Petrol and Diesel : ఢిల్లీ పెట్రోలు డీలర్స్ అసోసియేషన్ సంచలన నిర్ణయం

ABN , First Publish Date - 2022-05-31T22:01:23+05:30 IST

ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ (OMC)లు పెట్రోలు పంపుల

Petrol and Diesel : ఢిల్లీ పెట్రోలు డీలర్స్ అసోసియేషన్ సంచలన నిర్ణయం

న్యూఢిల్లీ : ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ (OMC)లు పెట్రోలు పంపుల కమిషన్‌ను పెంచనందుకు నిరసనగా మంగళవారం తాము పెట్రోలు, డీజిల్‌లను కొనబోమని ఢిల్లీ పెట్రోలు డీలర్స్ అసోసియేషన్ ప్రకటించింది. 24 రాష్ట్రాల్లోని పెట్రోలు డీలర్లు ఈ నిరసన కార్యక్రమంలో పాలుపంచుకుంటారని తెలిపింది. అయితే పెట్రోలు బంకుల వద్ద  తగినంత పెట్రోలు, డీజిల్ అందుబాటులో ఉన్నందువల్ల రిటెయిల్ సరఫరాకు ఎటువంటి అంతరాయం కలగబోదని పేర్కొంది. 


Delhi Petrol Dealers Association అధ్యక్షుడు అనురాగ్ జైన్ మాట్లాడుతూ, పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతున్నప్పటికీ, తమ కమిషన్లను సవరించడం లేదని, దీనికి నిరసనగా 24 రాష్ట్రాల్లోని తమ సభ్యులు మంగళవారం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల నుంచి పెట్రోలు, డీజిల్‌లను కొనబోమని చెప్పారు. పెట్రోలు బంకుల వద్ద సుమారు రెండు రోజులకు సరిపడినంత పెట్రోలు, డీజిల్ అందుబాటులో ఉంటుందని, అందువల్ల మంగళవారం యథావిధిగానే వీటి రిటెయిల్ అమ్మకాలు కొనసాగుతాయని చెప్పారు. 


ఈ సంఘం ప్రతినిధులు తెలిపిన వివరాల ప్రకారం, ప్రతి ఆరు నెలలకు ఒకసారి డీలర్ మార్జిన్స్‌ను సవరించవలసి ఉంటుంది. అయితే 2017 నుంచి ఓఎంసీలు ఈ సవరణ చేయలేదు. ఇంధనం ధరలు, నిర్వహణ వ్యయాలు పెరుగుతున్నప్పటికీ డీలర్ మార్జిన్స్‌ను పెంచడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఎక్సయిజ్ డ్యూటీని తగ్గించడం ద్వారా పెట్రోలు, డీజిల్‌ల ధరలను తగ్గించడం వల్ల భారం పెట్రోలు బంకులపై పడింది, పర్యవసానంగా మరిన్ని నష్టాలకు దారి తీస్తోంది. 


కేంద్ర ప్రభుత్వం మే 21న లీటరు పెట్రోలుపై రూ.8, లీటరు డీజిల్‌పై రూ.6 చొప్పున ఎక్సయిజ్ సుంకాన్ని తగ్గించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం వల్ల లీటరు పెట్రోలు ధర దాదాపు రూ.9.50 చొప్పున, లీటరు డీజిల్ ధర రూ. 7 చొప్పున తగ్గింది. ఈ తగ్గింపు వల్ల ప్రభుత్వానికి సంవత్సరానికి రూ.1 లక్ష కోట్ల మేరకు భారం పడుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ చెప్పారు.


Updated Date - 2022-05-31T22:01:23+05:30 IST