కారడవిలో కాన్పు!

ABN , First Publish Date - 2020-02-21T10:17:37+05:30 IST

తమ గ్రామం నుంచి ఆస్పత్రికి వెళ్లేందుకు సరైన రోడ్డు మార్గం లేక కాన్పు కోసం కాలికనడకన బయల్దేరిన గర్భిణి.. మార్గమధ్యంలో అడవిలోనే బిడ్డకు జన్మనిచ్చింది. ఈ దయనీయ

కారడవిలో కాన్పు!

కాలినడకన ఆస్పత్రికి పయనం

మార్గమధ్యంలో అడవిలోనే ప్రసవం

అనంతగిరి, ఫిబ్రవరి 20: తమ గ్రామం నుంచి ఆస్పత్రికి వెళ్లేందుకు సరైన రోడ్డు మార్గం లేక కాన్పు కోసం కాలికనడకన బయల్దేరిన గర్భిణి.. మార్గమధ్యంలో అడవిలోనే బిడ్డకు జన్మనిచ్చింది. ఈ దయనీయ సంఘటన విశాఖ మన్యంలో గురువారం చోటుచేసుకుంది. విశాఖపట్నం జిల్లా అనంతగిరి మండలం గుమ్మకోట పంచాయతీ పరిధిలోని శంకుపర్తి గ్రామానికి చెందిన కోటపర్తి లక్ష్మి (23) నిండు గర్భిణి. ప్రసవ సమయం కావడంతో గురువారం ఆశ కార్యకర్త చంద్రమ్మ మరికొందరు స్థానికుల సహాయంతో ఆమెను కాలినడకన భీమవరం పీహెచ్‌సీకి  తీసుకువెళ్తోంది. కొండ ఎగువన ఉన్న శంకుపర్తి నుంచి భీమవరం రావాలంటే ఐదు కిలోమీటర్లు నడిచి గుమ్మకోట చేరుకుని.. అక్కడ నుంచి రెండు కిలోమీటర్లు వాహనంలో ప్రయాణించాలి.


ఇలాంటి పరిస్థితుల్లో లక్ష్మి అడవి మార్గం గుండా కాలినడకన బయల్దేరింది. అయితే దారిలో నొప్పులు ఎక్కువకావడంతో లక్ష్మి అడవిలోనే ఓ చెట్టు కింద ప్రసవించింది. ఆమె వెంట ఉన్న వారు వెంటనే ఆ తల్లీబిడ్డను అతికష్టం మీద గుమ్మకోట చేర్చి, అక్కడ నుంచి అంబులెన్స్‌లో భీమవరం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగానే ఉన్నారు. గతేడాది అక్టోబరులో గ్రామానికి చెందిన చంద్రమ్మ కూడా ఇదే తరహాలో మార్గమధ్యంలోనే ప్రసవించింది.

Updated Date - 2020-02-21T10:17:37+05:30 IST