ఎర్ర కోట సందర్శనకు అనుమతి లేదు : ఢిల్లీ పోలీసులు

ABN , First Publish Date - 2022-01-20T02:17:02+05:30 IST

గణతంత్ర దినోత్సవాల సందర్భంగా భద్రతా కారణాల రీత్యా

ఎర్ర కోట సందర్శనకు అనుమతి లేదు : ఢిల్లీ పోలీసులు

న్యూఢిల్లీ : గణతంత్ర దినోత్సవాల సందర్భంగా భద్రతా కారణాల రీత్యా ఈ నెల 22 నుంచి 26 వరకు సందర్శకులను ఎర్ర కోటకు అనుమతించబోమని ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. ఈ ఉత్సవాల కోసం మూడు అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జాతీయ ప్రాధాన్యంగల కార్యక్రమాలు జరిగే సమయంలో ఉగ్రవాద చర్యలను నిరోధించేందుకు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉంటామని తెలిపింది. పోలీసులు బుధవారం ఓ ట్వీట్  ద్వారా ఈ వివరాలను వెల్లడించారు.


నేతాజీ సుభాశ్ చంద్రబోస్‌ జయంతి అయిన జనవరి 23 నుంచి గణతంత్ర దినోత్సవాలు ప్రారంభమవుతాయి. జనవరి 26 వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఈ సందర్భంగా ఢిల్లీ విమానాశ్రయంలో విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. ఛార్టర్ ఫ్లైట్స్, నాన్ షెడ్యూల్డ్ ఫ్లైట్స్‌పై ఆంక్షలు విధించినట్లు భారత విమానాశ్రయాల సంస్థ ప్రకటించింది. జనవరి 24 వరకు ఉదయం 10.15 గంటల నుంచి మధ్యాహ్నం 1.15 గంటల వరకు ఈ ఫ్లైట్స్‌  రాకపోకలకు అనుమతి లేదని తెలిపింది. జనవరి 26న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు ఈ ఫ్లైట్స్‌‌ రాకపోకలను అనుమతించబోమని తెలిపింది. జనవరి 29న బీటింగ్ రిట్రీట్ నిర్వహిస్తారు. కాబట్టి ఆ రోజు మధ్యాహ్నం 4 గంటల నుంచి 7 గంటల వరకు ఢిల్లీ విమానాశ్రయం నుంచి ఈ ఫ్లైట్స్‌ రాకపోకలను అనుమతించబోమని తెలిపింది. 


Updated Date - 2022-01-20T02:17:02+05:30 IST