26న ట్రాక్టర్‌ ర్యాలీకి ఓకే

ABN , First Publish Date - 2021-01-24T08:12:03+05:30 IST

రెండునెలలుగా ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులు గణతంత్ర దినోత్సవం రోజున ఢిల్లీ లో తలపెట్టిన ట్రాక్టర్‌ ర్యాలీకి పోలీసుల అనుమతి లభించింది...

26న ట్రాక్టర్‌ ర్యాలీకి ఓకే

  • పోలీసులు అనుమతిచ్చారని రైతు నేతల ప్రకటన
  • లక్ష ట్రాక్టర్లతో భారీ ప్రదర్శన.. 60 కిలోమీటర్ల మేర ర్యాలీ
  • ఇప్పటికే చేరుకున్న వేలాది ట్రాక్టర్లు.. రోడ్లపైనే నిలిపివేత
  • ర్యాలీకి అనుమతిపై నిర్ధారించని ఢిల్లీ పోలీసులు
  • వాయిదాకు సిద్ధమంటే చట్టాల్లో లోపాలున్నాయని కాదు
  • కేంద్ర వ్యవసాయ మంత్రి తోమర్‌ స్పష్టీకరణ

న్యూఢిల్లీ, జనవరి 23(ఆంధ్రజ్యోతి): రెండునెలలుగా ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులు గణతంత్ర దినోత్సవం రోజున ఢిల్లీ లో తలపెట్టిన ట్రాక్టర్‌ ర్యాలీకి పోలీసుల అనుమతి లభించింది. సుప్రీంకోర్టులోనూ, బయటా కేంద్రం దీన్ని వ్యతిరేకించినా చివరకు అంగీకరించిందని రైతు సంఘాల నేతలు చెప్పారు. అయితే, ర్యాలీకి అనుమతి ఇచ్చిన విషయాన్ని ఢిల్లీ పోలీసులు నిర్ధారించడం లేదు. రైతులకు, ప్రభుత్వానికి మధ్య శుక్రవారం జరిగిన 11వ రౌండు చర్చలు కూడా విఫలం కావడంతో రైతులు ఆందోళన ఉధృతికే నిర్ణయించుకున్నారు. దీంతో పంజాబ్‌, హరియాణ, యూపీ, రాజస్థాన్‌ల నుంచి దాదాపు 75,000 నుంచి లక్ష ట్రాక్టర్లు ఢిల్లీలో ప్రవేశిస్తాయి. సుమారు 60 కిలోమీటర్ల మేర ఇవి ర్యాలీగా వెళతాయి.. ఇందులో 47 కిలోమీటర్ల దూరం ఔటర్‌ రింగ్‌ రోడ్డే.. మిగతాది ఇన్నర్‌ రోడ్లని ప్రాథమిక సమాచారం. అవుటర్‌ రింగ్‌ రోడ్‌లో ట్రాక్టర్లు ప్రవేశిస్తే, మొత్తం ఢిల్లీ అష్ట దిగ్బంధనం జరిగినట్లవుతుంది.  ఇది పూర్తవడానికి 48 గంటలు పడుతుందని రైతులంటున్నారు. 


ఇప్పటికే వేలాది ట్రాక్టర్లు...

‘‘రైతులు ఏ మార్గంలో ట్రాక్టర్లతో పరేడ్‌ నిర్వహించాలన్న విషయంపై ఢిల్లీ పోలీసులతో జరిపిన చర్చల్లో ఒప్పందం కుదిరింది. శనివారం రాత్రి కల్లా రూట్‌ మ్యాప్‌ను ఖరారు చేస్తాం’’ అని స్వరాజ్‌ ఇండియా వ్యవస్థాపకుడు యోగేంద్ర యాదవ్‌ చెప్పారు. మరో వైపు ఉత్తర ప్రదేశ్‌ నుంచి కూడా పరేడ్‌ నిర్వహించేందుకు రైతులు సమాయత్తం అవుతున్నారు. పంజాబ్‌, హరియాణ, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ట్రాక్టర్లు ఇప్పటికే సరిహద్దులకు చేరుకున్నాయి. ఢిల్లీ పోలీసులు కూడా అడుగడుగునా వేలాది బారికేడ్లను అనేక చోట్ల ఏర్పాటు చేసి ఎటువంటి పరిస్థితినైనా అడ్డుకునేందుకు సిద్ధమవుతున్నారు. ట్రాక్టర్లు రాజధానిలోకి ప్రవేశించేందుకు వీలుగా బ్యారికేడ్లను తొలగిస్తామని పోలీసు అధికారులు చెప్పారు. ప్రశాంతంగానే ర్యాలీ నిర్వహిస్తామని, గణతంత్ర ఉత్సవానికి ఆటంకం కాబోదని రైతు నేతలు హామీ ఇచ్చారు.   


తోమర్‌ వీడియో

రైతు నేతలతో చర్చలు విఫలం కావడంతో వ్యవసాయ మంత్రి నరేంద్ర తోమర్‌ ఓ వీడియోను విడుదల చేశారు. ‘‘సాగు చట్టాలను ఏడాదిన్నర పాటు వాయిదా వేయడానికి అంగీకరించామంటే ఆ చట్టాల్లో లోపాలున్నాయని కాదు. రైతుల్లో కొన్ని అపోహలను తొలగించేందుకే చర్చలకు ఒప్పుకున్నాం. వారు ఆ చట్టాల రద్దు డిమాండ్‌కే కట్టుబడడం వల్ల చర్చలు సఫలం కాలేదు’’ అని పేర్కొన్నారు. కాగా, దళిత మహిళా కార్మికురాలు, ట్రేడ్‌ యూనియన్‌ కార్యకర్త నవదీప్‌ కౌర్‌ను వెంటనే విడుదల చేయాలని పౌరహక్కుల సంఘం డిమాండ్‌ చేసింది. 


యువకుడి అరెస్టు వెనుక..?

రైతుల ఉద్యమాన్ని భగ్నం చేసేందుకు వారిలో ప్రవేశించిన యోగేశ్‌ (21) అనే ఒక యువకుడిని రైతులు నిర్బంధించి పోలీసులకు అప్పజెప్పారు. జనవరి 26న ట్రాక్టర్ల పరేడ్‌ సమయంలో హింసను ప్రేరేపించి కల్లోలం సృష్టించేందుకు ఏర్పాటు చేసిన 10 మంది సభ్యుల బృందంలో ఈ యువకుడు ఒకరని రైతులు తెలిపారు. ట్రాక్టర్ల ర్యాలీని నిలిపివేసేందుకు పోలీసులు ప్రయత్నం చేసేటపుడు తాము మొదటి వరుస నుంచే కాల్పులు జరిపాలని పథకం వేశామని యోగేశ్‌ శుక్రవారం అర్థరాత్రి మీడియాకు చెప్పాడు. తమకు రాయ్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌హెచ్‌వో ప్రదీప్‌ సింగ్‌ శిక్షణనిచ్చాడని కూడా వెల్లడించాడు. అయితే ఆ పేరుగల అధికారి ఎవరూ లేరు. రైతులు ఆ తరువాత ఆ యువకుడిని సోనిపట్‌ పోలీసులకు అప్పగించారు. అయితే శనివారం మధ్యాహ్నానికల్లా కథ మారిపోయింది. ఓ వీడియో వైరల్‌ అయ్యింది. రైతు నేతలను హత్యచేయడానికి, విధ్వంసం సృష్టించడానికి తాను వచ్చినట్లు రైతులే చెప్పమన్నారని యోగేశ్‌ ఆ వీడియోలో చెప్పాడు. అసలా వీడియో ఎలా వచ్చింది, పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తితో ఉన్న వీడియో ఎలా వైరల్‌ అయింది, దీన్ని పోలీసులే తీశారా.. అన్నది నిర్ధారణ కావాలని రైతు నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.  


Updated Date - 2021-01-24T08:12:03+05:30 IST