రోడ్డు పక్కన ఓ మహిళ మృతదేహం.. 50 సీసీ కెమెరాలు చెక్ చేసి 7 నెలల తర్వాత పోలీసులు ఏం తేల్చారంటే..

ABN , First Publish Date - 2022-01-24T22:02:20+05:30 IST

రోడ్డు పక్కన రక్తపు మడుగులో పడి ఉన్న మహిళ మృతదేహం.. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించి దర్యాఫ్తు ప్రారంభించారు..

రోడ్డు పక్కన ఓ మహిళ మృతదేహం.. 50 సీసీ కెమెరాలు చెక్ చేసి 7 నెలల తర్వాత పోలీసులు ఏం తేల్చారంటే..

రోడ్డు పక్కన రక్తపు మడుగులో పడి ఉన్న మహిళ మృతదేహం.. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించి దర్యాఫ్తు ప్రారంభించారు.. చిన్న క్లూ కూడా దొరక్కపోవడంతో కేసును పరిష్కరించేందుకు కష్టాలు పడ్డారు.. ఏడు నెలలు శ్రమించి ఎట్టకేలకు అసలు నిందితుడిని పట్టుకున్నారు.. ప్రియుడి చేతిలోనే ఆ యువతి మరణించిందని పోలీసులు తేల్చారు.. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఈ ఘటన జరిగింది. 


ఘజియాబాద్‌కు సమీపంలోని మురాద్ నగర్ ప్రాంతంలో గతేడాది జూన్ 16న పర్వేజ్ మీర్జా అనే యువతి మృతదేహం రోడ్డు పక్కన లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించి దర్యాఫ్తు ప్రారంభించారు. ప్రారంభ దశలో పోలీసులకు చిన్న క్లూ కూడా దొరకలేదు. దీంతో ఘటనా స్థలానికి చుట్టూ ఉన్న ప్రాంతాల్లో గల 50 సీసీటీవీ కెమేరాలను పోలీసులు పరిశీలించారు. మీర్జాకు సంబంధించి 25 మందిని ప్రశ్నించారు. ఏడు నెలల పాటు శ్రమించారు.


ఆ సమయంలో మీర్జా ప్రియుడు ఖలీద్ అన్సారీ గురించి పోలీసులకు సమాచారం అందింది. వీరిద్దరూ ఐదేళ్ల పాటు ప్రేమించుకున్నట్టు తెలిసింది. దీంతో అన్సారీని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. మీర్జా, తాను తరచుగా కలిసి తిరిగేవారమని, గతేడాది జూన్ 16న ఇద్దరం స్కూటీ మీద వెళ్తుండగా పెళ్లి విషయమై వాదోపవాదాలు జరిగాయని చెప్పాడు. దాంతో రోడ్డు పక్కన స్కూటీ ఆపి తనపై మీర్జా చెయ్యి చేసుకుందని, పట్టరాని కోపంలో తానే మీర్జాను చంపేశానని అన్సారీ చెప్పాడు. దీంతో పోలీసులు అన్సారీని రిమాండ్‌కు తరలించారు.  

Updated Date - 2022-01-24T22:02:20+05:30 IST