భార్యలు త్యాగధనులు : ఢిల్లీ హైకోర్టు

ABN , First Publish Date - 2021-12-29T00:07:57+05:30 IST

కుటుంబం కోసం భార్యలు తమ కెరీర్‌ను త్యాగం చేస్తారని

భార్యలు త్యాగధనులు : ఢిల్లీ హైకోర్టు

న్యూఢిల్లీ : కుటుంబం కోసం భార్యలు తమ కెరీర్‌ను త్యాగం చేస్తారని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. భర్త నుంచి వేరైన భార్య సంపాదన సామర్థ్యాన్ని కలిగి ఉండటం ఆమెకు తాత్కాలిక పోషణ భత్యం చెల్లింపును నిరాకరించడానికి తగిన కారణం కాబోదని తెలిపింది. భర్తతో విడిపోయి వేరుగా నివసించే భార్య నిరాశ్రయురాలు, అనాథ కాకూడదనేదే నేర శిక్షా స్మృతి (సీఆర్‌పీసీ) సెక్షన్ 125 లక్ష్యమని తెలిపింది. 


ప్రస్తుత కేసులో ఓ సైనికాధికారి, ఆయన భార్య విడిపోయారు. భార్యకు నెలకు దాదాపు రూ.35 వేలు పోషణ భత్యంగా చెల్లించాలని భర్తను ట్రయల్ కోర్టు ఆదేశించింది. ఈ తీర్పును భర్త హైకోర్టులో సవాల్ చేశారు. దీనిపై జస్టిస్ సుబ్రహ్మణ్యం ప్రసాద్ విచారణ జరిపారు. భర్త నుంచి వేరుపడిన భార్య నిరాశ్రయురాలు, అనాథ కాకూడదనేదే సీఆర్‌పీసీ సెక్షన్ 125 లక్ష్యమని తెలిపారు. ఆమె ఆవేదన, ఆర్థిక ఇబ్బందులను తగ్గించడమే దీని ఉద్దేశమని వివరించారు. ప్రస్తుత కేసులో భార్య గతంలో ఉపాధ్యాయురాలుగా పని చేశారని, ఆమెకు సంపాదించే సామర్థ్యం ఉందని భర్త చేసిన వాదనను తోసిపుచ్చారు. ఆమెకు సంపాదన సామర్థ్యం ఉండటం ఆమెకు పోషణ భత్యాన్ని నిరాకరించడానికి తగిన కారణం కాబోదన్నారు. చాలా సందర్భాల్లో భార్యలు తమ కెరీర్‌ను కేవలం తమ కుటుంబం కోసం త్యాగం చేస్తారన్నారు. 


ఈ కేసు విచారణ సాయుధ దళాల ట్రైబ్యునల్‌లో జరగాలని భర్త చేసిన వాదనను కూడా హైకోర్టు తోసిపుచ్చింది. తాత్కాలిక పోషణ భత్యాన్ని మంజూరు చేస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. అయితే పోషణ భత్యం సొమ్మును తగ్గించి, నెలకు రూ.14,615 చెల్లించాలని తీర్పు చెప్పింది. ఈ దంపతుల పిల్లలు ఆమెతో కలిసి లేనందువల్ల ఈ నిర్ణయం తీసుకుంది.


Updated Date - 2021-12-29T00:07:57+05:30 IST