ఢిల్లీ ప్రార్థనలకు వీరు కూడా.. ఎలాంటి ముప్పు ముంచుకొస్తుందో..!?

ABN , First Publish Date - 2020-04-02T13:19:21+05:30 IST

మార్చి 10 నుంచి 13 తేదీల మధ్య ఢిల్లీ వెళ్లి... మార్చి 16 నుంచి 18 మధ్య వారు నగరానికి తిరిగొచ్చారు...

ఢిల్లీ ప్రార్థనలకు వీరు కూడా.. ఎలాంటి ముప్పు ముంచుకొస్తుందో..!?

హైదరాబాద్‌ : ఢిల్లీ తబ్లీగీ జమాత్‌ సదస్సుకు కొంతమంది రోహింగ్యాలు కూడా హాజరు కావడంతో వారి శిబిరాల్లోన ఆందోళన ఏర్పడుతోంది. ఇప్పటి వరకు ఐదుగురు వెళ్లినట్లు గుర్తించిన అధికారులు వారిని క్వారంటైన్‌కు తరలించారు. మార్చి 10 నుంచి 13 తేదీల మధ్య ఢిల్లీ వెళ్లి... మార్చి 16 నుంచి 18 మధ్య వారు నగరానికి తిరిగొచ్చారు. వివరాలు సేకరించి వారిని తరలించినప్పటికీ.. రోహింగ్యాల కుటుంబీకులు,  వారి స్థావరాల పరిస్థితులపై అధికారులు దృష్టి సారించారు. సరైన పని, సంపాదన లేక  దారిద్య్రంలో ఉన్న రోహింగ్యాలకు కోవిడ్‌-19 కోలుకోలేని దెబ్బ తీసింది. వెళ్లిన వారికి కరోనా నిర్ధారణ పరీక్షల్లో వచ్చే ఫలితాలు వారి శిబిరాలను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశముంది. సరైన ఆవాసం లేక అక్కడక్కడ ప్రజలు ఇచ్చే దానధర్మాలపై ఆధారపడ్డ రోహింగ్యాలు మాత్రం తీవ్ర ఆవేదన చెందుతున్నారు. 


దాన ధర్మాలతోనే..

నగర శివారులోని బాలాపూర్‌, బాబానగర్‌, షాహీన్‌నగర్‌, కిషన్‌బాగ్‌ ప్రాంతాల్లో ఆవాసాలు ఏర్పాటు చేసుకుని సుమారు 10వేల మంది రోహింగ్యాలు జీవిస్తున్నారు. కరోనా ప్రభావం, లాక్‌డౌన్‌ అమల్లో లేని సమయాల్లో అక్కడక్కడా చిన్నా చితకా పనులు చేసుకోవడంతో పాటు వారి పేదరికానికి జాలి పడి ఇచ్చే దానాలతో  బతికేవారు. లాక్‌డౌన్‌తో  పేదలు ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి, దాతలు లేక పోవడం  రోహింగ్యాలకు ఇబ్బందిగా మారింది. అయినా ఎలాగోలా నెట్టుకొద్దామని భావిస్తున్న రోహింగ్యాలకు కరోనా సెగ తగలడంతో తల్లడిల్లి పోతున్నారు. 


ఎక్కడికి దారి తీస్తుందో..

ప్రస్తుతం ఐదుగురుని అనుమానితులుగా భావిస్తున్నప్పటికీ... వారిలో పరీక్షలు... ఆ తర్వాత పరిణామాలు ఊహించుకుని రోహింగ్యాలు ఆవేదన చెందుతున్నారు. పూట గడవడమే కష్టమైన తరుణంలో కొంతమంది జమాత్‌కు వెళ్లడం.. వారిని పరీక్షించి క్వారంటైన్‌ చేయడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాజిటివ్‌ వస్తే... గుడిసెల్లో నివసిస్తున్న తమ జీవితాల్లో ఎలాంటి ముప్పు ముంచుకొస్తుందోనని భయపడుతున్నారు. అనుమానితులను తీసుకెళ్లిన శిబిరాలు,ప్రాంతాలపై శానిటైజేషన్‌ చేసిన అధికారులు తదుపరి చర్యలకు సిద్ధమయ్యారు. భయపడుతున్న రోహింగ్యాలు భవిష్యత్‌ గురించి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2020-04-02T13:19:21+05:30 IST