గుండ్ల‘కమ్మని’ కబురు

ABN , First Publish Date - 2020-09-25T18:00:01+05:30 IST

గుండ్లకమ్మ ఆయకట్టు రైతులకు కమ్మని కబురు. ఈ సీజన్‌కు సాగు నీరు ఇవ్వాలని..

గుండ్ల‘కమ్మని’ కబురు

ఆయకట్టుకు సాగునీరు

నేడు విడుదల చేయనున్న మంత్రి బాలినేని

ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి నిల్వ 3.50 టీఎంసీలు


ఒంగోలు(ఆంధ్రజ్యోతి): గుండ్లకమ్మ ఆయకట్టు రైతులకు కమ్మని కబురు. ఈ సీజన్‌కు సాగు నీరు ఇవ్వాలని యంత్రాంగం నిర్ణయించింది. శుక్రవారం ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు రాష్ట్రమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి నీటిని విడుదల చేయనున్నారు. విస్తారంగా వర్షాలు కురుస్తుండటం, సాగర్‌ కాలువల్లో ప్రవాహంతో గుండ్లకమ్మ ప్రాజెక్టులోకి భారీగా నీరు చేరింది. ప్రాజెక్టు నీటి మట్టం 24.40 మీటర్లు, నీటి సామర్థ్యం 3.89 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి మట్టం 24.10 మీటర్లు, నీటి నిల్వ 3.50 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టు కింద ఖరీఫ్‌, రబీ రెండు సీజన్‌లలో కలిపి మొత్తం 80,060 ఎకరాల ఆయకట్టు ఉండగా భూవివాదాలు కారణంగా కొన్నిచోట్ల కాలువల తవ్వకాలు నిలిచిపోయాయి.


ప్రస్తుతం సుమారు 54వేల ఎకరాల ఆయకట్టుకు నీటిని అందించేందుకు అవకాశం ఉన్నట్లు ప్రాజెక్టు అధికారులు గుర్తించారు. ఆరుతడి పంటలకు సుమారు 4.10 టీఎంసీల నీరు అవసరంగా అంచనా వేశారు. మున్ముందు వర్షాలు కురిసే అవకాశం ఉండటం, సాగర్‌ కాలువలకు మార్చి ఆఖరు వరకూ నీటి సరఫరా ఖాయంగా కనిపిస్తుండటంతో గుండ్లకమ్మలోకి మరికొంత నీరు చేరే అవకాశం ఉందన్న అభిప్రాయంతో అధికారులు ఉన్నారు. ఈ సీజన్‌ సాగునీటి సరఫరాకు ఇబ్బంది ఉండదన్న భావనకు వచ్చిన అధికారులు స్థానిక ప్రజాప్రతినిధుల సూచనలతో ఆయకట్టుకు నీరివ్వాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్రమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి శుక్రవారం 9గంటలకు ప్రాజెక్టు వద్ద జలహారతి ఇచ్చి కుడి, ఎడమ కాలువలకు నీటిని విడుదల చేయనున్నారు.


ఇదిలా ఉండగా గుండ్లకమ్మ ప్రాజెక్టు దిగువ భాగాన నదీ పరివాహక ప్రాంతంలోని పలు గ్రామాల్లో ఎత్తిపోతల పథకాలు, రక్షిత తాగునీటి పథకాలు ఉన్నాయి. వాటికి కూడా నీరు అందుబాటులో ఉండేలా ప్రాజెక్టు గేట్ల నుంచి నీటిని దిగువకు ఇవ్వాలన్న డిమాండ్‌ ఆయా గ్రామాల ప్రజల నుంచి వస్తోంది. దీంతో ప్రాజెక్టులో 24 మీటర్ల నీటి మట్టాన్ని కొనసాగిస్తూ ఎగువ నీటి ప్రవాహం మేర దిగువకు విడుదల చేసే యోచనలో యంత్రాంగం ఉంది. 

Updated Date - 2020-09-25T18:00:01+05:30 IST