వెయ్యి కోట్లకుపైగా మోసానికి పాల్పడి, మారువేషంలో తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని ఢిల్లీ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీకి చెందిన పీయూష్ తివారీ అనే వ్యక్తి 2011లో కన్స్ట్రక్షన్ కంపెనీ స్థాపించాడు. అప్పటినుంచి 8 కార్పొరేషన్లు, 20 వరకు దొంగ కంపెనీలు సృష్టించి అనేక మోసాలకు పాల్పడ్డాడు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో 2016లో అతడి ఇల్లు, కంపెనీలపై ఐటీ శాఖ దాడులు జరపగా 120 కోట్లు పట్టుబడ్డాయి. దీన్నుంచి ఎలాగోలా బయటపడ్డ పీయూష్ తర్వాత ఫ్లాట్లు, ప్లాట్లు అమ్మడం ప్రారంభించాడు. ఈ క్రమంలో రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ల పేరుతో పలువురి దగ్గరి నుంచి డబ్బులు వసూలు చేశాడు.
అపార్ట్మెంట్లు కేటాయించకుండా, మొత్తంగా వెయ్యి కోట్ల రూపాయలకు పైగా మోసానికి పాల్పడ్డాడు. ఈ మోసాలకు సంబంధించి అతడిపై 30కి పైగా కేసులు నమోదయ్యాయి. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ఎవరికీ చిక్కకుండా ఢిల్లీ నుంచి నాసిక్ పారిపోయాడు. నాసిక్ చేరుకున్న పీయూష్ తివారీ.. అక్కడ తన పేరును పునీత్ భరద్వాజ్‌గా మార్చుకున్నాడు. అంతేకాదు.. మారువేషంలో ఉంటూ ఉల్లిపాయల వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలో పీయూష్ గురించి వెతుకుతున్న ఢిల్లీ పోలీసులకు అతడు నాసిక్‌లో ఉన్నట్లుగా సమాచారం అందింది. పథకం ప్రకారం అక్కడికి చేరుకున్న పోలీసులు, చాకచక్యంగా వ్యవహరించి అతడిని పట్టుకున్నారు. ఈ మోసాల్లో భాగస్వామిగా ఉన్న పీయూష్ భార్య శిఖాను కూడా పోలీసులు అరెస్టు చేశారు.