ఢిల్లీ తరహా ‘కట్టడి’ చర్యలు

ABN , First Publish Date - 2020-08-11T09:33:04+05:30 IST

కరోనా కట్టడి ప్రాంతాల నిర్వహణ విషయంలో ఢిల్లీ తరహా చర్యలు తీసుకోవాలని రాష్ట్రానికి కేంద్ర బృందం సూచించింది. అక్కడ తీసుకుంటున్న చర్యలు, చేపడుతున్న

ఢిల్లీ తరహా ‘కట్టడి’ చర్యలు

కట్టడి ప్రాంతాల నిర్వహణపై రాష్ట్రానికి కేంద్ర బృందం సూచన

హైదరాబాద్‌, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): కరోనా కట్టడి ప్రాంతాల నిర్వహణ విషయంలో ఢిల్లీ తరహా చర్యలు తీసుకోవాలని రాష్ట్రానికి కేంద్ర బృందం సూచించింది. అక్కడ తీసుకుంటున్న చర్యలు, చేపడుతున్న కార్యక్రమాలపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చింది. నీతి ఆయోగ్‌ సభ్యుడు డా.వినోద్‌కుమార్‌ పాల్‌, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి ఆర్తి అహూజ, డాక్టర్‌ రవీంద్రన్‌లతో కూడిన బృందం రెండురోజుల పాటు(ఆది,సోమవారాలు) రాష్ట్రంలో పర్యటించింది. సోమవారం బీఆర్కే భవన్‌లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమే్‌షకుమార్‌, జీహెచ్‌ఎంసీ అధికారులు, హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో కేంద్ర బృందం సమావేశమైంది. ఈసందర్భంగా కొవిడ్‌ కట్టడి ప్రాంతాల్లో ఢిల్లీ ప్రభుత్వం చేపడుతున్న చర్యలను రాష్ట్రంలోనూ అమలు చేయాలని సూచించింది. హోం ఐసొలేషన్‌లో ఉంటున్న కొవిడ్‌ రోగుల కోసం ‘హితం’ యాప్‌ను ప్రవేశపెట్టి టెలీ మెడిసిన్‌ పద్ధతిన ఔషధాలను తెలంగాణ ప్రభుత్వం అందిస్తుండటాన్ని  కేంద్ర బృందం ప్రశంసించింది. ఇటువంటి స్ఫూర్తిదాయక వివరాలను ఇతర రాష్ట్రాలకు వివరిస్తామని డా.వి.కె.పాల్‌ తెలిపారు. రాష్ట్రంలో టెస్టింగ్‌ల సంఖ్యను పెంచారని, ఇది వైరస్‌ నియంత్రణకు అత్యంత కీలకమన్నారు. కరోనా నియంత్రణకు అనుసరించాల్సిన వ్యూహాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేయాలన్నారు. తెలంగాణలోని ఆస్పత్రుల సన్నద్ధత స్థాయి, వైరస్‌ కట్టడి చర్యలు, రోగులకు చికిత్స లాంటి అంశాలపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ ప్రజల ప్రాణ రక్షణ కోసం 24 గంటలు నిర్విరామంగా పనిచేస్తున్నామన్నారు. నిర్ధారణ పరీక్షలు, కొవిడ్‌ ట్రీట్‌మెంట్‌ ప్రొటోకాల్‌ల పట్ల కేంద్ర బృందం సంతృప్తి వ్యక్తం చేసిందన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వైరస్‌ కట్టడికి చర్యలు తీసుకోవాలని సూచించిదన్నారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ కేంద్ర బృందానికి వివరించారు. ఇటీవల సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశంలో ప్రతి రోజూ చేసే టెస్టుల సంఖ్యను 40 వేలకు పెంచాలని ఆదేశించారని, ఇందుకు అదనపు నిధులనూ కేటాయించారని గుర్తు చేశారు.

Updated Date - 2020-08-11T09:33:04+05:30 IST