EVMలపై పిల్‌ను తోసిపుచ్చిన ఢిల్లీ హైకోర్టు

ABN , First Publish Date - 2021-08-03T21:32:11+05:30 IST

ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వినియోగాన్ని నిలిపేసే విధంగా ఎన్నికల

EVMలపై పిల్‌ను తోసిపుచ్చిన ఢిల్లీ హైకోర్టు

న్యూఢిల్లీ : ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వినియోగాన్ని నిలిపేసే విధంగా ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. అంతటితో ఆగకుండా పిటిషనర్‌కు రూ.10,000 జరిమానా విధించింది. ఇది ప్రజా ప్రయోజన వ్యాజ్యం కాదని, ఇది ప్రచారం కోసం దాఖలు చేసిన పిటిషన్ అని వ్యాఖ్యానించింది. 


న్యాయవాది సీఆర్ జయ సుకిన్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీఎన్ పటేల్, జస్టిస్ జ్యోతి సింగ్ ధర్మాసనం మంగళవారం విచారించింది. ఈవీఎంల పని తీరుపై నిర్దిష్టంగా పిటిషనర్ చెప్పలేదని పేర్కొంది. ఈ రిట్ పిటిషన్‌ను అనుమతించడానికి కారణం కనిపించడం లేదని తెలిపింది. వదంతులు, నిరాధార ఆరోపణలను ఆధారంగా చేసుకుని ఈ ‘పబ్లిసిటీ ఇంటరెస్ట్ లిటిగేషన్’ను దాఖలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషనర్ తన వాదనకు మద్దతుగా నాలుగు డాక్యుమెంట్లను సమర్పించారు. వీటిలో ఒకటి వార్తా పత్రికలోని కథనం. ఈవీఎంను చూడకుండా, దాని పనితీరును పరిశీలించకుండా ఈ పిటిషన్‌ను దాఖలు చేశారని మండిపడింది. ఈవీఎంలను పార్లమెంటు, ఎన్నికల కమిషన్ ఆమోదించాయని పేర్కొంది. 


పిటిషనర్ ఈవీఎంల పనితీరుపై పరిశోధన చేసి, సరైన ఆరోపణల ద్వారా మరోసారి తాజా పిటిషన్‌తో హైకోర్టును ఆశ్రయించవచ్చునని తెలిపింది. ఈ రిట్ పిటిషన్‌ను తోసిపుచ్చుతున్నామని చెప్తూ, ఖర్చుల క్రింద రూ.10,000 నాలుగు వారాల్లోగా ఢిల్లీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి జమ చేయాలని ఆదేశించింది. 


పిటిషనర్ తన వాదనలను వినిపిస్తూ, ఈవీఎంలను ఉపయోగించడం వల్ల ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. ఈ యంత్రాన్ని హ్యాక్ చేయవచ్చునని తెలిపారు. 


Updated Date - 2021-08-03T21:32:11+05:30 IST