నాయి. వీటిలో తెల్ల కార్డులు 11,59,261, అన్నపూర్ణ కార్డులు 1010, అంత్యోదయ కార్డులు 69,654 ఉన్నాయి. అన్నపూర్ణ కార్డులకు 10కేజీలు, అంత్యోదయ కార్డులకు 35కేజీలు బియ్యాన్ని పంపిణీ చేస్తారు. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 


చౌడిపోల వద్ద ఏర్పాట్లు ఇలా..

కొవిడ్‌-19 నియంత్రణలో భాగంగా చౌడిపోల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి చౌకడిపో దుకాణం ఆవరణలో కార్డుదారులు నిలబడడానికి వ్యక్తికి వ్యక్తికి మధ్య రెండు మీటర్లు కనీస దూరం పాటించేలా మార్కింగ్‌ చేస్తున్నారు. ఆ మార్కింగ్‌లో కార్డుదారుడు నిలబడే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి స్లాట్‌కు 5నుంచి 10 మంది మాత్రమే కార్డు దారులు చౌకడిపో వద్ద ఉంటేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి కార్డుదారులను ఆ విధంగా తీసుకురావటానికి వలంటీర్లుకు బాధ్యతలు అప్పగించారు. ప్రతీ చౌకడిపో దుకాణం వద్ద ఒక బక్కెట్‌, నీళ్ళు, సబ్బు/ శానిటైజర్‌ ఉంచాలి.


వీఆర్‌వో లేదా ఇతర సిబ్బంది బయోమెట్రిక్‌తో సరుకులు ఇస్తారు. కేవలం కార్డుదారుడు మార్కింగ్‌ చేసిన ప్రదేశంలో ఉండి కార్డు నెంబరు తెలియజేస్తారు. ఆ కార్డుకు సంబంధించి బయోమెట్రిక్‌ వేసిన అనంతరం కార్డుదారులు తెచ్చుకున్న సంచిలో తూకం వేసిన సరుకులను ఇస్తారు. చౌకడిపోలో కూడా డీలర్‌తో పాటు తూకం తూసే వ్యక్తి, బయోమెట్రిక్‌ వేయటానికి వీఆర్‌వో/వీఆర్‌ఏ/ గ్రామ సచివాలయ సిబ్బంది కలిపి మొత్తం ముగ్గురు మాత్రమే ఉంటారు. 


కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు

చౌకడిపోల ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీకి సంబంధించి ఎటువంటి సమస్యలు అయినా తెలియజేయడానికి ప్రత్యేకంగా కంట్రోలు రూంలను ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయిలో డీఎస్‌వో కార్యాలయం, ఏలూరులో కంట్రోలు రూం ఏర్పాటు చేశారు. 6303318127, 6303300743 ఫోన్‌ నెంబర్లను ఆ కంట్రోలు రూంలో సంప్రదించవచ్చు. అలాగే మండల స్థాయిలో కూడా తహసీల్దార్‌ కార్యాలయంలో కంట్రోలు రూంలను ఏర్పాటు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించటానికి ఏర్పాట్లు చేస్తున్నారు.


చౌకడిపోల వద్ద ఏర్పాట్లు పూర్తి 

 కొవిడ్‌-19 నియంత్రణలో భాగంగా ఏప్రిల్‌ నెల నిత్యావసర సరుకుల కోటాను ముందుగానే పంపిణీ చేయటానికి ఏర్పాట్లు పూర్తి చేశాం. కొవిడ్‌-19 నివారణలో భాగంగా చౌకడిపోల వద్ద సరుకులు పంపిణీలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నాం. బయోమెట్రిక్‌ విధానంలో సరుకులు పంపిణీ చేస్తున్న దృష్ట్యా ఎప్పటికప్పుడు చేతులు క్లీనింగ్‌ చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

- ఎన్‌.సుబ్బరాజు, జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి

Updated Date - 2020-03-29T10:49:42+05:30 IST