ఢిల్లీ ఎన్నికలు.. ఈసీ తాజా నిబంధనలు

ABN , First Publish Date - 2022-03-09T19:48:05+05:30 IST

వచ్చే ఏప్రిల్‌లో జరగనున్న ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలపై ఢిల్లీ రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టిసారించింది. ఎన్నికల ప్రచారానికి సంబంధించి రాజకీయ పార్టీలకు మంగళవారం కొత్త మార్గదర్శకాలు జారీచేసింది.

ఢిల్లీ ఎన్నికలు.. ఈసీ తాజా నిబంధనలు

వచ్చే ఏప్రిల్‌లో జరగనున్న ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలపై ఢిల్లీ రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టిసారించింది. ఎన్నికల ప్రచారానికి సంబంధించి రాజకీయ పార్టీలకు మంగళవారం కొత్త మార్గదర్శకాలు జారీచేసింది. కోవిడ్-19, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎమ్‌సీసీ) 2022 నిబంధనలను అనుసరించి ఈ సూచనలు చేసింది. గుర్తింపు కలిగిన రాజకీయ పార్టీలు పదిమంది మాత్రమే స్టార్ క్యాంపెయినర్‌లను, గుర్తింపులేని పార్టీలు ఐదుగురు స్టార్ క్యాంపెయినర్‌లను మాత్రమే ప్రచారానికి తీసుకోవాలని సూచించింది. ఈసీ తాజా నిబంధనల ప్రకారం రాత్రి ఎనిమిది గంటలలోపే ప్రచారం చేయాలి. రాత్రి ఎనిమిది నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు ఎలాంటి ప్రచారం నిర్వహించకూడదు. రోడ్ షోస్, బైక్ ర్యాలీలు, సైకిల్ ర్యాలీలు వంటివి అనుమతి లేకుండా చేయరాదు. వీధుల్లో జరిగే ప్రచారాలకు యాభై మందికి మించకుండా చూడాలి. డోర్-టు-డోర్ ప్రచారానికి ఐదుగురికి మించి వెళ్లకూడదు. అయితే, భద్రతా సిబ్బంది అదనంగా ఉండొచ్చు. రోడ్లతోపాటు జనాలు ఎక్కువగా ఉండే చోట ప్రచారం చేయకూడదు. సోషల్ మీడియా, డిజిటల్ మీడియా వంటి ప్రచార మార్గాలను ఎక్కువగా ఫాలో అవ్వాలని ఈసీ సూచించింది. అయితే, ఈ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు విడుదల చేయనున్నట్లు ఈసీ చెప్పింది.

Updated Date - 2022-03-09T19:48:05+05:30 IST