రాజధానిలో కరోనాకు ఏడాది పూర్తి... నిర్లక్ష్యం వహించారో....

ABN , First Publish Date - 2021-03-01T16:28:58+05:30 IST

దేశరాజధాని ఢిల్లీలో తొలి కరోనా కేసు 2020, మార్చి 2న నమోదైంది.

రాజధానిలో కరోనాకు ఏడాది పూర్తి... నిర్లక్ష్యం వహించారో....

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో తొలి కరోనా కేసు 2020, మార్చి 2న నమోదైంది. ఏడాదిలో 6.39 లక్షల మందికి కరోనా సోకింది. వీరిలో 98 శాతం మంది కరోనాను జయించారు. అయితే మొత్తం 10,910 మందిని కరోనా పొట్టన పెట్టుకుంది. కాగా ఢిల్లీలో కరోనా మూడు వేవ్‌లు కనిపించాయి. గడచిన ఏడాదిలో కరోనా కారణంగా ఎన్నో ఒడిదుడుకులను చవిచూసిన ఢిల్లీ ఇప్పుడిప్పుడే గాడిన పడుతోంది. 


అయితే కొంతమంది నిర్లక్ష్యం కారణంగా ఇటీవలి కాలంలో కరోనా కేసులు తిరిగి పెరుగుతున్నాయి. ఇటలీ నుంచి ఢిల్లీకి వచ్చిన మయూర్ విహార్ నివాసి ఒకరు 2020, ఫిబ్రవరి 28న అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. మార్చి 2న అతనికి కరోనా ఉందని తేలింది. తొలి కరోనా కేసు నమోదుతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ తరువాత కరోనా కేసులు అంతకంతకూ పెరిగాయి. నవంబరు నాటికి రోజుకు ఆరు వేలకు మించిన కేసులు నమోదవుతూ వచ్చాయి. అలాగే రోజుకు 90కి పైగా కరోనా బాధితులు కన్నుమూశారు. ఇదే సమయంలో విధించిన లాక్‌డౌన్ ప్రజల జీవితాలను అతలాకుతలం చేసింది. అయితే ఇప్పుడు మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం తిరిగి కరోనా కట్టడి చర్యలు ప్రారంభించింది. 

Updated Date - 2021-03-01T16:28:58+05:30 IST