‘మర్కజ్‌’ ఘటనతో భాగ్యనగరంలో వణుకు.. ఆ వంద మంది సంగతేంటో..!?

ABN , First Publish Date - 2020-04-02T13:38:28+05:30 IST

మర్కజ్‌లో జరిగిన మతపరమైన కార్యక్రమానికి వెళ్లి వచ్చిన వారితో నగరంలో కరోనా కల్లోలం మరింత పెరిగింది...

‘మర్కజ్‌’ ఘటనతో భాగ్యనగరంలో వణుకు.. ఆ వంద మంది సంగతేంటో..!?

  • మారకుంటే ముప్పే.. 
  • ‘మర్కజ్‌’ ఘటనతో నగరంలో వణుకు
  • ముమ్మరంగా ‘వడపోత’
  • గాంధీలో కరోనా బాధితుడి మృతి
  • వైద్యులపై దాడి చేసిన బంధువులు
  • జమాత్‌కు వెళ్లిన వారిలో రోహింగ్యాలు

మర్కజ్‌లో జరిగిన మతపరమైన కార్యక్రమానికి వెళ్లి వచ్చిన వారితో నగరంలో కరోనా కల్లోలం మరింత పెరిగింది. నిన్నామొన్నటి వరకు ముప్పుతప్పినట్లే అని భావించగా, అది మరింత పెరిగిందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఢిల్లీకి మొత్తం 603 మంది నగరం నుంచి వెళ్లి వచ్చారని అంచనా కాగా, ఇందులో ఇంకా వంద మంది ఎక్కడున్నారో ఆచూకీ తెలియడం లేదు. వారంతా ఎవరెవరిని కలిశారు. ఎక్కడెక్కడ తిరిగారో తెలుసుకోవడం పెద్ద సవాల్‌గా మారింది. ఇందులో కొందరు స్వచ్ఛందంగా క్వారంటైన్‌కు వెళ్లగా, మరికొందరు తప్పించుకు తిరుగుతున్నారు. మరోపక్క నగర పౌరుల్లో కొందరు లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘిస్తూనే ఉన్నారు. గాంధీలో జరిగిన ఘటనతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనపై పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.


ఢిల్లీలో మతప్రార్థనలకు వెళ్లొచ్చిన వారిలో నగరానికి చెందిన అనేకమందిని అధికారులు గుర్తించారు. కరోనా లక్షణాలు ఉన్నవారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అనుమానితులను ఐసోలేషన్‌, క్వారంటైన్‌ కేంద్రాలు, సరోజినీదేవి, యునానీ ఆస్పత్రులకు తరలించి వైద్య పరీక్షలు  చేయిస్తున్నారు. ప్రార్థనలకు వెళ్లొచ్చిన అనంతరం వారు ఎక్కడెక్కడ తిరిగారు, ఎవరెవరిని కలిశారో అధికారులు ఆరా తీస్తున్నారు. కొన్ని చోట్ల  ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారి కుటుంబ సభ్యులకు  వైద్య పరీక్షలు చేస్తున్నారు. ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారు స్వచ్ఛందంగా వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవాలని అధికారులు కోరుతున్నారు.


హైదరాబాద్/చాదర్‌ఘాట్‌ : ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన మతపరమైన ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారిపై అధికారులు ఆరా తీస్తున్నారు.  జీహెచ్‌ఎంసీ మలక్‌పేట సర్కిల్‌-6లో 45 మంది ఉన్నట్లుగా గుర్తించారు. వీరిలో అక్బర్‌బాగ్‌లోని సపోటాబాగ్‌ నివాసికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో అతడ్ని హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించారు. మాదన్నపేటలోని డీజే కాలనీకి చెందిన మరో వ్యక్తి కూడా ఢిల్లీకి వెళ్లి వచ్చిన తర్వాత కరోనా పాజిటివ్‌ అని తేలడంతో గాంధీకి తరలించినట్లు సమాచారం. నిజాముద్దీన్‌లో జరిగిన   మతపరమైన ప్రార్థనలకు  వెళ్లొచ్చిన 45 మందిలో 19 మంది హోం క్వారంటైన్‌లో ఉన్నట్లుగా గుర్తించిన అధికార యంత్రాంగం వారందరినీ తాజాగా చార్మినార్‌లోని యునానీ ఆస్పత్రికి తరలించారు. మరో 16 మందిని గాంధీకి తరలించి పరీక్షలు చేయిస్తున్నారు. ఒక వ్యక్తి తన ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసుకోవడంతో అతడ్ని గుర్తించలేకపోయారు. ఇందులోని నలుగురు వ్యక్తుల పేర్లు డబుల్‌గా నమోదైనట్లు తేల్చారు. ఇంకో ఐదుగురి చిరునామాలు తప్పుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 


సపోటాబాగ్‌లోని 5వందల ఇళ్ల కుటుంబీకులకు వైద్య పరీక్షలు...

అక్బర్‌బాగ్‌లోని సపోటాబాగ్‌ ప్రాంత నివాసికి కరోనా వైరస్‌ పాజిటివ్‌ ఉన్నట్లుగా బయటపడింది. దీంతో అతడిని హుటాహుటిన గాంఽధీ ఆసుపత్రికి తరలించారు. గడ్డిఅన్నారం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోకి వచ్చే సపోటాబాగ్‌ ప్రాంతంలోని 5వందల  కుటుంబీకులకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు 5 వైద్య బృందాలను రంగంలోకి దింపారు.


ముషీరాబాద్‌ నుంచి....

ఢిల్లీలోని నిజాముద్దీన్‌ మర్కజ్‌లో ఇటీవల జరిగిన మతప్రార్థనల్లో ముషీరాబాద్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో నుంచి వెళ్లిన 12 మందిని ముషీరాబాద్‌ పోలీసులు గుర్తించారు. ముషీరాబాద్‌ సీఐ మురళీకృష్ణ ఆధ్వర్యంలో పలు బృందాలు  రెండు రోజులుగా వారి జాబితాలో చిరునామా ప్రకారం ఆయా ప్రాంతాలకు వెళ్లి వారిని ఎట్టకేలకు బుధవారం తమ అధీనంలోకి తీసుకున్నారు. వీరిలో 10 మందిని ఎస్‌ఆర్‌నగర్‌లోని నేచర్‌ క్యూర్‌ ఐసోలేషన్‌ సెంటర్‌కు తరలించారు. మరో ఇద్దరు అనుమానితులను గాంధీ ఆసుపత్రిలో అడ్మిట్‌ చేయించారు. వీరు స్టేషన్‌ పరిధిలోని భోలక్‌పూర్‌, ముషీరాబాద్‌, మేడిబావి బస్తీలో నివాసం ఉండేవారని, వారందరినీ తమ అధీనంలోకి తీసుకున్నామని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందొద్దని సీఐ మురళీకృష్ణ తెలిపారు. 


పంజాగుట్ట పీఎస్‌ లిమిట్స్‌లో ...

ఢిల్లీ నిజాముద్దీన్‌లో మర్కజ్‌ ప్రార్థనలకు వెళ్లి వచ్చారన్న సమాచారంతో పంజాగుట్ట పీఎస్‌ పరిధిలో కలకలం రేగింది. వివిధ ప్రాంతాల్లో 8 మందిని  అదుపులోనికి తీసుకుని ఎర్రగడ్డలోని ఐసోలేషన్‌ సెంటర్‌కు తరలించారు. పంజాగుట్ట పీఎస్‌ పరిధిలోని ద్వారకాపురి కాలనీ, మార్కెట్‌ బస్తీలో ముగ్గురిని, బీఎస్‌ మక్తాలో ముగ్గురిని, నాగార్జున నగర్‌ కాలనీ, ప్రేమ్‌నగర్‌లలో ఒక్కొక్కరి చొప్పున మొత్తం 8 మందిని గుర్తించారు.వారు ఎక్కడెక్కడ తిరిగారు... ఎవరెవరిని కలిశారో పోలీసులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు ఆరా తీశారు. వెంటనే వారిని ఎర్రగడ్డలోని క్వారంటైన్‌ సెంటర్‌కు తరలించారు. వారికి వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నారు. మిగతా వారిని కూడా గుర్తించే పనిలో అధికారులు, సిబ్బంది నిమగ్నమయ్యారు. 


ఐదుగురు బర్మాదేశీయులు.. ముగ్గురు స్థానికులు..

ఢిల్లీలోని మర్కజ్‌లో ప్రార్థనలకు వెళ్లొచ్చిన ఎనిమిది మందిని క్వారంటైన్‌కు తరలించినట్లు జల్‌పల్లి మున్సిపల్‌ కమిషనర్‌ అహ్మద్‌ షఫీయుల్లా, బాలాపూర్‌ ఇన్‌స్పెక్టర్‌ భాస్కర్‌, వైద్య ఆరోగ్య విభాగం అధికారి గోవింద్‌రెడ్డి తెలిపారు. క్వారంటైన్‌కు తరలించినవారిలో ఐదుగురు బర్మా దేశీయులు, ముగ్గురు స్థానికులు ఉన్నారు. అంతేకాకుండా విదేశాలకు, ఢిల్లీలోని మర్కజ్‌ సమావేశాలకు వెళ్లొచ్చిన వారు  ఎవరైనా ఉంటే స్వచ్ఛందంగా వచ్చి తమ పేర్లు నమోదు చేయించుకోవాలన్నారు. వీరందరికీ పరీక్షలు నిర్వహించిన అనంతరం కరోనా పాజిటివ్‌ ఉందా, నెగిటివ్‌ ఉందా తేలుతుందని అధికారులు తెలిపారు. 


బహదూర్‌పురా మండలంలో...

బహదూర్‌పురా మండల పరిధిలోని వివిధ బస్తీలకు చెందిన 21 మంది ఢిల్లీలోని మర్కజ్‌లో సమావేశాలకు వెళ్లిచ్చినట్లు గుర్తించామని బహదూర్‌పురా మండల తహసీల్దార్‌ ఎస్‌.రాములు తెలిపారు. వారిని చార్మినార్‌ యునానీ ఆస్పత్రికి తరలించామని ఆయన తెలిపారు.


39 మందిని పరీక్షల నిమిత్తం గాంధీ, సరోజినీ ఆస్పత్రులకు తరలింపు 

ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన ప్రార్థనలకు హాజరై తిరిగి వచ్చి మసీదులో ఉంటున్న 39 మందిని హబీబ్‌నగర్‌ పోలీసులు పరీక్షల నిమిత్తం గాంధీ, సరోజినీ ఆసుపత్రులకు తరలించారు. గత నెల 13 నుంచి 15 తేదీల్లో ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన ప్రార్థనల్లో పాల్గొని తిరిగి నగరానికి వచ్చిన వారిలో కొంత మంది మల్లేపల్లి బడే మసీదులో ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు బుధవారం వైద్య అధికారుల సహకారంతోమసీదు వద్దకు చేరుకొని  కరోనా లక్షణాలు ఉన్న వారితో పాటు, ఢిల్లీ నుంచి తరిగి వచ్చిన వారిలో కలిసి ఉంటున్న వారికి పరీక్షలు నిర్వహించాలని మత పెద్దలకు వివరించారు. అనంతరం 37 మందిని అంబులెన్సుల్లో గాంధీ ఆసుపత్రికి తరలించారు. అదే విధంగామరో ఇద్దరిని మాత్రం సరోజినీ దేవి కంటి ఆసుపత్రిలోని ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు. ఢిల్లీకి వెళ్లి వాచ్చిన వారిని గుర్తించేందుకు హబీబ్‌నగర్‌, నాంపల్లి పోలీసులు నాంపల్లి నియోజకవర్గంలో జల్లడపడుతున్నారు. మంగళవారం 8 మందిని గుర్తించి క్వారంటైన్‌కు పంపిన అధికారులు బుధవారం మరో 39 మందిని గుర్తించి గాంధీ, సరోజినీ దేవి ఆసుపత్రులకు పంపించారు.


శేరిలింగంపల్లి జోన్‌ పరిధిలో..

శేరిలింగంపల్లి జోన్‌ పరిధిలోని ఢిల్లీ నిజాముద్దీన్‌ సమావేశానికిహాజరైన వారు మొత్తం 25మంది ఉన్నట్లు గుర్తించారు. వారిలో 15మందిని అమీర్‌పేటలోని నేచర్‌క్యూర్‌ ఆస్పత్రికి తరలించారు. మరో పదిమంది వివరాలు తెలియాలని అధికారులు తెలిపారు. శేరిలింగంపల్లి సర్కిల్‌ పరిధిలోని గోపీనగర్‌, గచ్చిబౌలికి చెందిన ఇద్దరు హాజరైనట్లు అధికారులు గుర్తించారు. వీరిని కూడా అధికారులు ఆస్పత్రికి తరలించారు. వీరి రక్తపరీక్షల రిపోర్టుల ఆధారంగా వీరి కుటుంబ సభ్యులను కూడా ఆస్పత్రికి తరలించనున్నట్లు అధికారులు తెలిపారు. అప్పటి వరకు స్వీయ నిర్బంధంలో ఉండాలని అధికారులు కుటుంబ సభ్యులకు సూచించారు.

Updated Date - 2020-04-02T13:38:28+05:30 IST