coal కొరతతో 3 రాష్ట్రాల్లో విద్యుత్ సంక్షోభం

ABN , First Publish Date - 2022-04-29T17:30:31+05:30 IST

థర్మల్ పవర్ స్టేషన్లలో బొగ్గు కొరత కారణంగా భారతదేశంలోని పలు రాష్ట్రాలు విద్యుత్తు అంతరాయంతో కొట్టుమిట్టాడుతున్నాయి...

coal కొరతతో 3 రాష్ట్రాల్లో విద్యుత్ సంక్షోభం

మెట్రోరైళ్లు, ఆసుపత్రులపై ప్రభావం పడవచ్చని హెచ్చరిక

న్యూఢిల్లీ: థర్మల్ పవర్ స్టేషన్లలో బొగ్గు కొరత కారణంగా భారతదేశంలోని పలు రాష్ట్రాలు విద్యుత్తు అంతరాయంతో కొట్టుమిట్టాడుతున్నాయి.బొగ్గు కొరత సమస్యను ఎదుర్కొంటున్న ప్రధాన రాష్ట్రాలు ఢిల్లీ, పంజాబ్, ఉత్తరప్రదేశ్‌లలో ఆసుపత్రులు, మెట్రో రైళ్లలో అంతరాయాలు ఏర్పడే పరిస్థితులు నెలకొన్నాయి. ఢిల్లీలోని మెట్రో రైళ్లు, హాస్పిటల్స్‌కు విద్యుత్ సరఫరా చేయడంలో ఎదురుదెబ్బ తగులుతుందని ఢిల్లీ ప్రభుత్వం హెచ్చరించింది. పరిస్థితిని అంచనా వేయడానికి విద్యుత్ శాఖ మంత్రి సత్యేందర్ జైన్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. దేశ రాజధానికి విద్యుత్ సరఫరా చేసే పవర్ ప్లాంట్‌లకు తగినంత బొగ్గు లభ్యత ఉండేలా చూడాలని అభ్యర్థిస్తూ కేంద్రానికి మంత్రి లేఖ రాశారు.


‘‘దాద్రీ-2, ఉంచాహర్ పవర్ స్టేషన్ల నుంచి విద్యుత్ సరఫరా అంతరాయం కారణంగా ఢిల్లీ మెట్రో, ఢిల్లీ ప్రభుత్వ ఆసుపత్రులతో సహా అనేక ముఖ్యమైన సంస్థలకు 24 గంటల విద్యుత్ సరఫరాలో సమస్య ఉండవచ్చు’’ అని మంత్రి చెప్పారు.ప్రస్తుతం, ఢిల్లీలో విద్యుత్ డిమాండ్‌లో 30 శాతం ఈ పవర్ స్టేషన్ల ద్వారా తీరుతుందని, అవి బొగ్గు కొరతను ఎదుర్కొంటున్నాయని జైన్ చెప్పారు.ప్రభుత్వం పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోందని, రాజధానిలోని కొన్ని ప్రాంతాల్లో ప్రజలకు విద్యుత్ అంతరాయం కలగకుండా చూసేందుకు అన్ని విధాలా కృషి చేస్తోందని మంత్రి చెప్పారు.వ్యవసాయ రంగానికి సరిపడా విద్యుత్ సరఫరా చేయడం లేదని ఆరోపిస్తూ రైతు సంఘం కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ గురువారం అమృత్‌సర్‌లో విద్యుత్ శాఖ మంత్రి ఇంటి ముందు నిరసన తెలిపింది.


పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే విద్యుత్ డిమాండ్ 40 శాతం పెరిగిందని పంజాబ్ విద్యుత్ శాఖ మంత్రి హర్భజన్ సింగ్ తెలిపారు.థర్మల్ పవర్ స్టేషన్లలో బొగ్గు కొరత కారణంగా జనసాంద్రత కలిగిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం తీవ్రమవుతుంది. ప్రభుత్వ యాజమాన్యంలోని ఉత్తరప్రదేశ్ రాజ్య విద్యుత్ ఉత్పాదన్ నిగమ్‌లో బొగ్గు సంక్షోభం కొనసాగుతోంది.


Updated Date - 2022-04-29T17:30:31+05:30 IST