‘ఢిల్లీ సభ’కు వెళ్లొచ్చారా!?

ABN , First Publish Date - 2020-03-31T09:34:22+05:30 IST

రాష్ట్ర యంత్రాంగాన్ని ‘ఢిల్లీ కనెక్షన్‌’ కలవర పెడుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో బయటపడిన కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసుల్లో ఆరుగురికి ‘ఢిల్లీ ప్రయాణం’తో సంబంధముంది. కరోనా పాజిటివ్‌ వచ్చిన వారితోపాటు రైలులో

‘ఢిల్లీ సభ’కు వెళ్లొచ్చారా!?

  • ఏపీలో 6 పాజిటివ్‌ కేసులతో కనెక్షన్‌
  • దాదాపు ప్రతి జిల్లా నుంచి హాజరు


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌): రాష్ట్ర యంత్రాంగాన్ని ‘ఢిల్లీ కనెక్షన్‌’ కలవర పెడుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో బయటపడిన కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసుల్లో ఆరుగురికి  ‘ఢిల్లీ ప్రయాణం’తో సంబంధముంది.  కరోనా పాజిటివ్‌ వచ్చిన వారితోపాటు రైలులో ప్రయాణించిన వారు, వారి కుటుంబ సభ్యులను గుర్తించి క్వారంటైన్‌కు పంపించే ప్రక్రియ కొనసాగుతోంది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అధికారులు ‘ఢిల్లీ కనెక్షన్‌’పై ఆరా తీశారు. అనుమానితులను క్వారంటైన్‌కు తరలించారు. ఢిల్లీకి వెళ్లి వచ్చిన ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన వ్యక్తికి, ఆయన భార్యకూ కరోనా సోకినట్లు ఇప్పటికే నిర్ధారణ అయ్యింది. వీరికి తొలుత వైద్యం చేసిన చీరాలకు చెందిన ఐదుగురు డాక్టర్లను హోంక్వారంటైన్‌లో ఉండాలని అధికారులు కోరారు. వీరి నమూనాలను కూడా పరీక్షలకు పంపించారు. ఇక.. ప్రకాశం జిల్లా నుంచి ఢిల్లీ సదస్సుకు వెళ్లిన 74 మందిని అధికారులు గుర్తించారు. వీరందరినీ క్వారంటైన్‌కు తరలించారు. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఢిల్లీ సదస్సుకు 22 మంది వెళ్లినట్లు సమాచారం.  వీరిలో 13 మందిని ఐసొలేషన్‌కు పంపించారు. మరో 9 మందిని కూడా గుర్తించి ఇంటివద్దే నమూనాలు సేకరించారు. ఇక... ఈ సమావేశానికి నెల్లూరు నుంచి 70 మంది హాజరైనట్లు సమాచారం.  ప్రస్తుతం 25 మందిని నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిలోని కరోనా సెంటర్‌కు పంపించారు. మిగిలిన వారిని గుర్తించే పనిలో పడ్డారు. ఇక... కృష్ణా జిల్లా నుంచి దాదాపు 40 మంది ఢిల్లీకి వెళ్లారు. వీరందరినీ అధికారులు హోం క్వారంటైన్‌లో ఉంచారు.  కర్నూలు నుంచి పెద్ద సంఖ్యలో ఢిల్లీ సదస్సుకు వెళ్లి వచ్చారు. వీరిలో 123 మందిని వేర్వేరు చోట్ల ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రాలకు తరలించారు. మరో 66 మంది వివరాలు సేకరించి, వారి పరిస్థితిని గమనిస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లా నుంచి ఢిల్లీకి 13 మంది వెళ్లినట్లు తెలుస్తోంది. వారిలో 8 మందిని గుర్తించి శ్రీకాకుళం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లి, నమూనాలు సేకరించి పరీక్షలకు పంపించారు.  కడప జిల్లా నుంచి 49 మంది ఢిల్లీ సదస్సుకు హాజరయ్యారు. వీరిలో 47 మందిని  ఐసొలేషన్‌ వార్డులకు తరలించారు.  అదేవిధంగా విశాఖ నుంచి ఢిల్లీకి వెళ్లి వచ్చిన 30 మందిని అధికారులు గుర్తించి క్వారంటైన్‌కు పంపారు. అయితే, వీరంతా వచ్చి 14 రోజులు  దాటిందని, కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా సుమారు 200 మందికిపైగానే ఈ ఢిల్లీ వెళ్లినట్టు తెలిసింది. వీరిలో 50 మంది అనంతపురం జిల్లా కదిరిలో ప్రత్యేక సభ నిర్వహించారు. వీరిలో రాజమండ్రికి చెందిన వృద్ధుడికి పాజిటివ్‌ వచ్చింది. 

Updated Date - 2020-03-31T09:34:22+05:30 IST