బాబా రామ్‌దేవ్‌పై వ్యాజ్యాన్ని తోసిపుచ్చలేం : హైకోర్టు

ABN , First Publish Date - 2021-10-26T01:21:32+05:30 IST

యోగా గురువు బాబా రామ్‌దేవ్‌పై డాక్టర్ల సంఘాలు

బాబా రామ్‌దేవ్‌పై వ్యాజ్యాన్ని తోసిపుచ్చలేం : హైకోర్టు

న్యూఢిల్లీ : యోగా గురువు బాబా రామ్‌దేవ్‌పై డాక్టర్ల సంఘాలు దాఖలు చేసిన వ్యాజ్యాలకు విచారణార్హత ఉందని, మొదట్లోనే వీటిని తోసిపుచ్చడం సాధ్యం కాదని ఢిల్లీ హైకోర్టు సోమవారం తెలిపింది.  ఆరోపణలు సరైనవి కావచ్చు, కాకపోవచ్చునని, తాను అలాంటి వ్యాఖ్యలు చేయలేదని ఆయన చెప్పవచ్చునని, పిటిషన్లపై విచారణ జరపవలసి ఉంటుందని పేర్కొంది. 


కోవిడ్-19 మహమ్మారి సమయంలో బాబా రామ్‌దేవ్ అల్లోపతిపై తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేశారనే ఆరోపణలు విచారించదగినవేనా? అనేది ప్రస్తుత దశలో చూడాలని జస్టిస్ సీ హరిశంకర్ చెప్పారు. ప్రాథమికంగా చూసినపుడు విచారణ ప్రారంభించేందుకు అనుమతి ఇవ్వకుండానే ఈ వ్యాజ్యం తోసిపుచ్చదగినది కాదన్నారు. విచారణను ప్రారంభించడంపై వైఖరిని ఈ నెల 27న చెప్పాలని బాబా రామ్‌దేవ్‌ను అంతకుముందు కోర్టు కోరింది. 


హృషీకేశ్, పాట్నా, భువనేశ్వర్‌లలోని అఖిల భారత వైద్య, విజ్ఞాన శాస్త్రాల సంస్థల రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్లు; చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్; పంజాబ్ రెసిడెంట్ డాక్లర్ల సంఘం, మీరట్‌లోని లాలా లజపత్ రాయ్ మెమోరియల్ మెడికల్ కాలేజ్ రెసిడెంట్ డాక్లర్ల సంఘం; హైదరాబాద్‌లోని తెలంగాణా జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ ఈ పిటిషన్లను దాఖలు చేశాయి. 


బాబా రామ్‌దేవ్ అల్లోపతిపై తప్పుదోవ పట్టించే సమాచారాన్ని వ్యాపింపజేశారని పిటిషనర్లు ఆరోపించారు. కోవిడ్-19 సోకినవారిలో అనేక మంది మరణించడానికి కారణం అల్లోపతియేనని చెప్పారని తెలిపారు. 


Updated Date - 2021-10-26T01:21:32+05:30 IST