క్యాబ్ డ్రైవర్ చెంపలు వాయించి.. పిడిగుద్దులు కురిపించిన యువతి.. వైరల్ వీడియో

ABN , First Publish Date - 2021-11-19T02:23:43+05:30 IST

లక్నో యువతి ప్రియదర్శిని పేరు దేశ ప్రజలందరికీ గుర్తే. నడి రోడ్డుపై క్యాబ్ డ్రైవర్‌పై దాడిచేసి ఇష్టానుసారం కొడుతూ అడ్డొచ్చిన

క్యాబ్ డ్రైవర్ చెంపలు వాయించి.. పిడిగుద్దులు కురిపించిన యువతి.. వైరల్ వీడియో

న్యూఢిల్లీ: లక్నో యువతి ప్రియదర్శిని పేరు దేశ ప్రజలందరికీ గుర్తే. నడి రోడ్డుపై క్యాబ్ డ్రైవర్‌పై దాడిచేసి ఇష్టానుసారం కొడుతూ అడ్డొచ్చిన వారిపైనా చేయిచేసుకున్న ప్రియదర్శిని వీడియో అప్పట్లో వైరల్ అయింది. ఆమె తీరుపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి.


ఆమెను అరెస్ట్ చేయాలంటూ ట్విట్టర్‌లో పెద్ద ఉద్యమమే నడిచింది. ఆ తర్వాత క్యాబ్ డ్రైవర్‌కు ప్రియదర్శిని క్షమాపణలు చెప్పడం, ఇంటికెళ్లి రాఖీ కట్టడంతో ఆ వివాదానికి ఫుల్‌స్టాప్ పడింది. తాజాగా అలాంటి ఘటనే ఒకటి ఢిల్లీలో జరిగింది.


ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలను చుట్టేస్తోంది. క్యాబ్ డ్రైవర్‌ చొక్కా పట్టుకున్న యువతి అతడి చెప్పలు వాయిస్తూ పిడిగుద్దులు కురిపించింది. చుట్టూ చేరిన వారిలో ఒకరు ఈ మొత్తం తతంగాన్ని షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. 


 క్యాబ్ డ్రైవర్‌ను నడిరోడ్డుపై చితకబాదుతున్న యువతిని చూసి చుట్టూ చేరిన జనం డ్రైవర్‌ను రక్షించే ప్రయత్నం చేశారు. గొడవకు కారణాన్ని ఆరా తీసే ప్రయత్నం చేస్తే ఆమె వారిపైనా ఎదురుతిరిగింది. మరోవైపు, యువతి చావబాదుతున్నా డ్రైవర్ ఆమెను ప్రతిఘటించకపోవడం గమనార్హం. ఈ ఘటనను రికార్డు చేస్తున్న వ్యక్తిపైనా ఆ యువతి విరుచుకుపడింది. వెంటనే రికార్డింగ్ ఆఫ్ చేయాలని హెచ్చరించింది. 


డ్రైవర్‌పై విచక్షణ రహితంగా దాడిచేసిన ఆ యువతిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు ఈ ఘటనను సుమోటోగా తీసుకుని ఆమెపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమకేదైనా జరిగితే పోరాడే హక్కు చట్ట ప్రకారం అందరికీ ఉంటుందని, కానీ ఇలాంటి చర్యలు సరికాదని ఆగ్రహం వ్యక్తం  చేస్తున్నారు. ఇది చాలా విచారకరమని, అధికారులు స్పందించి చర్యలు తీసుకుంటారని భావిస్తున్నట్టు మరికొందరు కామెంట్ చేశారు. 



Updated Date - 2021-11-19T02:23:43+05:30 IST