ఢిల్లీలో చాపకింద నీరులా ఒమైక్రాన్‌

ABN , First Publish Date - 2021-12-28T06:23:10+05:30 IST

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కొత్త వేరియంట్‌ ఒమైక్రాన్‌ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఈ కేసుల పట్టికలో ఆదివారం వరకు రెండో స్థానంలో ఉన్న హస్తిన....

ఢిల్లీలో చాపకింద నీరులా ఒమైక్రాన్‌

79 నుంచి 142కు జంప్‌

మొదలైన రాత్రి కర్ఫ్యూ.. 

ఎల్లో అలర్ట్‌కూ చాన్స్‌

6 నెలల గరిష్ఠానికి రోజువారీ కేసులు 

దేశంలో 578కి పెరిగిన ఒమైక్రాన్‌ కేసులు 


న్యూఢిల్లీ, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కొత్త వేరియంట్‌ ఒమైక్రాన్‌ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఈ కేసుల పట్టికలో ఆదివారం వరకు రెండో స్థానంలో ఉన్న హస్తిన.. సోమవారం ఉదయం సమయానికి మొదటి స్థానానికి చేరింది. ఒక రోజు ముందు అక్కడ 79 కేసులే ఉండగా, ఇప్పుడవి 142కు పెరిగాయి. వీరిలో 23 మంది కోలుకున్నారు. ఈనేపథ్యంలో సోమవారం నుంచి అక్కడ రాత్రి కర్ఫ్యూ మొదలైంది.  కొవిడ్‌ ఆంక్షలను ఇప్పటికే అమలు చేస్తున్నప్పటికీ వాటిని ప్రజలు పకడ్బందీగా పాటించడం లేదు. ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారి నుంచి ఢిల్లీలో గరిష్ఠంగా రూ.1.50 కోట్ల జరిమానా వసూలు చేశారు. ఇక ఢిల్లీలో నమోదవుతున్న రోజువారీ కరోనా కేసులు కూడా సోమవారం 6 నెలల గరిష్ఠానికి పెరిగాయి.


గత 24 గంటల్లో మొత్తం 331 కేసులు నమోదవగా, వీటిలో 142 ఒమైక్రాన్‌వే. దీంతో ఢిల్లీలో యాక్టివ్‌ కొవిడ్‌ కేసుల సంఖ్య 1,289కి పెరిగింది. వీరిలో 692 మంది హోం ఐసొలేషన్‌లో ఉన్నారు. దీంతో మరోసారి ఢిల్లీ పరిధిలో ఎల్లో అలర్ట్‌ను జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇదే జరిగితే.. మాల్స్‌, రెస్టారెంట్లు, దుకాణాలు, సినిమా హాళ్లు, స్పాలు, రవాణా సర్వీసులు, మెట్రో రైళ్లు, జిమ్‌ల కార్యకలాపాలపై మరోసారి ఆంక్షలు అమల్లోకి వస్తాయి. మరోవైపు, ముంబైలో 809 కొత్త కేసులు నమోదయ్యాయి. దేశంలో సోమవారం మరో 156 మందికి ఒమైక్రాన్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో మొత్తం ఒమైక్రాన్‌ కేసుల సంఖ్య 578కి పెరిగింది. అయితే వీరిలో 151 మంది ఇన్ఫెక్షన్‌ నుంచి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.


ఒమైక్రాన్‌ కేసుల్లో ఢిల్లీ తర్వాతి స్థానంలో మహారాష్ట్ర ఉంది. అక్కడ ఇప్పటివరకు 141 మందికి ఒమైక్రాన్‌ సోకగా, 42 మంది కోలుకున్నారు. కేరళలో 57 ఒమైక్రాన్‌ కేసులు ఉండగా ఒక్కరు రికవర్‌ అయ్యారు. . 49 కేసులతో గుజరాత్‌ నాలుగో స్థాన ంలో ఉండగా 10 మంది కోలుకున్నారు. రాజస్థాన్‌లో ఇప్పటివరకు 43 మందికి ఒమైక్రాన్‌ సోకగా 30 మంది రికవర్‌ అయ్యారు. 4వస్థానంలో తెలంగాణ ఉంది. ఇక గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6,531 మందికి కొవిడ్‌ సోకగా, 315 మంది కరోనాతో మృతిచెందారు. ఇప్పటివరకు వ్యాక్సినేషన్‌కు వినియోగించిన మొత్తం టీకా డోసుల సంఖ్య 141.70 కోట్లకు చేరింది. మహారాష్ట్రలోని పుణెలో ఓ ఇంజనీరింగ్‌ కళాశాలకు చెందిన 13 మంది విద్యార్థులకు కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయింది. 


సింగపూర్‌లో వ్యాక్సినేషన్‌ తప్పనిసరి

ఒమైక్రాన్‌ కలకలం నేపథ్యంలో సింగపూర్‌ కీలక నిర్ణయం తీసుకుంది. వర్క్‌ పాస్‌ల జారీకి, శాశ్వత నివాస అనుమతుల కోసం కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ను తప్పనిసరి చేసింది. 2022 ఫిబ్రవరి 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. ఆస్ట్రేలియాలో అత్యధిక జనాభా కలిగిన న్యూసౌత్‌ వేల్స్‌ రాష్ట్రంలో తొలి ఒమైక్రాన్‌ మరణం సంభవించింది. సోమవారం ఒక్కరోజే ఆ రాష్ట్రంలో 6000 కొత్త కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. అమెరికాలో సోమవారం కూడా దాదాపు 2 వేలకు పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి.


వ్యాక్సిన్‌ నాలుగో డోసుతో ట్రయల్స్‌  

ఒమైక్రాన్‌ వేరియంట్‌ను కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలు బూస్టర్‌ డోసుల వినియోగంపై దృష్టిసారించాయి. ఈక్రమంలో అన్ని దేశాల కంటే ఓ అడుగు ముందుకువేసిన ఇజ్రాయెల్‌.. కొవిడ్‌ టీకా నాలుగో డోసు ప్రభావశీలతను తెలుసుకునేందుకు ప్రయోగ పరీక్షలను ప్రారంభించింది. రాజధాని టెల్‌ అవివ్‌ శివారులోని షెబా మెడికల్‌ సెంటర్‌లో సోమవారం పలువురికి ఫైజర్‌ వ్యాక్సిన్‌ నాలుగో డోసును అందించారు. ఈ ట్రయల్స్‌లో భాగంగా మొత్తం 6వేల మందికి నాలుగో డోసును ఇవ్వనున్నారు. వలంటీర్ల జాబితాలో 150 మంది వైద్య సిబ్బంది కూడా ఉన్నారు. 60 ఏళ్లు పైబడినవారు, వైద్య సిబ్బంది, వైరస్‌ ముప్పు ఎక్కువగా ఉన్న వర్గాల ప్రజలకు నాలుగో డోసును అందించాలని ఇజ్రాయెల్‌ ఆరోగ్యశాఖ నిపుణుల బృందం ఇటీవల ప్రభుత్వానికి సిఫారసు చేసింది.


ఈ నేపథ్యంలోనే నాలుగో డోసుతో ప్రయోగ పరీక్షలను ప్రారంభించారు. నాలుగో డోసు తీసుకున్న వారిలో యాంటీబాడీల విడుదల ఎలా ఉంది? అవి ఎంతకాలం పాటు క్రియాశీలంగా ఉంటున్నాయి? వైర్‌సపై నాలుగో డోసు ఎంతమేర ప్రభావశీలతను చూపుతోంది? అనే అంశాలను తెలుసుకోవడమే లక్ష్యంగా ట్రయల్స్‌ను నిర్వహిస్తున్నారు. ఇజ్రాయెల్‌ జనాభాలో 63 శాతం మంది ఇప్పటికే రెండు డోసులు తీసుకున్నారు. 45 శాతం మంది మూడో డోసు వేయించుకున్నారు. 


జనవరి 31 వరకు ఆంక్షల పొడిగింపు

దేశంలో వరుస పండుగలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం అప్రమత్తమైంది. డిసెంబరు 21న కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ జారీ చేసిన మార్గదర్శకాలను తప్పనిసరిగా అమలు చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడాన్ని తప్పనిసరి చేసింది. రోడ్లపై ఉమ్మివేయడాన్ని నిషేధించింది. ఈ ఆంక్షలను 2022 జనవరి 31 వరకు పొడిగించింది. అమలు బాధ్యతను రాష్ట్రాలకే అప్పగించింది. సీరం నుంచి ఉత్పత్తి అయిన మరో కొవిడ్‌ వ్యాక్సిన్‌ కొవోవ్యాక్స్‌కు కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ సోమవారం అత్యవసర అనుమతులను జారీ చేసింది.

Updated Date - 2021-12-28T06:23:10+05:30 IST